చందమామ కథలు-మనసులోని మర్మం
ఆరావళి పర్వత ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న రాజ్యాన్ని పరిపాలించే విజయసింహుడికి వివాహమైన చాలా కాలానికి కొడుకు పుట్టాడు. లేకలేక పుట్టిన తమ కుమారుడికి ప్రశంసవర్మఅని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు అతడి తల్లిదండ్రులు.
ప్రశంసవర్మకు కొంత వయసు వచ్చాక విద్యాభ్యాసం నిమిత్తం గురుకులానికి పంపించారతడి తల్లిదండ్రులు. ఆ గురుకులంలో విద్య నేర్చుకున్న ప్రతి విద్యార్థీ తన భావి జీవితంలో నలుగురి మెప్పూ పొందేవిధంగా రాణించేవాడు.
తమ గురుకులానికి విద్యాభ్యాసం నిమిత్తం వచ్చిన బాలుడు రాజకుమారుడైనా, సామాన్య కుటుంబంలోనుంచి వచ్చిన వాడైనా అందరినీ సమదృష్టితోనే చూసే వాడు ఆ గురుకులాన్ని నిర్వహిస్తున్న సర్వజ్ఞాని.
అంతేకాకుండా ఒక్కో విద్యార్థి మనస్తత్వాన్ని బాగా ఆకళింపు చేసుకుని ఎవరికి తగిన రీతిలో వారికి విద్యగరుపుతూ ఉండేవాడు సర్వజ్ఞాని. తమ తల్లిదండ్రుల దగ్గర ఎంతో మంకుతనం చూపించే విద్యార్థులు కూడా గురుకులానికి వచ్చిన తొలిరోజులలో మారాం చేసినా అనతి కాలంలోనో ఎంతో అణకువగా మారిపోయేవారు.
ఒకరోజు గురుకులంలోని విద్యార్థులకు సర్వజ్ఞాని ఒక పరీక్ష పెట్టాడు. అదేమంటే గురుకులానికి దాపుల ఉన్న అరణ్యంలో సర్వరోగాలనూ నయం చేయగల ఒక అద్భుతమైన మూలిక ఉంది.
ఆ మూలిక ఆటవికుల ఆధీనంలో ఉన్న ఒక గూడెంలో వారు పూజించే కొండదేవత పాదాల చెంత ఉన్నది. ఎవరైతే దానిని సంపాదించి తీసుకుని రాగలరో వారు అందరికంటే సమర్థులని సర్వజ్ఞాని భావిస్తాడు.
గురువుగారి ఆశీర్వాదం తీసుకుని విద్యార్థులంతా వెంటనే ప్రయాణమయ్యారు. కాని ప్రశంసవర్మ మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయాడు.
సర్వజ్ఞాని అతడిని ఆశ్చర్యంగా చూస్తూ, “నీకు నీ సమర్థతను నిరూపించుకోవాలని లేదా ఏం? అన్నాడు.
“లేకేం గురుదేవా.. కాని నేను రాజకుమారుడిని కదా... పరీక్షల్లో ఓడిపోయినట్లయితే నా పరువేం గాను? అందుకే అసలు పరీక్షలోనే పాల్గొన కూడదనుకుంటున్నాను,” అన్నాడు ప్రశంసవర్మ
సర్వజ్ఞాని చిరునవ్వు నవ్వి, “నువ్వు రాజకుమారుడివనే విషయం నిజమే, కాని మున్ముందు మహారాజువి కావాలంటే అందుకు కొన్ని అర్హతల్ని కలిగి ఉండాలి. అర్హతలనేవి పుట్టుక వలన రావు. ప్రయత్నం వల్లే లభిస్తాయి,” అన్నాడు.
సర్వజ్ఞాని మాటలు విన్న ప్రశంసవర్మ ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరాడు. అడవిలో నాలుగు కోసుల దూరం ప్రయాణించాక అతడిని ఆటవికులు చుట్టుముట్టారు.
ప్రశంసవర్మఎంతగా పోరాడినప్పటికీ ఆ ఆటవికులు ముందు తలవంచక తప్పలేదు. అతడిని బంధించి తమ నాయకుడి వద్దకు తీసుకుని పోయారు.
ప్రశంసవర్మ పెడరెక్కలు విరిచి కట్టి నాయకుడి ముందు నిలబెట్టారు అతడిని బంధించిన ఆటవికులు. నాయకుడు ప్రశంసవర్మ వైపు చూసి, “ఎవరు నువ్వు?” అని గద్దించాడు. నాయకుడి మాటలకు ప్రశంసవర్మకు అంతులేని కోపం వచ్చింది.
'నాకట్లు విప్పి చూడు. నేనెవరినో నీకు తెలిసేలా చేస్తాను,” అన్నాడు ప్రశంసవర్మ.
అందుకా నాయకుడు కోపం తెచ్చుకోకుండా, “అదీ చూస్తాను. వీడి కట్లు విప్పండిరా,” అని ఆదేశించాడు.
మరుక్షణంలో ఆటవికులు ఆతడి బంధనాలు తొలగించారు. వెంటనే ప్రశంసవర్మ నాయకుడి మీదకు లంఘించి అతడి మెడను దొరకబుచ్చుకున్నాడు. దాంతో ఆటవికులంతా హాహాకారాలు చేశారు. ప్రశంసవర్మరెట్టించిన ఉత్సాహంతో ఆటవికుల నాయకుడిని ముప్పుతిప్పులు పెట్టి చివరకు అతడిని చిత్తు చేశాడు.
తమ నాయకుడు బందీ కావడాన్ని సహించలేని ఆటవికులంతా పెద్దగా కేకలు పెడుతూ, ప్రశంసవర్మ మీదకు దాడికి దిగారు.
