రాజ్యాంగ ప్రవేశిక/ పీఠిక - తాత్విక పునాదులు (Preamble-Philosophical Foundations)
ప్రతి ప్రజాస్వామ్య రాజ్యాంగం సాధారణంగాప్రవేశికతో ప్రారంభమవుతుంది. భారత రాజ్యాంగం కూడా ప్రవేశికతోనే మొదలయ్యింది. ప్రవేశికను “పీఠిక”, “అవతారిక” “ముందుమాట” “ఉపోద్దాతం” వంటి పర్యాయపదాలతో వాడుతారు. ఆంగ్లంలో “Preamble" అంటారు.
ప్రవేశిక రాజ్యాంగం యొక్క లక్ష్యాలను, ఆదర్శాలను, మూలతత్వాన్ని సూచనప్రాయంగా తెలియచేస్తుంది. రాజ్యాంగాన్ని ఏ ఉన్నత ఆశయాలతో రచించారో, ఏ తరహా ప్రభుత్వాన్ని ఎలాంటి సమాజాన్ని నిర్మించదలచుకొన్నారో, మొ! అంశాలను స్పష్టీకరిస్తూ రాజ్యాంగ నిర్మాతలు ముందుమాటగా తెలియచేస్తారు.
ప్రవేశిక - ఆధారం
ప్రపంచంలో ప్రవేశికను కలిగిన మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా. ప్రవేశిక భావాన్ని అమెరికా నుండి తీసుకొన్నప్పటికి, అందులోని లక్ష్యాలు, ఆధారాలు మాత్రం, రాజ్యాంగ పరిషత్‌లో జవహర్‌లాల్ నెహ్రూ డిసెంబర్ 13, 1946న ప్రతిపాదించిన “ఆశయాల తీర్మానం” (Objective Resolution) ప్రధాన ప్రాతిపదిక అవుతుంది. ఫ్రెంచి రాజ్యాంగం నుంచి “స్వేచ్చ”, “సమానత్వం”, “సౌభ్రాతృత్వం”, “గణతంత్రం” అనే పదాలు తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి ఛార్జర్‌లోని ప్రవేశిక కూడా ఆధారంగా చెప్పవచ్చు
ప్రవేశిక - పాఠ్యాంశం
“భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత రాజ్యంగాన్ని నిర్జించుకునేందుకూ, పౌరులందరికీ సాంఘీక, ఆర్థిక రాజకీయ న్యాయాన్నీ; ఆలోచన భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్య్రన్ని; అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్నీ, జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ సౌభాతృత్వాన్ని పెంపొందించదానికి ఈ 1949 నవంబరు 26వ తేదీన మా రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించి, శాననంగా రూపొందించుకొన్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకొంటున్నాం”
గమనిక: పై విధంగా ప్రవేశికకు నగిషీ చెక్కిన (Art Work) శిల్పి - నందన్ లాల్ బోస్
ప్రవేశిక - పదజాలం, భావాలు అర్ధవివరణ
ప్రవేశికలో గొప్ప భావజాలాన్ని ప్రయోగించారు. ప్రతిపదానికి భావానికి ఒక విశిష్ట అర్దాన్ని, పరమార్దాన్ని ఆపాదించవచ్చు“భారత ప్రజలమైన మేము” అని ప్రవేశిక ప్రారంభమవుతుంది. ప్రజలే రాజకీయ అధికారానికి మూలం, ప్రజల చేత రాజ్యాంగం రచించుకోబడిందని దీని అర్ధంగా చెప్పవచ్చు.
రాజకీయ స్వభావాన్ని తెలియచేసే పదాలు
భారతదేశం ఏ తరహా రాజకీయ వ్యవస్థను ఏర్పర్చుకుంటుందో, దాని స్వభావం ఏమిటో స్పష్టంగా పేర్కొన్నారు.
సార్వభౌమత్వం (Sovereignty)
అనగా సర్వోన్నత అధికారం అని అర్థం. భారతదేశం అంతర్గతంగా సర్వోన్నత అధికారం, బాహ్యంగా (External Independence and Internal Supremacy) విదేశీ, దౌత్య విధానాల్లో స్వేచ్చను కలిగి ఉంటుంది. ఏ బాహ్య శక్తి మన విదేశాంగ విధానాన్ని నియంత్రించలేదు.
