Evolution of Indian Constitution-11

TSStudies
లిన్‌లిత్‌గో - ఆగస్టు ప్రతిపాదనలు (1940) [Linlithgow Commission-1940]
  • భారత వైస్రాయ్‌ లార్డ్‌ లిన్‌లిత్‌గో ఆగస్టు 8, 1940 న కొన్ని ప్రతిపాదనలను చేశాడు.
ముఖ్యాంశాలు
  • రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత భారతదేశానికి డొమీనియన్‌ ప్రతిపత్తి కల్పించే విషయాన్ని పరిశీలించడం.
  • అలాగే,రాజకీయ పార్టీల ప్రాతినిధ్యంతో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయడం.
  • వివిధ రాజకీయపార్టీలకు చెందిన ప్రతినిధులకు గవర్నర్‌ జనరల్‌ కార్య నిర్వాహక మండలిలో సభ్యత్వం కల్పించి మండలిని విసృతం చేయడం.
  • రాజ్యాంగ పరిషత్తులో అల్పసంఖ్యాక వర్గాల వారికి సముచిత ప్రాతినిధ్యం ఇవ్వడం
  • అన్ని రాజకీయపార్టీలకు, సంస్థానాల ప్రతినిధులతో కూడిన యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేయడం. ఈ ప్రతిపాదనలను రాజకీయ పార్టీలు తిరస్కరించాయి.
క్రిప్స్‌ ప్రతిపాదనలు (1942) [Cripps Mission-1942]
  • బ్రిటన్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ 1942 మార్చి 11వ తేదీన ఒక ప్రకటన ద్వారా భారత రాజ్యాంగ సమస్య విషయంలో అక్కడి నాయకులతో సంప్రదింపుల నిమిత్తం క్యాబినెట్‌ మంత్రి అయిన సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్స్‌ను భారతదేశానికి పంపిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. క్రిప్స్‌ 1942 మార్చి 22వ తేదీన భారతదేశానికి వచ్చాడు.
ప్రతిపాదనలు
  • రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి బ్రిటిష్‌ ప్రభుత్వం మొదటిసారిగా అధికారికంగా ప్రకటన చేసింది.
  • భారతదేశానికి అవసరమైన కొత్త రాజ్యాంగాన్ని నిర్మించుటకై ఎన్నుకోబడిన రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటవుతుంది. భారతదేశానికి వీలయినంత త్వరలో స్వయంప్రతిపత్తి ఇవ్వడం జరుగుతుంది.
  • రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమలులో ఉన్న రాజ్యాంగాన్ని కలిగి ఉండవచ్చు. లేదా నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకోవచ్చు.
  • గవర్నర్‌ జనరల్‌ కార్య నిర్వాహక మండలిలో ఒక భారతీయునికి సభ్యత్వం ఇస్తారు.
  • క్రిప్స్‌ ప్రతిపాదనలను గాంధీ తీవ్రంగా విమర్శించాడు. దివాళా తీస్తున్న బ్యాంకు మీద ముందస్తు తేదీని వేసిన ఒక చెక్కు అని వ్యాఖ్యానించారు (Post Dated Cheque Drawn on the Crashing Bank).
సి.ఆర్‌.ఫార్ములా 1944) (సి.రాజగోపాలాచారి సూత్రం) [C. R. formula-1944]
  • ముస్లిం లీగ్‌ సహకారం కోసం మరియు మత సమస్యల పరిష్కారం కొరకు 1944 మార్చిలో గాంధీ ఆమోదంతో సి.రాజగోపాలాచారి ఒక సూత్రాన్ని కాంగ్రెస్‌ తరపున ప్రతిపాదించారు. స్వయం నిర్ణయాధికార హక్కు కోసం పాకిస్తాన్‌ను ఏర్పాటు చేయాలనే ముస్లింలీగ్‌ కోరికను ఆయన అంగీకరించారు. కాంగ్రెస్‌కు కావలసినది స్వతంత్ర సాధన. దానికోసం ముస్లిముల సహకారాన్ని పొందడానికి ఎంత నష్టాన్నైనా భరించడానికి కాంగ్రెస్‌ సిద్ధమైంది. అయితే ముస్లింలీగ్‌ మాత్రం దేశ స్వాతంత్ర్యం గురించి పట్టించుకోకుండా, ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చి, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా దేశ విభజనను అంగీకరించాలని కాంగ్రెస్‌ను కోరింది.
వేవెల్‌ ప్రణాళిక 1945 [Wavell Plan or Simla Conference-1945]
భారత వైస్రాయ్‌ మరియు గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ వేవెల్‌ ఆనాటి బ్రిటన్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌తో చర్చించి కొన్ని
ప్రతిపాదనలు చేశారు.
ముఖ్యాంశాలు
  • భారతదేశంలోని ప్రధాన మతాలకు సంబంధించిన వారిని సముచిత ప్రాతినిధ్యం కోసం వైస్రాయ్‌ కార్యనిర్వాహక మండలిని విస్తరించడం.
  • భారతదేశంలో బ్రిటీషు వారి ప్రయోజనాలు కాపాడేందుకు ఒక హైకమీషనర్‌ను నియమించడం
  • వైస్రాయ్‌ కార్యనిర్వాహక మండలిలో విదేశీ వ్యవహారాలను భారతీయ సభ్యుడికి అప్పగించడం.
  • వైస్రాయ్‌ కార్యనిర్వాహక మండలిలో ముఖ్య సైన్యాధికారి పదవికి భారతీయుడిని నియమించడం.
  • వైస్రాయ్‌ కార్యనిర్వాహక వర్గం జాతీయ ప్రభుత్వంగా వ్యవహరించడం.
ఇందుకోసం వైస్రాయి 1945 జులైలో సిమ్లాలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. కానీ కాంగ్రెస్‌ అవిభాజ్య భారతదేశం (యునైటెడ్‌ ఇండియా) కోసం పట్టుపట్టింది. ముస్లిం లీగ్‌ మాత్రం దేశ విభజనను సమర్ధించింది.