కానీ ఆటవికుల నాయకుడు వారిని నివారించి, 'ఈ దొర ఎవరో నిజంగానే గొప్ప వీరుడు. ఇటువంటి వీరుడిని మనం సత్కరించాలి గాని శిక్షించ కూడదు,” అన్నాడు.
ప్రశంసవర్మభుజాలెగరేసి, “ఇప్పుడైనా తెలిసిందా నేనేమిటో?” అన్నాడు. ఆటవికుల నాయకుడు స్వయంగా తానే ఆ మూలికను తెచ్చి ప్రశంసవర్మకు ఇచ్చి, “ఇంకేం కావాలో కోరుకో దొరా,” అన్నాడు.
“మా వాళ్లందరినీ విడిచి పెట్టు” అన్నాడు ప్రశంసవర్మ. ఆటవికుల నాయకుడు ప్రశంసవర్మసహాధ్యాయులందరినీ బంధ విముక్తులను చేసి, వారందరికీ మర్యాదలు చేసి తర్వాత సగౌరవంగా గురుకులానికి సాగనంపాడు.
అద్భుతమైన మూలికను సంపాదించి తెచ్చినందుకు, సహాధ్యాయులను విడిపించుకుని వచ్చినందుకూ, సర్వజ్ఞాని తనను ఎంతో మెచ్చుకుంటాడని భావించాడు ప్రశంసవర్మ
కానీ అందుకు భిన్నంగా సర్వజ్ఞాని ప్రశంసవర్మఇచ్చిన మూలికను అందుకున్నాడే తప్ప ప్రశంసాపూర్వకంగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు.
తర్వాత కొన్ని రోజులకు రాత్రి వేళల్లో గురుకులం చుట్టూ తిరుగుతూ జింక పిల్లల్ని, కుందేళ్లనూ, పశువులనూ మట్టు పెడుతున్నపులిని సంహరించే బాధ్యతను ప్రశంసవర్మకు అప్పగించాడు సర్వజ్ఞాని.
పులి అడుగు జాడల ఆధారంతో అది ఏయే వేళల్లో ఎక్కడెక్కడ తిరుగుతోందో బాగా ఆకళింపు చేసుకుని మూడు రోజుల్లో దానిని మట్టుబెట్టి చచ్చిన పులిని గురుకులంలోకి ఈడ్చుకుని వచ్చి సర్వజ్ఞాని ముందు దాన్ని పడేశాడు ప్రశంసవర్మ. ఈసారి కూడా సర్వజ్ఞాని ఏమీ మాట్లాడలేదు.
చివరకు ప్రశంసవర్మ విద్యాభ్యాసం ముగించి తిరిగి తన రాజ్యానికి వెళ్లే రోజు రానేవచ్చింది. సర్వజ్ఞాని అతడిని దగ్గరకు పిలిచి, “ఇంతకాలమూ నేను చెప్పినపనుల్ని నువ్వు ఇతరులందరికంటే సమర్థవంతంగా చేసినప్పటికీ నానుంచి ఎలాంటి ప్రశంసా నీకు లభించనందుకు ఎంత అసంతృప్తి చెందావో నాకు తెలుసు.
నీ విద్యాభ్యాసం పూర్తయినందున చెబుతున్నాను. గుర్తుంచుకో. ఇతరుల నుంచి ప్రశంసలు ఆశించడం అనేది ఒక మానసిక బలహీనత. నువ్వు చేసిన పనిని ఇతరులు మెచ్చుకోవాలని కోరుకుంటున్నావంటే పనికి సంబంధించి ఉండవలసిన స్థాయిలో నీకు ఆత్మవిశ్వాసం లేదని అర్ధం. పొగడ్తలను ఆశించడం ఒక మానసిక అవసరంగా భావించినంత కాలమూ ఏ వ్యక్తిలోనూ మానసిక పరమైన ఎదుగుదల ఉండదు.
ఒకగురువుగా నేను నిన్ను పొగిడితే నీ సామర్థ్యం ఇంతే సుమా! అనినేను చెప్పి నట్లవుతుంది. అలా కాకుండా నేను మౌనంగా ఉంటే నీ సామర్థ్యానికి ఇది పొగడవలసినంత పని కాదు సుమా! అని చెప్పకనే చెప్పినట్లు నువ్వు భావించి ఉంటే నా నుంచి ప్రశంసలు లభించనందుకు నువ్వు ఇంత అసంతృప్తి చెంది ఉండేవాడివి కాదు.
వెళ్లిరా... నా విద్యార్ధులందరిలో నువ్వే ఉత్తముడివని ఇప్పుడు చెబుతున్నాను. నువ్వు మహారాజు అయ్యాక... ఆత్మ విశ్వాసంతో నీ శక్తి సామర్థ్యాలను ప్రజల సంక్షేమం కోసం వినియోగించి రాజ్యాన్ని సుభిక్షంగా ఉండేలా జనరంజకంగా పరిపాలించు.
నీ తల్లిదండ్రులు నీకు ప్రశంసవర్మఅని పేరు పెట్టినందుకు ఇతరుల నుంచి ప్రశంసలను ఆశించే బలహీనత నీకు ఉన్నదని ప్రజలు చెప్పుకునే విధంగా గాక నీ రాజ్యంలోని ప్రతి పారుడూ నిన్ను వేనోళ్ల పొగుడుతూ మా మహారాజును ఎంత ప్రశంసించినా తక్కువే! ఎందుకంటే అతడు నిజంగా సార్ధక నామధేయుడే అనుకునే విధంగా ప్రవర్తించు, శుభం,' అని చేయెత్తి ఆశీర్వదించాడు.