రాజ్యాంగ భారీ స్వరూపం - కారణాలు
ప్రభుత్వ నిర్మాణం, అధికార విధులు, హక్కులు, రాజ్యాంగ ప్రక్రియలకు సంబంధించి అత్యంత విస్తృతంగా చర్చించడం జరిగింది. దేశ వైవిధ్యం, చారిత్రక అవసరాలు, సమాఖ్య వ్యవస్థ, ఇతర రాజ్యాంగాల ప్రభావం, ప్రత్యేక వర్గాలకు సంబందించిన రక్షణలు మొదలగు అంశాలు రాజ్యాంగ భారీ స్వరూపానికి కారణంగా చెప్పవచ్చు.
ప్రవేశిక - తాత్విక పునాదులు
భారత రాజ్యాంగ మూలతత్యాన్ని ప్రవేశిక లేదా పీఠిక సూచిస్తుంది. 1947 జనవరి 22వ తేదీన భారత రాజ్యాంగ పరిషత్తు సమావేశంలో నెహ్రూ ప్రతిపాదించిన లక్ష్యాల తీర్మానం ప్రాతిపదికపై ప్రవేశికను రూపొందించటం జరిగింది.
రాజ్యాంగ లక్షణాల సమ్మిళితం
సాధారణంగా సమాఖ్య వ్యవస్థలకు ధృఢ రాజ్యాంగం ఉంటుంది. కాని భారత రాజ్యాంగం ధృఢ, అధృడ రాజ్యాంగాల సమ్మేళనం. రాజ్యాంగ ప్రకరణ 368 ప్రకారం కొన్ని అంశాలను సాధారణ మెజారిటీతో, మరికొన్ని అంశాలను 2/3వ వంతు మెజారిటీతో, మిగిలిన అంశాలను 2/3 వంతు మెజారిటీ మరియు రాష్ట్ర శాసనసభల ఆమోదంతో సవరిస్తారు. కనుక భారత రాజ్యాంగం ధృఢ, అధృఢ లక్షణాల సమ్మిళితంగా చెప్పవచ్చు. అయితే భారత రాజ్యాంగంలోని ఎక్కువ ప్రకరణలను 2/3 వంతు మెజారిటీతో మాత్రమే సవరించగలరు.
పార్లమెంటరీ ప్రభుత్వ విధానం
భారత రాజ్యాంగం కేంద్రంలోను, రాష్ట్రాలలోను “వెస్ట్ మినిస్టర్” తరహా పార్లమెంటు ప్రభుత్వాలను ఏర్పరచింది. కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నరు నామమాత్ర కార్య నిర్వహణాధికారులు కాగా, కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రివర్గం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రివర్గం వాస్తవ కార్య నిర్వహణాధికారాలు కలిగి ఉంటాయి.
బలమైన కేంద్రం గల సమాఖ్య రాజ్యాంగం
రాజ్యాంగం యొక్క మొదటి ప్రకరణ భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్‌గా (Union of States) ప్రకటించింది. అయినా సమాఖ్య రాజ్యానికి ఉండే లక్షణాలు, అనగా లిఖిత రాజ్యాంగం, అధికారాల పంపిణీ, రాజ్యాంగంపై వ్యాఖ్యానించే అధికారం గల స్వతంత్ర న్యాయస్థానం, ధృఢ రాజ్యాంగ లక్షణాలుగా ఉన్నాయి. ఈ లక్షణాలు ఉన్నప్పటికీ రాజ్యాంగంలో సమాఖ్య రాజ్యం అనే పదాన్ని ఎక్కడా వాడలేదు. దేశాన్ని విడగొట్టడానికి ప్రయత్నించే దుష్టశక్తుల కుతంత్రాలను విఫలం చేయడానికి ఇది ఎంతో అవసరం. డా. అంబేద్కర్ మన రాజ్యాంగాన్నీ అత్యంత కేంద్రీకృత సమాఖ్య ప్రభుత్వమని ఒప్పుకున్నారు.
ఏక పౌరసత్వం
భారతదేశంలోని ప్రజలకు ఏక పౌరసత్వం కల్పించడం జరిగింది. అంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఒకే భారతీయ పౌరసత్వమును కలిగి ఉండడమేకాక వీరి మధ్య ఏ విధమైన వ్యత్యాసం చూపబడదు. దీనికి భిన్నంగా అమెరికా, స్విట్జర్లాండ్‌లు ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించాయి. రాష్ట్రాల వారిగా పౌరసత్వాలుంటాయి.
ఏకీకృత, సమగ్ర, నిష్పాక్షిక, సర్వోన్నత, స్వతంత్ర్య న్యాయ వ్యవస్థ
ఏకీకృత, స్వతంత్ర న్యాయవ్యవస్థను రాజ్యాంగం ఏర్పరచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజ్యాంగ పరిధిని అతిక్రమించకుండా నియంత్రించి, ప్రాధమిక హక్కులను సంరక్షిస్తూ, రాజ్యాంగ ఆధిక్యతను న్యాయవ్యవస్థ నెలకొల్పుతుంది. ఇందుకోసం రాజ్యాంగంలో అనేక ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తే వివాదాలను కూడా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు పరిష్కరిస్తుంది.
