చందమామ కథలు-కన్నీటి విలువ
రామవరంలో రామయ్య ఓ మధ్యతరగతి రైతు. ఆయన ఆస్థల్లా నాలుగెకరాల మాగాణి. మూడెకరాల మెట్ట. అయితే "పేద సాదలను, అవసరార్దులను ఆదుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. దానం చేయడంలో బొత్తిగా ఎముకలేని చెయ్యి. భార్య విశాలాక్షి కూడా భర్తకు తగ్గదే.
అదే ఊళ్లో ఉండే చంద్రయ్య అనే సన్నకారు రైతు రామయ్యకు చిన్ననాటి స్నేహితుడు. ఇద్దరూ ఎంతో కలివిడిగా ఉంటారు. చంద్రయ్యకు మిత్రుడి అతి మంచితనం సుతరామూ నచ్చేది. కాదు. ప్రతి రాత్రీ భోజనాలు ముగించుకుని రచ్చబండ దగ్గర కలుసుకున్నప్పుడు “నీ అతి మంచితనం ముందుముందు ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందోనని ఒక్కసారైనా, ఆలోచించావా. నీ ఇద్దరు ఆడపిల్లల బాగో ముందు ఆలోచించడం అలవర్చుకో.' అని రామయ్యను హెచ్చరించేవాడు చంద్రయ్య, మౌనమే సమాధానంగా ఓ చిరునవ్వుతో సరిపెట్టేసేవాడు రామయ్య.
ఇదిలా ఉండగా ఒకరోజు ఉదయానే రామయ్య, చంద్రయ్యలు రచ్చబండ దగ్గర తారసపడ్డారు. వాళ్ళిద్దరూ సంభాషించుకుంటుండగా ఓ యువకుడు అక్కడికి ఆందోళనగా వచ్చాడు. 'అయ్యా, నా పేరు శివయ్య. నాది పొరుగునే ఉన్న రావిపల్లి. 'నేనురాతి పనులు చేసుకుంటాను. రెండు రోజులనుండి మా అమ్మకు తెగ సుస్తీ చేసింది. మూసిన కన్ను తెరవడం లేదు. ఆచారిగారి దగ్గరకి తీసుకెళితే వైద్యానికి ఎనిమిది వందలు దాకా ఖర్చవుతుందని చెప్పారు. కాస్త దయ తలచండి. జీవితాంతం రుణపడి ఉంటాను,” అని వల వలా ఏడ్చేశాడు.
రామయ్య కొద్దిసేపు ఆలోచించి 'కుదువపెట్టడానికి ఏదన్నా వస్తువుందా?' అని అడిగాడు.
కళ్లు తుడుచుకున్న శివయ్య 'నా పెళ్లికి అత్త తరపు వారు పెట్టిన ఉంగరం ఉంది. తీసుకుని సాయం చేయండి,” అని వేలికున్న ఉంగరాన్ని తీసి రామయ్య చేతిలో పెట్టాడు.
రామయ్య దానిని ఎగాదిగా చూసి, “ఇది అసలుదో నకిలీదో తెలియడం లేదు. నకిలీని అసలుగా చూపించి ఎమార్చడం ఈ రోజుల్లో పరిపాటయిపోయింది' అని జేబులో నుండి రెండు వందలు తీసి శివయ్య చేతిలో పెట్టాడు.
శివయ్య గుడ్డ నీరు కుక్కుకుని, “అయ్యా, తమరు, సందేహించనవసరం లేదు, అది నిఖార్భయిన బంగారమే. మీ మిత్రుడి సలహా కూడా తీసుకుని మరో ఐదారు వందలన్నా ఇప్పించండి. చావు బతుకుల్లో ఉన్న మా అమ్మను బతికించుకుంటాను," అని దీనంగా వేడుకున్నాడు.
రామయ్య కన్నెర్రజేసి 'ఇష్టమైతే తీసుకో, లేకుంటే ఆ రెండొందలు కూడా ఇచ్చేసి నీ వస్తువుతో వెనుదిరుగు," అని మండిపడ్డాడు. శివయ్య మారుమాట్లాడకుండా కళ్లు తుడుచుకుని చకచకా అడుగులేస్తూ వెళ్లిపోయాడు.
