చందమామ కథలు-దృష్టి దోషం
సిరిపురంలో సిద్దరామయ్య జ్ఞానిగా అందరి గౌరవం పొందాడు. ఒకరోజు ఆయన రచ్చబండ మీద కూర్చుని చుట్టూ చేరిన కొంత మందితో ఏదో ముచ్చటిస్తుండగా ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఆయనతో, “నా పేరు గంగరాజు. మాది ఘనపురం. ఇక్కడికి మకాం మార్చేద్దాముని ఉంది. ఈ ఊరి గురించి చెప్పండి,” అన్నాడు.
సిద్ధరామయ్య, “దానికేం, ముందుగా మీ ఊరును ఎందుకు ఒదిలేయాలనుకుంటున్నావో కాస్త చెబుతావా?” అని అడగ్గా గంగరాజు 'మా ఊరంతా తుంటరులూ, స్వార్థపరుల మయంగా ఉంది. అక్కడ ఉండాలంటే కష్టంగా ఉంది” అన్నాడు.
సిద్ధరామయ్య , “అలాగ్రెతే మా ఊరు మీ ఊరికేమీ తీసిపోదు," అన్నాడు. గంగరాజు అవాక్కయి “అలాగా...” అంటూ వెళ్లిపోయాడు.
సిద్ధరామయ్య మాటలకి ఆశ్చర్యపడిన సిరిపురం గ్రామస్థులు “ఇన్నాళ్లూ మీరేదో అనుకున్నాం. ఈ ఊరిపైనా ఇక్కడి వాళ్లపైనా ఇదా మీ అభిప్రాయం? అంటూంటే సిద్ధరామయ్య వాళ్ళతో, “ఈ గంగరాజు ఈ ఊళ్ళో మన మధ్యకి చేరకూడదని అలా అన్నాను కాని మరేమీ కాదు. కారణాలు అడక్కండి, సమయం వస్తే నేనే చెబుతాను,” అన్నాడు.
కొన్నాళ్ళ తర్వాత గంగరాజు మరో వ్యక్తిని వెంటబెట్టుకుని వచ్చి సిద్ధరామయ్యతో, 'ఈ రామరాజు కూడా మా ఊరివాడే, మా ఊరి నుంచి మీ ఊరికి మారిపోవాలను కుంటున్నాడు. ఈ ఊరి గురించి మీరు నాకు చెప్పినదంతా విన్నాక కూడా మీతో తానే స్వయంగా మాట్టాడుతానంటే తీసుకుని వచ్చాను,” అన్నాడు.
రామరాజు సిద్ధరామయ్యకి నమస్కరిం చాడు. అతడు “నువ్వు ఈ ఊరికెందుకు రావడం? మీ ఊళ్ళో నీకొచ్చిన కష్టమేమిటి, ఈ ఊరికొస్తే ఒరగబోయేదేమిటి?” అనడిగాడు.
అందుకు రామరాజు వినయంగా, 'మా ఊళ్ళో నాకెలాటి ఇబ్బందీ లేదు. అక్కడున్న వాళ్లు సాత్వికులూ, కలుపుగోలు మనుషులూ కారని కూడా అనలేదు. మీ బోటి పెద్దల సాంగత్యం దొరుకుతుందనే ఇక్కడికి రావాలనుకుంటున్నాను,” అన్నాడు.
సిద్ధరామయ్య, "అయితే నువ్వు భేషుగ్గామా ఊరికి మకాం మార్చెయ్యచ్చు. నువ్వెలాంటి మనుషుల మధ్య ఉండాలనుకుంటున్నావో అలాంటి వాళ్లు ఈ ఊరిలో కోకొల్లలుగా ఉన్నారు,” అన్నాడు.
ఆ మాటలకి గంగరాజు విస్తుపోతూ, 'ఈ మధ్యనేగా మీరు నాతో ఈ ఊరి గురించి మరోలా చెప్పారు? ఇంతలోనే మీ ఊరివాళ్ళలో అంత మార్పు వచ్చిందా?” అన్నాడు.
సిద్ధరామయ్య నవ్వి, 'ఈ ప్రపంచం మనం ఎలా చూస్తే అలా కనపడుతుంది. మనకా చూపునిచ్చేది మన మనస్తత్వం కాక మరొకటి కాదు. మీ ఊరివారందరినీ తుంటరులుగా నువ్వు చూస్తుంటే, రామరాజుకు మాత్రం అక్కడ స్నేహపాత్రులే కనపడుతున్నారు. ఈ ఊరికెందుకు రావాలనుకుంటున్నావో నువ్వు కారణం చెప్పినప్పుడే నీకు నీ మనస్తత్వం తెచ్చిపెట్టిన దృష్టి దోషం ఉన్నదని నాకర్థమయ్యింది. ఈ ఊరికి వచ్చాక కూడా నువ్వు ఇక్కడ వాళ్ళందరినీ ఎలా చూడగలవో నేను గ్రహించాను. నీలాంటివారు మా మధ్యకు రాకూడదని నీకలా చెప్పాను,” అన్నాడు.
ఇది విని గంగరాజు, రామరాజూ, ఇద్దరూ సిద్ధరామయ్యతో, “ఇక మేము మా ఊరువిడిచి పెట్టి పోవాల్సిన అవసరం లేదనిపిస్తున్నది. మా ఊళ్లోనే ఉండి, మా దృష్టి దోషాలన్నీ పోగొట్టుకుంటూ, అప్పుడప్పుడూ ఇలా వచ్చి మిమ్మల్ని కలుసుకుని మంచి సంగతులు తెలుసుకుంటూ ఉంటాం” అంటూ వెళ్లిపోయారు.