చందమామ కథలు-భయంకర మానవుడు
ఒక నిర్జనమైన అరణ్యంలో అన్ని రకాల మృగాలూ, పక్షులూ, సింహం పరిపాలనలో సుఖంగా జీవిస్తూండేవి. అందులోకి ఎన్నడూ మనుష్యులు అడుగు పెట్టలేదు.
ఆ అరణ్యంలో ఒకనాడు ఒక బాతు నిద్రపోతుండగా ఒక కల వచ్చింది. ఆ కలలో బాతుకు మానవుడు కనిపించి దాన్ని లాలించి దగ్గిరకి పిలిచాడు. బాతు మానవుడి దగ్గిరికి పోబోతుండగా ఎవరో దాని చెవిలో పెద్దగా అరిచినట్లయింది.
“ఆ మృగం జోలికి మాత్రం వెళ్లకు. అన్ని మృగాల కన్నా అది క్రూరమైనది!” అనే మాటలు విని బాతు తుళ్లిపడి నిద్రలేచి ఆ కంగారులో దిక్కు తెలియకుండా అరణ్యంలో పడి పరుగెత్తసాగింది.
పోగాపోగా బాతుకు సింహం ఉండే గుహా, దానిముందు నిలబడి ఉన్న యువరాజూ కనిపించాయి. ఈ యువరాజును తల్లిదండ్రులు గుహదాటి వెళ్లనిచ్చేవారు కారు! అందుచేత దానికి ప్రపంచజ్ఞానం లేదు. అడవిలో ఉండే ఇతర జంతువులే తెలియవు.
ఒక పక్షి కంగారుగా పరిగెత్తుకు వస్తూండటం చూసి యువరాజు, “ఓ పక్షీ, నీవు ఎవరు? ఏ జాతిదానివి? ఎందుకలా గాభరాగా పరుగెత్తుతున్నావు?' అని అడిగింది.
“మహారాజా, నేను బాతును, బాతుల జాతికి చెందిన దాన్ని. నేను కలలో మానవుడిని చూసి అది మహా భయంకరమైన మృగమనే మాటలు విని భయపడి పారిపోతున్నాను,” అన్నది బాతు.
“వెర్రిదాన్నా నేను మృగరాజును ఉండగా నీకే మృగం భయమూ లేదు. ఆ మానవుడిని చీల్చి చెండాడేస్తాను. వెనుక నాకు కూడా ఇలాగే కలలో మానవుడిని గురించి హెచ్చరిక జరిగింది. కాని నాకే ప్రమాదమూ జరగలేదు, అంటూ సింహం యువరాజు, బాతు వచ్చిన వైపే వేగంగా నడవసాగింది. బాతు గెంతుకుంటూ సింహాన్ని అనుకరించింది.
వారు కొంత దూరం వెళ్లేసరికి దూరాన దుమ్ము లేచింది. “అదుగో మానవుడు వస్తున్నట్టుంది. నువు దాక్కో. నేను వాడి అంతు తేలుస్తాను,” అన్నది సింహం.
కాని తీరా దగ్గిరకు వచ్చేసరికి అది ఒక గాడిద. “ఎవరు నీవు? నీది ఏ జాతి? ఎందుకలా గాభరాగా పరుగెత్తుతున్నావు? అని సింహం గాడిదను అడిగింది.
“మహారాజా, నేను గాడిదను. మాది గాడిదల జాతి. మానవుడు నన్ను ఏమి హింస పెట్టాడో మీరు ఊహించలేరు. ఎన్ని బరువులు మోశాను! ఎన్నేసి దెబ్బలు తిన్నాను! నా శక్తి ఉడిగిన కొద్దీ దెబ్బలు హెచ్చాయి. తిండి తగ్గింది. ఇక వాడు నన్ను చంపేస్తాడు!' అన్నది గాడిద.
“మృగరాజును నేనుండగా నిన్నుఎవరూ చంపలేరు. కాస్సేపు ఆగి నేను మానవుడిని ఎలా చంపుతానో చూడు,” అన్నది సింహం రాజసంగా.
“క్షమించండి, మహారాజా, ఆ మానవుడి కంట పడే ధైర్యం నాకు లేదు, అంటూ గాడిద ముందుకు సాగిపోయింది.
మళ్లీ దూరాన దుమ్ములేచింది. కాని ఈసారి ఒక గుర్రం నురుగులు కక్కుతూ, ఎగరొప్పుతూ అటువైపుకు వచ్చింది. సింహం యువరాజు దాన్ని అపి దాని పేరూ, జాతీ, పారిపోతున్న కారణమూ అడిగింది.
“మహారాజా, మానవుడికి వెరిచి పారి పోతున్నాను,” అన్నది గుర్రం.
“ఇంత పెద్ద జంతువు, ఇంత బలం గలదానివి, మానవుడికి భయపడుతున్నావా? నీకన్న మానవుడికి బలం హెచ్చా?” అని అడిగింది సింహం.
