బ్రిటిష్ రాణి లేదా రాజు పరిపాలన (1859 - 1947)
ఈ దశలో చేసిన చట్టాలను భారత ప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలు అంటారు.
భారత రాజ్యాంగ చట్టం - 1858(Government of India Act 1858)
1857 సిపాయిల తిరుగుబాటుతో భారతదేశంలో కంపెనీ పరిపాలన అంతమై చక్రవర్తి (బ్రిటీషు రాజు లేక రాణి) పరిపాలన ఏర్పడింది. ఇది భారత రాజ్యాంగ చరిత్రలో ఒక నూతన అధ్యాయం. బ్రిటీషు రాణి 1858 నవంబరు 1న భారత పరిపాలనా అధికారాన్ని నేరుగా చేపడుతూ ఒక ప్రకటన జారీ చేసింది.
1858 నుండి రాజు లేదా రాణి నేరుగా అధికారాన్ని చేపట్టడం వల్ల, ఆ తర్వాత చేసిన చట్టాలను / సవరణలను భారత ప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలు అంటారు.
ముఖ్యాంశాలు
గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు. మొదటి వైస్రాయ్ - ఛార్లెస్ కానింగ్.
దేశంలో బ్రిటీష్ రాణి యొక్క మొట్టమొదటి ప్రత్యక్ష ప్రతినిధి వైస్రాయ్. దేశ పాలన బ్రిటీషు రాణి పేరుతో ఇతను నిర్వహిస్తారు.
1784లో ప్రవేశపెట్టిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మరియు కోర్ట్ ఆఫ్ డైరక్టర్స్ అనే ద్వంద్వ పాలన రద్దయింది.
భారతదేశంలో అత్యున్నత స్థానాన్ని కలిగిన వైస్రాయ్‌ని రాజ ప్రతినిధిగా 5 సం॥ కాలానికి నియమించడం జరిగింది. ఇతనికి సహాయంగా ఒక కార్యనిర్వాహక మండలి ఉండేది.
“భారత రాజ్య కార్యదర్శి” అనే కొత్త పదవిని సృష్టించారు. ఇతడు బ్రిటీషు మంత్రివర్గానికి చెందినవాడు. అన్ని విషయాలలో ఇతనిదే తుది నిర్ణయిం. ఇతనికి సహాయంగా 15 మంది సభ్యులతో సలహా మండలి ఏర్పాటు చేశారు. మొదటి కార్యదర్శి ఛార్లెస్ వుడ్.
ప్రత్యేక వివరణ: వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్ మధ్య తేడా: రెండు హాదాలు ఒకరికే, ఉంటాయి. బ్రిటీష్ రాజు/రాణి ప్రతినిధిగా ఉంటే వైస్రాయ్ అని, భారతదేశ పరిపాలనాపరంగా అధిపతిగా ఉంటే గవర్నర్ జనరల్ అని అంటారు.
ప్రత్యేకత
1858 చట్టాన్ని దేశంలో పరిపాలనాపరమైన అంశాలను, ముఖ్యంగా ప్రభుత్వాన్ని నియంత్రించడానికి ఇందుకు సంబంధించిన మార్పులను ఇంగ్లండులో చేశారే తప్ప, భారతదేశంలో ఉన్న పరిపాలనా వ్యవస్థలకు ఎలాంటి మార్పులు చేయలేదని విమర్శకుల అభిప్రాయం.