చందమామ కథలు-నేను పిసినారినా?
పార్వతి పుట్టింటిలో కొద్ది రోజులు గడిపిన తర్వాత ఒక సాయంత్రం తన ఇంటికి తిరిగొచ్చింది. తలుపు తట్టగానే ఆమె భర్త శివ ఇంట్లోనుండి వచ్చి తలుపు తీశాడు. భర్త తలుపు తీస్తుండగా పార్వతి చూపు ఇంటిముందు అమర్చిన కొత్త కంపెనీ ట్యూబ్‌లైట్ పైకి మళ్ళింది. ముందునుంచి ఉన్న చిన్న లైటు స్థానంలో కొత్తదాన్ని అమర్చారు. ట్యూబ్ లైట్ చూడగానే పార్వతికి సందేహం ముంచుకొచ్చింది. ఈ కొత్త లైటును ఎందుకోసం అమర్చారు?
తన భర్త పిసినారి అని ఆమెకు తెలుసు. పైసా ఖర్చు పెట్టడానికి అతడు పదిసార్లు ఆలోచిస్తాడు. విద్యుత్తును చాలా పొదుపుగా వాడతాడు. మనం ఆదా చేసిన ప్రతి ఒక్క వాట్ కరెంట్ కూడా ఒకవాట్ కరెంట్ ఉత్పత్తికి సమానమని అతడు నిత్యం చెబుతుంటాడు. అలాంటిది అవసరం లేకున్నప్పటికీ ఇప్పుడు తన భర్త ఇంటి ముంగిట అదనపు లైటు ఎందుకు అమర్చినట్టో ఆమెకు అర్ధం కాలేదు.
శివయ్య పిసినారే కావచ్చు. కాని అతడిలో మంచి లక్షణాలు లేవని అర్ధం కాదు. స్వతహాగా తను మంచివాడు. భార్య క్షేమ సమాచారాలు అడిగిన తరవాత అతడు నేరుగా విషయంలోకి వచ్చాడు.
“పార్వతీ! నీ మనస్సులో ఏముందో నాకు తెలుసు. ఇంటి ముంగిట కొత్త లైటు అమర్చినందుకు నీకు ఆశ్చర్యం కలిగిందనుకుంటాను. ఇతడి కేమయిందని, ఎందుకిలా చేశాడని నీవు ఆశ్చర్యపడుతుండవచ్చు కూడా. ఎందుకంటే నేను పిసినారిని అనే భావం నీలో బాగా బలపడిపోయింది.” అని శివయ్య నవ్వాడు.
“మన ఇంటికి ఎదురుగా అనేక కొత్త ఇళ్లను నిర్మించిన విషయం నీకు తెలుసు కదా! తక్కువ ఆదాయం కలవారికోసం ప్రభుత్వం వీటిని కట్టిస్తోంది. వీరిలో చాలా కుటుంబాలు తమ సామాను తీసుకుని ఈ కొత్త ఇళ్లలో చేరిపోయారు. అయితే, ఈ ఇళ్లకు విద్యుత్ అమర్చడం ఇంకా పూర్తి కాలేదు. అందుకే వాళ్లు రాత్రిపూట చీకటిలో మగ్గుతున్నారు.”
“పరీక్షలు దగ్గిర పడుతుండటంతో ఆఇళ్లలో ఉంటున్న పిల్లలకు చాలా కష్టమైపోయింది. మన ఆవరణలో కాస్త వెలుగు వచ్చేలా చేస్తే ఆ పిల్లలు మన వరండాలో కూర్చుని రాత్రిపూట పాఠాలు చదువుకుంటారు కదా అని ఆలోచించాను.”
“అన్ని ధర్మకార్యాలకంటే పిల్లలకు విద్య చెప్పించడమే ఉత్తమోత్తమమైనది. నేను ధనవంతుడిని కాదు. పైగా బోధించడం నాకు చేతకాదు కూడా. కాని చిన్న పిల్లలకు నేను చేస్తున్న ఈ సహాయం ఎంత చిన్నదైనా కావచ్చు నాలో అపరిమిత సంతోషం కలిగిస్తోంది. అదుగో ఆ అడుగుల చప్పుడు వింటున్నావా? చీకటి పడుతోంది. పొరుగిళ్లలోని పిల్లలంతా పాఠశాల పుస్తకాలతో సహా మన వరండా వద్దకు వస్తున్నారు. రా వారిని చూద్దాము.
శివయ్య తలుపులు తెరిచి భార్యతో పాటుగా బయటకి వచ్చాడు. చిన్నపిల్లలు సంతోషంగా వారిని చూసి కేకలు పెట్టారు. అతడు వారికేసి చూసి నవ్వి, “పార్వతీ, విద్యుత్తును వృధాచేయడం అంటే నాకు నప్పదు. దేన్నయినా సరే వృధా చేయడం అంటే నాకు గిట్టదు. ఏ ఉత్పత్తి అయినా, ఏసరుకు అయినా సరే వృధా చేయరాదు. కాని ఇలా అంటున్నానంటే నన్ను పిసినారి కింద లెక్కించవచ్చు అని అర్ధం కాదు. ఏదైనా ధర్మకార్యం కోసం ఖర్చుచేయవలసివస్తే నేను వెనకాడను. ఇప్పుడు చెప్పు. నేను పిసినారినేనా?”
పార్వతి భర్త వైపు కళ్లెత్తి చూసింది. ఈసారి ఆమె కళల్లో ఆరాధనం, గౌరవం కనిపించాయి.