“లేకపోతేనేం, మహారాజా? వాడు క్రూరుడు, ఉపాయశాలి, నాచేత ఇన్నాళ్లూ వెట్టిచాకిరి చేయించుకున్నాడు. నా వీపున ఎక్కి కూచుని, నాకు కళ్లెం తగిలించి, నన్ను కొరడాతో కొట్టి, రికాబు ములుకులతో డొక్కలో పొడిచి వేలాది మైళ్ల దూరం సవారీ చేసి, ముసలిదాన్నయ్యానని నన్ను చంపించి నా చర్మం కాజేయజూస్తున్నాడు!' అన్నది గుర్రం.
సింహం ఎంత ధైర్యం చెప్పినా వినక గుర్రం సాగిపోయింది.
తరవాత ఆ దారి వెంట ఒంటి పరిగత్తుకుంటూ వచ్చింది. అది కూడా మానవుడికి వెరిచే పోతున్నది.
“మిమ్మల్ని అందర్నీ రక్షించే భారం నాది. అందుచేత పారిపోకు. ఇక్కడే ఉండు. నీ వెనుకగా వస్తున్న మానవుడిని ఏం చేస్తానో చూడు,” అన్నది సింహం.
కాని ఒంటె క్షమాపణ చెప్పుకుని మానవుడి కంట బడకుండా ముందుకు సాగిపోయింది. మానవుడిని చూసి పరిగెత్తే ఈ జంతువులకు తనలో ఆపాటి విశ్వాసం లేకపోవటం చూసి సింహం యువరాజు ఆశ్చర్యపడింది.
మరి కాస్సేపట్లో ఒక ముసలి మనిషి అటుగా వచ్చాడు. వాడి నెత్తిన ఒక తట్టా, తట్టలో వడ్రంగపు పనిముట్టూ, తట్టమీద కొన్ని కొయ్య పలకలూ ఉన్నాయి.
వాడు సింహాన్ని చూసి తట్టను దించి సాష్టాంగపడి, “జయం, జయం వముహా రాజా! వెయ్యేళ్లు చల్లగా బతకాలి!" అన్నాడు.
శరీరమంతా ముడతలు పడిన ఆ జంతువును చూసి సింహం విరగబడి నవ్వి, “నీవు ఎవరు? నీది ఏ జాతి? నీవు కూడా మానవుడికి భయపడే వచ్చేస్తున్నావా?” అని అడిగింది. బాతు వడ్రంగిని చూస్తూనే మూర్చపోవడం వల్ల, వాడే మానవుడని సింహానికి చెప్పలేకపోయింది.
“మహారాజా, నేను వడ్రంగిని, వడ్రంగుల జాతివాడిని, ఏలినవారి వద్ద మంత్రిగా ఉండే చిరతపులి తన ఇల్లు జాగ్రత్తగా కట్టిపెట్టమని కబురు పంపితే కట్టడానికి వెళుతున్నాను,” అన్నాడు వడ్రంగి.
“తాహతు ప్రకారం మొదట మాకు కట్టకుండా చిరతపులికి ఇల్లు ఎలా కడతావు? మా ఇల్లు కట్టి మరీ కదులు!” అన్నది సింహం ఆగ్రహిస్తూ,
“ముందు చిరతపులికి ఇల్లు కట్టనివ్వండి, తరవాత తమకు పెద్ద భవంతి కడతాను,” అన్నాడు వడ్రంగి తట్ట నెత్తిన ఎత్తుకుని పోబోతూ.
“వడ్రంగి జాతి జంతువా? నేనెవరో తెలుసా?” అంటూ సింహం తన ముందు కాలి పంజా ఎత్తి విలాసంగా వడ్రంగి రొమ్ము మీద పెట్టి చిన్న తోపు తోసింది. వడ్రంగి ఆ చిన్న తోపుకే వెల్లికిలా పడ్డాడు. వాడి నెత్తిన ఉన్న తట్ట కింద పడి పనిముట్లు చప్పుడు చేశాయి.
“చిత్తం, మీరు కోరినట్టే చేస్తాను,” అంటూ వడ్రంగి ఒక బోను చేసి అందులో సింహం దూరే కంత అమర్చాడు, “లోపలికి వెళ్లి చూడండి! అన్నాడు.
సింహం లోపలికి వెళ్లగానేవడ్రంగి బోను వాకిలి చప్పున మూసేసి, సింహాన్ని తము నగరానికి పట్టుకుపోయేందుకు బయలుదేరాడు.
“ఏయ్, వడ్రంగీ? ఏమిటీ పని?” అని సింహం లోపలినుంచి అరిచింది.
“నేనే మానవుణ్ణి! నన్ను చూసి నువు పారిపోవలిసింది!” అంటూ వడ్రంగి పొట్ట చెక్కలయేలా నవ్వాడు.