చందమామ కథలు-సరైన తీర్పు
నీరవుడు తన పెరటిలో నాటిన కొబ్బరి మొక్క ఏపుగా ఎదిగి కొంతకాలానికి బాగా కాపుకి వచ్చింది. అతను మొక్కను నాటిన సమయంలో అక్కడ ఏ ఇల్లు లేదు. తరవాత గిరిధరుడు అతడి ఇంటి పక్కనే తన ఇల్లు కట్టుకున్నాడు.
అయితే నీరవుడి ఇంట్లో పెరిగిన కొబ్బరి చెట్టు గిరిధరుడింటి వైపుకు వాలింది. కాసిన కాయలన్నీ అటువైపే రాలిపోతుండేవి. వాటిని గిరిధరుడు వెనక్కు ఇవ్వకుండా తన స్వంతానికి వాడుకునేవాడు. నీరవుడు చెట్టెక్కి దింపుకోబొతే చెట్టు తన ఇంటివైపు వంగి ఉన్నందున అవి తనకే దక్కుతాయని మొండిగా వాదించాడు.
జరిగింది అన్యాయంగా భావించిన నీరవుడు తిన్నగా వెళ్లి గ్రామాధికారి పెంచలయ్యకు మొరపెట్టుకున్నాడు. అదివిన్న వెంటనే గ్రామాధికారి, గిరిధరుడికి కబురు పెట్టి పిలిపించాడు.
“చెట్టును నేనేం వాలమనలేదే! నా వైవుకు వచ్చిన వాటిని అనుభవించే హక్కు నాకు ఉండదా!' అన్నాడు గిరిధరుడు అడ్డంగా వాదిస్తూ.
అతనికి ఎంత చెప్పినా వినకుండా తిరుగుముఖం పట్టాడు, గ్రామపెద్ద పెంచలయ్య సమయం వచ్చినప్పుడు, సరైన తీర్పునిస్తానన్నాడు.
అలా కొంత కాలం గడిచింది. ఈ మధ్య కాలంలో కొబ్బరి బాగా విరగకాసినా సరే నీరవుడికి ఏమాత్రం దక్కలేదు.
ఒక ఏడాది పోయాక ఓరోజు గిరిధరుడింట్లో వారందరికీ దురదలు పట్టుకున్నాయి. కారణం తెలీక తంటాలు పడుతూంటే కొబ్బరి చెట్టు పైకి ప్రాకిన దూలగొండి తీగ నూగు పడటం వల్ల దురదలు వచ్చినట్లుగా పనివాడు చెప్పాడు.
వెంటనే గిరిధరుడు ఆగ్రహంతో, “నీ ఇంట్లో పుట్టిన దూలగొండిని వెంటనే పెకిలించి పారెయ్యి. అది నా ఇంటి మీదికి ఎగప్రాకింది. దీనివల్ల నానా నరకంగా ఉంది' అన్నాడు.
దాన్ని పెరికి పారెయ్యాల్సిన అవసరం తనకు లేదని, పక్కింట్లోకి పాకితే తనేం చేయగలనని మొండిగా చెప్పేశాడు నీరవుడు. గిరిధరుడు ఆవేశంలో దురదగొండి తీగను పీకబోయేసరికి ఆ కాయలన్నీ పేలిపోయి, ఇల్లంతా జల్టుకుపోయి మరింతగా దురదలు తగులుకున్నాయి.
తనకు జరిగిన మోసాన్ని గ్రామపెద్దకు చెప్పుకుందామని వెల్లాడు గిరిధరుడు.
“నీ ఇంట్లోకి వాలినవాటిని అనుభవించే హక్కుందని నీవే అన్నావుగా! నీ ఇంట్లోకి వచ్చిన కొబ్బరి కాయలు నీ సొత్తయునప్పుడు. దానిమీదకు విగబ్రాకిన దురదగొండి మాత్రం నీదెందుక్కాకూడదో చెప్పు? మంచి చెడు రెండూ సమానంగా అనుభవించాల్సిందే కదా!' అన్నాడు పెంచలయ్య.
అంతే, గిరిధరుడి నోటమాట రాలేదు.
చివరికి చేసేది లేక దారికి వస్తూ కొబ్బరికాయల విలువను నీరవుడికి తిరిగిస్తానని, దురదగొండిని సమూలంగా పెకిలించమని చెప్పి వేడుకున్నాడు.
అయితే గిరిధరుడికి బుద్ధి చెప్పడానికి, పెంచలయ్యే నీరవుడికి ఈరకంగా సలహా ఇచ్చి గిరిధరుడిని దారికి తెచ్చిన సంగతి మాత్రం ఎవరికీ తెలీదు.