చందమామ కథలు-కోడి ఖరీదు
ఒక గ్రామంలో పేరయ్య అనే కుమ్మరి ఉండేవాడు. ఒక ఏడు సంక్రాతి వచ్చింది. పేరయ్యను అతని భార్య కోడిని కొనుక్కురమ్మని అడిగింది. ఆ గ్రామంలోని పెద్ద భూస్వామి అయిన కోటయ్య వద్దకు వెళ్లి పేరయ్య తనకు ఒక కోడిని అమ్మవలసిందిగా అతణ్గీ అడిగాడు.
కోటయ్య పేరయ్యకు ఒక కోడిపెట్టను ఇచ్చి, “చేతిలో ఇప్పుడు డబ్బులేకపోతే, తరవాతనే ఇవ్వు, లెక్క రాయించి ఉంచుతాను,' అన్నాడు. పేరయ్యకు ఈ మాత్రం ఆదరం చూపినవారెవ్వరూ లేరు. అందుచేత అతను కోటయ్య దయాధర్మాలను చాలా సేపు మెచ్చుకుని ఇంటికి వెళ్లాడు. ఆ రోజు పేరయ్యా, అతని భార్యా కోడిని వండుకు తిన్నారు. కొంతకాలం గడిచాక పేరయ్య భూస్వామికి కోడి బాపతు సొమ్ము ఇవ్వటానికి వచ్చాడు.
“ఇప్పుడు నేను పనిమీద ఉన్నాను. ఆ లెక్క చూడాలంటే చాలాసేపు పడుతుంది. తరువాత కనపడు!” అన్నాడు కోటయ్య.
“కోడి ఖరీదు పుచ్చుకోవడానికి లెక్క చూసేదేముందండి. ఎంత ఇయ్యమంటారో చెప్పండి, ఇచ్చి నా దారిన నేను పోతాను," అన్నాడు పేరయ్య.
“అబ్బో, దానికి చాలా పెద్దలెక్క ఉంది" అని కోటయ్య పేరయ్యను పంపేశాడు.
పేరయ్య కోటయ్య చుట్టూ నాలుగైదు సార్లు తిరిగినాక, కోటయ్య కాగితమూ, కలమూ తీసుకుని గంటసేపు ఏవేవో లెక్కలు వేసి చివరకు, “నీ కోడి బాపతు లెక్కంతా కలిసి రెండువందల యాఖై రూపాయల చిల్లర అయింది.
చిల్లర దేమిటిలే, రెండు యాభై ఇచ్చేయి, నీ పద్దు కొట్టేస్తాను,' అన్నాడు.
తానుతిన్న కోడిఖరీదు రెండువందల
యాభై రూపాయలని వినగానే కొంతసేపు పేరయ్యకు నోటమాట రాలేదు. “ఒక్క కోడి ఖరీదు రెండు వందలయాభై రూపాయలా? ఎక్కడా వినను కూడా లేదే? అదేవున్నా బంగారపు కోడా?” అని అతను కోటయ్యను అడిగాడు.
“లెక్కలో తభావతు ఏమీ లేదు. కావలిస్తే నీ ఇష్టం వచ్చిన వాళ్ల చేత లెక్క వేయించుకో నువు తీసుకున్న కోడిపెట్ట ఇప్పటికి ఎన్ని గుడ్లు పెట్టేది? వాటన్నిటి ధర చెల్లించాల్సిందే,” అన్నాడు కోటయ్య. పేరయ్య ఆశ్చర్యం పదింతలయ్యింది.
“ఈ సంగతేమిటో ఏ మునసబుగారి నన్నా అడిగి తెలుసుకోకుండా నేనొక్క దమ్మిడీ ఇయ్యను,” అన్నాడు పేరయ్య. “మహారాజుగా అడుగు, నేనేమైనా కాదన్నానా? అన్నాడు కోటయ్య. మునసబు తనకు అనుకూలంగానే తీర్చు చెబుతాడని కోటయ్యకు తెలుసు.
