చందమామ కథలు-మోక్షర్హత
మళ్లీ పౌర్ణమి వచ్చింది. పిండారబోసినట్టున్నవెన్నెలలో తాతయ్య పడకకుర్చీలో కూర్చున్నాడు. పిల్లలు ఆయన చుట్టూ కూర్చున్నారు. తాతయ్య ఏదో ఆలోచించుకుని తనలో తాను నవ్వుకున్నాడు.
“మనసా బధ్యతే జీవో, మనసైవ విముచ్యతే దేవదాసో గతో బంధం వేశ్యాదాసో విమోచితః."
“అంటే ఏమిటి తాతయ్యా?” అని పిల్లలు అడిగారు.
తాతయ్య వెంటనే జవాబివ్వక
"రొండి నుంచి పొడుంకాయ తీసి, చిటికెడు పొడుం పట్టి, పెద్ద చప్పుడు చేస్తూ పీల్చి,“
ఈ శ్లోకానికి అర్ధమేమిటి అని కదూ అడుగుతున్నారూ? చెబుతాను వినండి. జీవుడు
మనసుచేత బంధించబడి ఉంటాడు సుమా! ఆ మనసు వల్లనే మోక్షాన్ని కూడా పొందుతాడు! వెనకటికి దేవదాసు అనేవాడు నరకానికి పోగా వేశ్యాదాసు ఏకంగా మోక్షం పొందాడు గదా! అని,' అన్నాడు.
“దేవదాసు ఎవరు తాతయ్యా... వేశ్యా దాసు మోక్షం ఎందుకు పొందాడు? ఆ కథ ఏమిటి తాతయ్యా?” అని పిల్లలు తలా ఒక ప్రశ్నవేశారు.
“ఆ కథ చెప్పమంటారా ఏమిటి? చెబుతాను వినండి మరి!" అన్నాడు తాతయ్య.
అనగా అనగా అవంతీ అని ఒక నగరం. ఆ నగరంలో ఒకే వయసు గల ఇద్దరు 'బాహ్మణ యువకులు ఉండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే వాళ్లనడతలో మట్టుకు చాలా తేడా ఉండేది. ఆ ఇద్దరిలోనూ నీతిమంతుడు, ఎప్పుడూ దేవపూజా, జపాలూ చేస్తుండేవారు. సాయంకాలం భజన చేసేవాడు. వాడి ధోరణి చూసి అందరూ వాణ్ణి దేవదాసు అని పిలిచేవారు. ఇక రెండో వాడున్నాడే వాడు ఎప్పుడూ వేశ్యల ఇళ్లలో ఉంటూ సుఖాలతో కాలం వెళ్లబుచ్చేవాడు. ఇకనే, వాడికి వేశ్యాదాసు అని పేరు పడిపోయింది.”
అయిందా? వీళ్ళిద్దరూ పైకిఎలా ఉన్నప్పటికీ వీళ్ల మనసులెలా ఉండేవని అడగరేం? దేవదాసు ఉన్నాడే, వాడెప్పుడూ తన మనసులో, ఆహా ఈ వేశ్యాదాసుగాడు ఎంత సుఖపడిపోతున్నాడు! నాకు ఒక్క సుఖమూ లేదు కదా, అని కుళ్లుతూ ఉండేవాడు. ఇక వేశ్యాదాసేమో తన స్నేహితుడు చక్కని పుణ్యజీవితం గడుపుతున్నాడనీ, వాడికి మోక్షం వస్తుంది గదా అనీ లోలోపల అనుకునేవాడు.
ఈవిధంగా వాళ్లు కొంతకాలం జీవించి చనిపోయారు. అప్పుడు ఏమయిందో తెలుసా యముల వాళ్లు వచ్చి దేవదాసును నరకానికి, విష్ణు కింకరులు వచ్చి వేశ్యాదాసును మోక్షానికి ఉన్న ఫళానా తీసుకుని పోయారు.
“ఇదేమి అన్యాయం? ఆ వేశ్యాదాసుకు మోక్షమూ, నాకు నరకమూనా?” అన్నాడు దేవదాసు.
“ఏం చేస్తాం? నీ మనసెప్పుడూ వేశ్యల మీదనే ఉండి, ఆ వేశ్యాదాసు అస్తమానమూ మోక్షం గురించే ఆలోచించేవాడు. ఆత్మశుద్ధి ముఖ్యం గాని చేసే పనులు కావు!” అని జవాబు చెప్పారు యముల వాళ్లు.
“నాకష్ణే విద్యతో దేవో, నపాషాణే, నమృణ్మయే, భావేతు విద్యతే దేవస్తస్మాద్భావోహి కారణమ్"
(దేవుడు కర్రలోనూ, రాతిలోనూ, మట్టి లోనూ లేడు సుమా, మన బుద్దిలోనే ఉన్నాడు. అన్నిటికీ బుద్దే మూలకారణం!) అన్నాడు తాతయ్య.