శివయ్య అటు వెళ్లగానే చంద్రయ్యతో
రామయ్య “నాతో రావిపల్లి వరకు రాగలవా?' అని అడిగాడు. ధర్మాత్ముడని అందరితో పొగడ్తలందుకునే రామయ్య ప్రవర్తనలో మరో కోణాన్ని చూసి లోపల బాధపడుతున్న చంద్రయ్య అయిష్టంగానే ఒప్పుకుని మిత్రుడితో బయలుదేరాడు.
ఇరువురూ రావిపల్లి చేరీచేరగానే సరాసరి ఆచారి గారి ఇంటిని సమీపించారు. కిటికీలో నుండి లోపలికి తొంగి చూసిన రామయ్యకు ఆచారిగారిని ఏడుస్తూ ప్రాధేయపడుతున్న శివయ్య కనిపించాడు.
“ఆచారిగారూ, సమయానికి మీరడిగిన మొత్తం సమకూరలేదు. ఈ రెండొందలు తీసుకుని వైద్యం ప్రారంభించండి. మిగతా మొత్తం సాయంత్రానికల్లా ఎలాగోలా సర్దుబాటు చేస్తాను,' అని ఆచారి కాళ్లావేల్లా పడుతున్నాడు శివయ్య, ఆచారి ససేమిరా అంటున్నారు.
అదే సమయానికి రామయ్య లోపలికి ప్రవేశించి, 'ఆచారిగారూ, రోగులతో చెలగాటమాడటం తగదు. కాసులతో ముడిపెట్టి తిరిగి తీసుకురాలేని ప్రాణాన్ని తీయకండీ. ఇదిగో, ఈ ఆరొందలు కూడా తీసుకుని శివయ్య తల్లికి వెంటనే వైద్యం ప్రారంభించండి,' అని మందలించి, ప్రక్కనే నిలబడ్డ శివయ్య, అతని భార్యకు థెర్యవచనాలు చెప్పి, జేబులో నుండి ఉంగరం తీసి శివయ్య చేతిలో పెట్టి, 'దగ్గరుండి వైద్యం చేయించుకుని నీ తల్లిని బ్రతికించుకో, ఆ భగవంతుడు తప్పక సాయంచేస్తాడు, అని సానుభూతి ప్రదర్శించి మరీ బయటికొచ్చాడు రామయ్య.
మిత్రుడి ప్రవర్తన చంద్రయ్యకు అయోమయంగా తోచింది. ఇంతవరకు రామయ్య వస్తువులు కుదువపెట్టుకున్న దాఖలాలు లేవు. “సిసలైన బంగారం కుదువపెట్టినా నకిలీదేమో అని అనుమానించిన నువ్వు, ఎండలో ఇంతదూరం. నడిచివచ్చి మరీ సాయపడటం లోని ఆంతఠ్యమేమిటి మిత్రమా!' అని అడిగేశాడు చంద్రయ్య కుతూహలం ఆపుకోలేక.
రామయ్య నవ్వి, 'అపాత్రదానం పనికి రాదు. నేను అసలా, నకిలీనా అని అనుమానించింది బంగారాన్ని కాదు. శివయ్య కన్నీటిని. ఈ రోజుల్లో చెడు వ్యసనాలకు బానిసలుగా మారిన వారు ఎన్నో మోసాలకు తెగబడటం ప్రతి రోజూ చూస్తున్నాం. నిజానిజాలు తెలుసుకోకుండా సహాయం చేస్తే ఆ సహాయం ఎన్నో అనర్థాలకు దారితీయగలదు.
సహాయం చేసేవాడెప్పుడూ అర్హులకే చేయాలి తప్ప అనర్హులకు కాదు. మనకు ఇప్పుడు ప్రత్యక్షంగా తెలిసిందిగా, శివయ్య కన్నీటి విలువ ఓ నిండు ప్రాణమని!" అని వివరించాడు. విచక్షణ దూరదృష్టితో కూడిన రామయ్య మంచితనాన్ని చంద్రయ్య మనస్పూర్తిగా అభినందించకుండా ఉండలేక పోయాడు.