ఇద్దరూ కలిసి మునసబు దగ్గరికి వెళ్లారు. కోటయ్య మునసబుతో 'మునసబుగారు, ఈ పేరయ్య మొన్నటి సంక్రాంతికి కాక ఆ కిందటి సంక్రాంతికి నా దగ్గర కోడిపెట్ట కొన్నాడు. దాని బాపతు సొమ్ము ఇస్తానంటున్నాడు. ఆ కోడి ఇప్పటికి ఎన్ని గుడ్డు పెట్టేదో, వాటిలో ఎన్ని పిల్లలై మళ్ళీ అవి పిల్లలై పెరిగి, గుడ్లు పెట్టేవో, అంతా లెక్క చూసి రెండు వందల యాఖై రూపాయలు అయిందన్నాను. ఇదుగో లెక్క. మీరు కూడా చూసి దీనిలో తేడా ఉందేమో చెప్పండి. అతని సొమ్ము అన్యాయంగా నేనెందుకు తింటాను?” అన్నాడు.
మునసబు ముక్కి, మూలిగి లెక్క మొత్తం పైనుంచి కిందికి చూసి, “ఏం పేరయ్యా, లెక్కలో తప్పేమీ లేదే?” అన్నాడు.
“నేనప్పుడే చెప్పాను. పేరయ్యకు నా మాటలు నమ్మకం లేక మీదాకా తీసుకువచ్చాడు. చదువురాని వాడు లెక్కా డొక్కా తెలీదు,” అన్నాడు కోటయ్య.
పేరయ్య హతాశుడయాడు. అతను మునసబుగారి దగ్గిర సెలవు తీసుకుని దిగులుగా ఇంటికి పోతుండగా కరణం గారు ఎదురుపడి, “ఏం పేరయ్యా! చాలా విచారంగా ఉన్నావు, ఏం జరిగిందేం?” అన్నాడు. పేరయ్య కరణంతో జరిగిన సంగతంతా చెప్పాడు.
“మునసబూ నిన్ను ముంచాడూ..? మరి నే చెప్పినట్లు చేస్తావా? కోటయ్య దగ్గిరికి వెళ్లి రేపు రచ్చబండ దగ్గర ఈ విషయం పరిష్కారం చేసేటందుకు ఒప్పుకోమను. నీ తరపున నేను సాక్ష్యం చెబుతానని ఆయనతో చెప్పు, అన్నాడు కరణం. పేరయ్య కోటయ్య దగ్గిరికి వెళ్లి ఆమాటే అన్నాడు.
“మళ్లీ రచ్చబండ తీర్పేమిటి? మునసబు గారు చెప్పారు కదా?” అన్నాడు కోటయ్య.
“నాకు మీ ఇద్దరి లెక్కా అర్థం కాలేదు. రచ్చబండ దగ్గిర నలుగురూ ఏం చెబితే అలా చేస్తాను. కరణంగారు నా వైపు సాక్ష్యం చెబుతానన్నారు. కరణంగారంటే మీకు భయం లేదుగా?" అన్నాడు పేరయ్య.
“నాకేం భయం?” అంటూ కోటయ్య రచ్చబండ తీర్పుకు సమ్మతించాడు.
మర్నాడు సాయంకాలం రచ్చబండ దగ్గర అందరూ కూడారు. కాని కరణం గారి జాడ లేదు. కరణం కూడా తనను మోసం చేశాడని పేరయ్య అనుమానించసాగాడు. అందరూ పేరయ్యను చూసి నవ్వుతుండగా చీకటి పడే వేళకు కరణం గారు రానే వచ్చారు.
“నేను రావడం కాస్త ఆలస్యవైనట్టుంది. మరేం లేదు. కూలివాళ్లు ఇవాళ నారుమడి పోసి తీరాలంటే ఒక పందుం విత్తనాలు మంగలాల్లో అప్పటికప్పడు వేయించవలసి వచ్చింది. ఆ పని పూర్తిచేసి వస్తున్నా," అన్నాడు కరణం. “నారుమడి చల్లే విత్తనాలు వేయించడమేమిటి కరణంగారూ? వేయించిన విత్తనాలు మొలకెత్తుతాయా?” అన్నాడు మునసబు వెటకారంగా. 'పేరయ్య తిన్న కోడి, పిల్లల్ని పెట్టగా లేనిది ఈ వేయించిన విత్తనాలు మొలకిత్తవా అని అనుకున్నాను!” అన్నాడు కరణం. అందరూ నవ్వారు. మునసబు చీకట్లోకి జారుకున్నాడు. కోటయ్య పేరయ్య ను కోడి ఖరీదు మల్లీ అడిగిన పాపాన పోలేదు.