Fundamental Rights of Indian Constitution (Articles 12-35)-14

TSStudies
0
What is Article 21 of Indian Constitution in Telugu

 ప్రకరణ - 21 - వ్యక్తి స్వేచ్చకు, ప్రాణానికి రక్షణ

ఈ స్వేచ్చ అత్యంత ముఖ్యమైనది. భారత పౌరులకేకాక విదేశీయులకు కూడా వర్తిస్తుంది. జీవించే హక్కును మరీయు అంతరంగిక స్వేచ్చను చట్టం నిర్దేశించిన పద్ధతి ప్రకారం తప్ప మరే విధంగానూ హారించడానికి వీలులేదు. ఈ నిబంధన వ్యక్తి జీవించే స్వేచ్చకు రక్షణ కల్పిస్తుంది.
చట్టం నిర్దేశించిన పద్ధతి (Procedure Established by Law) అనే భావాన్ని జపాన్‌ రాజ్యాంగం నుండి గ్రహించారు. శాసనసభల చట్టాలు నిర్ణీత పద్ధతి ప్రకారం వ్యక్తి స్వేచ్చను హరిస్తే పై పద్ధతి చెల్లుబాటు అవుతుంది. అనగా ఈ ప్రకరణ కార్య నిర్వాహక అధికారాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా మాత్రమే పొందుపరిచారు. ఇది. శాసనసభల చట్టాలకు వ్యతిరేకముగా రక్షణ ఇవ్వదు. 

ప్రత్యేక వివరణ
ప్రకరణ 21లో కల్పించిన రక్షణలు కార్య నిర్వాహక చర్యలకు వ్యతిరేకంగా మాత్రమే వర్తిస్తాయి. శాసనపరమైన చర్యలకు వర్తించవు. అనగా శాసనసభ ఒక ప్రక్రియను నిర్ణయించి, ఆ మేరకు కార్య నిర్వాహక వర్గానికి అధికారం కల్పిస్తే, వారు ఆ ప్రక్రియ ప్రకారం చర్యలు తీసుకుంటే వాటిని న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీలు లేదు.
అయితే సుప్రీంకోర్టు ఈ అంశాన్ని మేనకా గాంధీ కేసులో విసృతంగా వ్యాఖ్యానించి, శాసన శాఖ చర్యలకు వ్యతిరేకంగా కూడా రక్షణ కల్పించేలా కొన్ని సూత్రాలను నిర్ధేశించింది.

మేనకాగాంధీ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (1978) “డ్యూ ప్రాసెస్‌ ఆఫ్‌ లా” (Due Process of  Law)
1978లో మేనకాగాంధీ కేసు వివాదంలో సుప్రీంకోర్టు ఈ నిబంధనకు నూతన అర్థాన్ని చెప్పింది. మేనకాగాంధీ వివాదం విదేశీ సంచారానికి సంబంధించినది. ప్రజా సంక్షేమం దృష్టా ఆమె పాస్‌పోర్టును రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడిచింది. ఈ కేసులో అమెరికా రాజ్యాంగంలో ఉన్న “డ్యూ ప్రాసెస్‌ ఆఫ్‌ లా” ను సుప్రీంకోర అనువర్తింపచేసింది. ప్రభుత్వం ఏదో ఒక పద్ధతిని నిర్ణయించి స్వేచ్చలను పరిమితం చేయలేదనీ, నిర్ణయించిన పద్ధతి న్యాయబద్ధంగానూ, సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగానూ వెరసి సమంజసంగా ఉండాలి. ప్రభుత్వం చేసిన పని సక్రమమైననూ, ఆ పనిని చేయడానికి ఎంచుకొన్న ప్రక్రియ సక్రమంగా లేకపోతే ఆ చర్యలు చెల్లుబాటు కావు. దీనినే డ్యూ ప్రాసెస్‌ ఆఫ్‌ లా అంటారు.

ప్రకరణ 21 - విసృత పరిధి, అభ్యుదయ వ్యాఖ్యానాలు
మేనకాగాంధి కేసు, ఇంద్రజిత్‌, వెల్లూరు సిటిజన్స్‌ వెల్‌ఫేర్‌ కేసు, ప్రేమశంకర్‌ శుక్లా కేసు, నరేంద్రకుమార్‌ కేసు, మోహిని జైన్‌ కేసు, ఆటోశంకర్‌ కేసు, శ్రీమతి ఖుష్పు కేసు మొదలగు వాటిలో సుప్రీంకోర్టు జీవించే స్వేచ్చపై విస్పృతమైన అర్థాన్ని చెప్పింది. ఈ తీర్పుల సారాంశం ప్రకారం, ప్రకరణ 21లో ఈ క్రింది హక్కులు కూడా అంతర్భాగమే. 
  • గౌరవప్రదంగా జీవించే హక్కు
  • కాలుష్యరహిత వాతావరణ హక్కు 
  • రహస్యాలను, ఆరోగ్యాన్ని కాపాడుకునే హక్కు
  • ఉచిత న్యాయ సలహా హక్కు 
  • విదేశాల పర్యటన హక్కు
  • లాకప్‌ మరణాల వ్యతిరేక హక్కు 
  • సమాచార హక్కు
  • ఏకాంతంగా జీవించే హక్కు 
  • సత్వర విచారణ పొందే హక్కు
  • మరణ శిక్ష అమలును ఆలస్యం చేయడంపై అడిగే హక్కు 
  • ఆహార హక్కు
  • సహ జీవన హక్కు 
  • నిద్ర హక్కు
ఆత్మహత్యా ప్రయత్నం - జీవించే హక్కు - తాజా వివాదం, జైనుల సంతార, సల్లేఖన
ప్రకరణ 21 జీవించే హక్కును కల్పించింది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ ౩09 ప్రకారం ఆత్మహత్య ప్రయత్నం శిక్షార్హమైన నేరం. ఈ సెక్షన్‌ అమానుషమైనదని, దానిని ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ సెక్షన్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ఆత్మహత్య చేసుకోవాలని కోరిక అసహజమైనదని కనుక ఆ కోరిక కలగడానికి ఉన్న పరిస్థితులను పరిశీలించాలని, అలాంటి వ్యక్తులకు సరైన కౌన్సిలింగ్‌ నిర్వహించాలని, పోలీసు కేసులతో వేధించరాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
జైనుల సంప్రదాయమైన సంతార, సల్లేఖన (ఉపవాస దీక్ష ద్వారా చనిపోవడం) ద్వారా పరమపదించదాన్ని ఆత్మహత్యగా పరిగణించరాదని 2015 ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

కారుణ్య మరణం - Euthanasia
2011లో పింకి వీరాని అనే జర్నలిస్ట్‌ మరియు సామాజిక కార్యకర్త, అరుణా షాన్‌బాగ్‌ అనే ఒక నర్సు తరపున సుప్రీంకోర్టులో కేసు వేసింది. అరుణ షాన్‌బాగ్‌ అనే ఒక నర్సు బొంబాయి ఎడ్వర్డ్‌ ఆసుపత్రిలో లైంగిక దాడికి గురై కోమాలోకి వెళ్లిపోయి సుమారు 37 సంవత్సరాలు విషమ పరిస్థితిలో ఉండటం చూసి సుప్రీంకోర్టులో కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వవలసిందిగా కేసు వేసింది. సుప్రీంకోర్టు కారుణ్య మరణాన్ని నిరాకరించింది. ప్రత్యేక పరిస్థితుల్లోనే పాసివ్‌ కారుణ్య మరణాన్ని అనుమతిస్తామని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)