చందమామ కథలు-పరిశుద్ధుడు
“మామయ్యా ఈ ఉత్తరం చూడండి! అంటూ శేఖర్ ఒక కవర్‌ని రాంచంద్‌కి ఇచ్చాడు. “భారతీయ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడి ఉద్యోగం కోసం ఇంటర్‌వ్యూకి రమ్మని కబురు చేశారు. మీరు కనుక నాకు సహాయం చేసినట్లయితే ఈ ఉద్యోగం తప్పక చేజిక్కించుకుంటాను. పాఠశాల నిర్వాహకుడితో, ప్రధానోపాధ్యాయుడితో మీకు పరిచయం ఉంది కదా. నా గురించి ఒకమంచి మాట వారితో చెప్పండి చాలు.'
'శేఖర్! మంచిమాట చెప్పినంత మాత్రాన నీకు ఒరిగేది ఏమీ ఉండదు. ఆ మాటతో పాటు. చాలా పెద్దదాన్నే వారిముందు పెట్టాలి. మరి నీవద్ద అది ఉందా?' అన్నాడు మామయ్య.
“అర్థం అయింది మామయ్యా, ఎంత మొత్తం కావాలన్నా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను, అన్నాడు శేఖర్, “నువు చురుగ్గానే ఉన్నావు శేఖర్," నవ్వాడు మామయ్య.
ఆ మరుసటి దినమే, రాంచంద్ పాఠశాల నిర్వాహకుడిని, ప్రధానోపాధ్యాయుడిని కలసి శేఖర్ గురించి చెప్పాడు. తర్వాత శేఖర్‌తో తెరవెనుక తాను చేయగలిగిన పని పూర్తి చేశానని, ఉద్యోగం రావడం ఇక నిమిషాలమీద పనేనని తెలిపాడు శేఖర్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు:
ఇంటర్‌వ్యూ రోజు రానే వచ్చింది. హాజరైన అభ్యర్థులందరితో శేఖర్ పిచ్చాపాటీగా మాట్లాడుతూ వారంతా పలుకుబడి గల వారి మద్దతుతో వచ్చారని, ఉద్యోగం కోసం పాఠశాల యాజమాన్యం చేతులు తడపడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని తెలుసుకున్నాడు.
ఒక ఉద్యోగం కోసం ఇంత పోటీ ఉంటుందని ఊహించని శేఖర్ వెంటనే మామయ్య రాంచంద్‌ను సెల్ ద్వారా సంప్రదించి తాను ఉద్యోగం కోసం లక్షరూపాయల వరకు కూడా ఇవ్వగలనని ఈ విషయాన్ని ఎంపికదార్లకు తెలిపి తనకు అనుకూలంగా ఒప్పందం కుదుర్చుకోవలసిందని కోరాడు.
రాంచంద్ కూడా ఎంపిక కమిటీకి ఈ విషయం తెలియజేశాడు, అయితే ఎంపిక కమిటీ పెద్దవారి నుండి ఏ సిఫార్సు తెచ్చినట్లు కనబడని అరవింద్ అనే మామూలు వ్యక్తిని ఆ ఉద్యోగానికి ఎంపిక చేసింది.
శేఖర్ కుప్పగూలిపోయాడు. ఏం మనుషులో? వాళ్లకు లక్షరూపాయల వరకు ఇస్తానని చెప్పినా పట్టించుకోలేదు, వెంటనే రాంచంద్‌ను సంప్రదించాడు. రాంచంద్ కూడా ఆగ్రహించాడు. వాళ్లిద్దరూ ప్రధానోపాధ్యాయుడితో వాదులాటకు దిగారు, ప్రధానోపాధ్యాయుడు స్పష్టంగా చెప్పేశాడు. “రాంచంద్ గారూ! ఇది పాఠశాలే గాని సంత కాదు. సంతలో మీకు నచ్చిన ధర పెట్టి సరుకులు కొనగలరు. అపవిత్రమైన పని చేయటానికి మీరు ఒక పవిత్రమైన చోటుకు వచ్చారు. ఉపాధ్యాయుడి కొలువుకు వెల కట్టి మరీ కొనడానికి మా వద్దకు వచ్చారు. క్షమించాలి. మేం దాన్ని అమ్మలేము. ఇక్కడ ఉపాధ్యాయులు పిల్లలకు జ్డాన భోధ చేయడానికి ఉన్నారు. చిన్నపిల్లల్లో నిజాయితీ అనే విత్తనాలను చల్లడం కోసమే వారు ఇక్కడ ఉన్నారు.
లంచమివ్వడానికి సిద్ధపడి పాఠశాల పవిత్రతకే భంగు కలిగించదలిచిన వాడు కాకుండా నిజాయితీ కలిగిన వాడే ఈ పనిని చక్కగా నెరవేర్చగలడు. శేఖర్‌తో సహా పలువురు అభ్యర్థులను పరిశీలించిన తర్వాత అరవింద్ ప్రతిభావంతుడే కాక, స్వచ్చమైన వ్యక్తిగా కూడా గుర్తించాము. అందుకే ఈ ఉద్యోగానికి అతడినే ఎంపిక చేశాము.
రాంచంద్ నోట మాట పడిపోయింది. అతడు తల దించుకుని ప్రధానోపాధ్యాయుడి. గది నుంచి అవమానంతో బయటకి వచ్చాడు.