సామ్యవాదం (Socialist)
ఈ పదాన్ని 1976, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశిక చేర్చారు. సామ్యవాదం అంటే సమసమాజ స్థాపన. ప్రజల మధ్య ఆర్ధిక, అంతరాలను క్రమేణా తగ్గించడం. ఉత్పత్తి శక్తులను (Land, Labor and Capital) ప్రభుత్వం నియంత్రించడం ద్వారా, సంపద కొద్ది మంది వ్యక్తుల చేతిలో కేంద్రీకరించబడకుండా, సాధ్యమైనంత వరకు జాతీయం చేయడం, తద్వారా ప్రజలకు సమాన అవకాశాలతో పాటు వాటిని అందిపుచ్చుకోవటానికి అవసరమైన తోడ్చాటును కలిగించడం జరుగుతుంది.
సామ్యవాదానికి వివిధ రూపాలున్నాయి. కమ్యూనిజం, మావోయిజం, సిండికాలిజం, గిల్డ్ సోషలిజం, ఫెబియనిజం, స్టేట్ సోషలిజం, మొ! రూపాలు వివిధ దేశాల్లో అమల్లో ఉన్నాయి. అయితే భారత దేశంలో ప్రజాసామ్యవాదం (Democratic Socialism) అమల్లో ఉంది. దీనినే “పరిణాత్మక లేక రాజ్యాంగ సామ్యవాదం” అంటారు. అనగా ఆర్థిక వ్యవస్థలో చట్టపరంగా ఒక నిర్ధిష్ట పద్ధతిలో మార్పులు 'చేబడతారు. మన సామ్యవాదం “గాంధీయిజం + మార్క్సిజం” ల మేలు కలయిక. కొంత వరకు గాంధీతత్వం వైపు మొగ్గు చూపడం జరిగింది. అయితే ప్రపంచీకరణ, ఆర్థిక ఉదారవాదం, ప్రవేటీకరణ నేపథ్యంలో సామ్యవాదతత్వం మసక బారుతోందని చెప్పవచ్చు.
లౌకిక తత్వం (Secular)
ఈ పదాన్ని కూడ 1976, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు చేర్చారు. లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని రాజ్యం. అధికారమతం ఉండదు, మత వివక్షత ఉండదు. మత విషయంలో పౌరులకు స్వేచ్చ, సమానత్వం ఉంటాయి. మతపరంగా ఎవరికి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం కానీ, నష్టం కాని వాటిల్లదు. అధికార మతం ఉన్న రాజ్యాలను మత స్వామ్య రాజ్యము లేదా "Theocratic State" అంటారు. ఉదా : పాకిస్థాన్, బంగ్లాదేశ్
ప్రజాస్వామ్యం (Democracy)
ప్రజాస్వామ్యం అంటే, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పరచబడిన ప్రభుత్వం, అనగా Govt by the people, for the people, of the people అని, ప్రజలే పాలితులు మరియు పాలకులు (People are rulers and ruled) అని అబ్రహమ్ లింకన్ చక్కటి నిర్వచనం చెప్పాడు. భారత్‌లో పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వాన్యుం అమల్లో ఉంది. ఎలాంటి వివక్షత లేకుండా కేవలం నిర్ణీత వయస్సు ఉన్న పౌరులందరికి ఓటు హక్కు, ప్రభుత్వ పదవులకు పోటీచేసే హక్కును కల్పించారు. పాలన చట్టపరంగా జరుగుతుంది (Rule of Law). చట్టబద్దత లేకుండా ఏ చర్యా చెల్లుబాటు కాదు. ఏ వ్యక్తికీ ప్రత్యేక హోదా లేదా మినహాయింపు సాధారణంగా ఇవ్వబడదు.
గణతంత్రం (Republic)
“గణం” అంటే ప్రజలు, తంత్రం అంటే పాలన. ఇది ప్రజా పాలన. వారసత్వ లేదా అధికార హోదాలు ఉండవు. భారత రాష్ట్రపతి మరియు ఇతర ప్రజా పదవులు ప్రజల చేత ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిర్జీత కాలానికి ఎన్నిక కాబడతారు. బ్రిటిష్ రాణి, రాజు వలె వారసత్వ అధికారం ఉండదు.