భారత కౌన్సిల్ చట్టాలు లేదా శాసనసభ చట్టాలు (Indian Council Acts)
1857 సిపాయిల తిరుగుబాటు తరువాత దేశంలో అవసరమయిన పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టుటకు మరియు భారతీయుల సహకారాన్ని పొందటానికి బ్రిటీషు ప్రభుత్వం అనేక చట్టాలను రూపొందించింది. వీటినే కౌన్సిల్ చట్టాలు అంటారు.
కౌన్సిల్ చట్టం - 1861
భారతదేశంలో శాసన నిర్మాణ ప్రక్రియలో మొట్టమొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యాన్ని కల్పించారు.
- వైస్రాయ్ కొంతమంది భారతీయులను అనధికార సభ్యులుగా కౌన్సిల్‌లోకి నామినేట్ చేశారు.
- ఈ విధంగా నామినేట్ చేయబడినవారిలో బెనారస్ రాజు, పాటియాలా మహారాజు మరియు శ్రీ దినకర్‌రావు వున్నారు.
- 1773 చట్టం ద్వారా రద్దు చేయబడిన బాంబే మరియు మద్రాస్ ప్రెసిడెన్సీల శాసనాధికారాలను పునరుద్ధరించారు.
ప్రావిన్సులతో నూతన లెజిస్లేటివ్ కౌన్సిళ్ళను ఏర్పాటు చేశారు.
కౌన్సిల్‌లో కార్యక్రమాలను సజావుగా నిర్వహించదానికి అవసరమయిన సూత్రాలను, నియమాలను జారీచేసే అధికారాన్ని వైస్రాయ్కి ఇవ్వడం జరిగింది.
1859లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టిన “ఫోర్టు పోలియో” (మంత్రిత్వ శాఖలుగా విధుల కేటాయింపు) పద్దతిని గుర్తించి కొనసాగించారు. తద్వారా వైస్రాయ్ కౌన్సిల్ మరిన్ని శాఖలను నిర్వహించే అవకాశాన్ని ఈ చట్టం కల్పించింది. శాసన కౌన్సిళ్ళ సమ్మతి లేకుండానే ఆర్డినెన్సులను జారీచేసే అధికారాన్ని వైస్రాయ్‌కు కల్పించారు. 1860లో బడ్జెట్ పద్దతిని ప్రవేశ పెట్టారు.
కౌన్సిల్ చట్టం - 1892
1861 కౌన్సిల్ చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి ఈ చట్టాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడటం, విద్యావంతులయిన భారతీయులు బ్రిటీషు పాలనలోని లోపాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తున్న నేపథ్యంలో ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. కేంద్ర శాసనసభలో అనధికార సభ్యులను 10కి తక్కువ కాకుండా 16కు మించకుండా ఉండే విధంగా, అదే విధంగా రాష్ట్ర శాసనసభలలో 8 మందికి తక్కువ కాకుండా 20 మందికి మించకుండా నియంత్రించారు.
కేంద్ర శాసన మండలికి ఎంపికైన భారతీయులు - గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ మరియు రాస్ బీహారీ ఘోష్. ఈ చట్టం ద్వారా శాసన మండలి అధికారాలను విస్తృతం చేశారు. బడ్జెట్ ను చర్చించటం, మొదలగు అధికారాలను కల్పించారు.
ప్రజూ ప్రయోజనాల దృష్ట్యా, శాసనసభల్లో ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేయడానికి సభ్యులకు అవకాశం కల్పించారు. అయితే ఈ ప్రశ్నలను అడగడానికి గవర్నర్ మరియు గవర్నర్ జనరల్‌ల ముందస్తు అనుమతి పొందాలి. శాసనసభలలో తమ స్థానం నామమాత్రమేనని గ్రహించిన భారతీయులు ఈ చట్టాన్ని వ్యతిరేకించారు.