ప్రాధమిక హక్కులు
అమెరికా రాజ్యాంగం మాదిరిగానే భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో 12 నుండి. 35 వరకు గల ప్రకరణలో ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. మౌలిక రాజ్యాంగంలో ఏడు ప్రాథమిక హక్కులు ఉండేవి. కానీ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఆస్తి హక్కును ప్రాధమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. కనుక, ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులే ఉన్నాయి. అవి - సమానత్వ హక్కు, స్వాతంత్య్ర హక్కు, దోపిదీని నిరోధించే హక్కు, మత స్వాతంత్య్ర హక్కు విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిరక్షణ హక్కు. ప్రాధమిక హక్కులు ప్రభుత్వ నిరపేక్ష అధికారాలపై పరిమితులు. రాజ్యాంగ ఔన్నత్యానికి, పార్లమెంటు సార్వభౌమత్వానికి మధ్య సమతుల్యానికి నిదర్శనంగా ఈ హక్కులు ఉంటాయి.
ప్రాథమిక విధులు
మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధుల ప్రస్తావన లేదు. అయితే 1976లో 42వ రాజ్యాంగసవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలోని 4A భాగంలోని 51A అధికరణలో పది విధులను పొందుపరిచారు. ఆ తర్వాత 86వ రాజ్యాంగ సవరణ చట్టం (2002) ద్వారా మరొక ప్రాధమిక విధిని కూడా చేర్చారు. దీనితో వీటి సంఖ్య 11కు చేరింది.
ఆదేశిక నియమాలు
నాలుగవ భాగంలో 36 నుంచి 51 వరకు గల 'ప్రకరణలలో ఆదేశిక నియమాలను పొందుపరిచారు. ఇవి రాజ్యాంగ ప్రవేశికలో గల ఉన్నత ఆదర్శాలను సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన మార్గదర్శక సూత్రాలు. వీటి ముఖ్య ఉద్ధేశ్యం సామ్యవాద తరహా సమాజాన్ని స్థాపించడం. ఐతే, ఈ నియమాలకు న్యాయ సంరక్షణ లేదు.
సామ్యవాద, లౌకిక రాజ్య లక్షణాలు
భారత రాజ్యాంగ ప్రవేశిక భారత దేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది. దీని ప్రకారం రాజ్యం ఏ ఒక్కమతం పట్ల ప్రత్యేక అనుకూల వైఖరి లేదా వ్యతిరేక వైఖరిని ప్రదర్శించదు. 1976 లో 42వ సవరణ ద్వారా “సామ్యవాద” “లౌకిక” అనే పదాలు ప్రవేశికకు చేర్చారు. సామ్యవాదం అనగా సమసమాజ స్థాపన. ధనిక, పేదల మధ్య అంతరాలను కనిష్ట స్థాయికి తగ్గించడం. ఉత్పత్తి శక్తులను ప్రభుత్వం నియంత్రించడం.
సార్వజనీన వయోజన ఓటుహక్కు
భారత పౌరులందరికి కుల, మత, వర్ష, భాష ప్రాంత, ఆస్తి, లింగ వివక్షతలు లేకుండా వయోజనులందరిక్నిప్రకరణ 326 ప్రకారం ఓటు హక్కును కల్పించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు, ఓటు హక్కుకు అర్హతగా 21 ఏళ్ళు ఉండగా 1989లో భారత రాజ్యాంగానికి చేసిన 61వ సవరణ చట్టం ద్వారా ఓటర్ల కనీస వయోపరిమితిని 18 ఏళ్ళకు తగ్గించారు.
అధికార విభజన
భారత రాజ్యాంగం దేశాన్ని “రాష్ట్రాల యూనియన్” అని ప్రకటించినప్పటికీ అధికారాల పంపిణీ రాజ్యాంగపరంగా జరిగింది. అధికారాలను మూడు జాబితాల కింద విభజించింది. ఆ జాబితాలు - కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా.
సార్వభౌమ సర్వసత్తాక, ప్రజాస్వామ్య రాజ్యం
రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్నట్టు మన రాజ్యాంగం సార్వభౌమ, సర్వసత్తాక, ప్రజాస్వామ్య. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆంతరంగికంగా సర్వోన్నత అధికారాన్ని బాహ్యంగా విదేశీ వ్యవహారాలలో స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంటుంది. ఏ విదేశీ శక్తికి లోబడి ఉండదు. రాజ్యాంగ వ్యవస్థలకు, అధికారానికి ప్రజలే మూలం. రాష్ట్రపతి, (ప్రధానమంత్రి, ఇతర ప్రతినిధులు ప్రజల చేత నిర్ణీత కాలానికి ఎన్నికౌతారు. చట్టపాలన ఉంటుంది.
ద్విసభా విధానం
రాజ్యాంగం ప్రకారం కేంద్ర పార్లమెంటు ద్విసభా విధానాన్ని కలిగి ఉంది. పార్లమెంటు దిగువ సభను లోక్‌సభ అని ఎగువ సభను రాజ్యసభ అని అంటారు. అయితే రాష్ట్రాల్లో మాత్రం ద్విసభా విధానం ఐచ్చికం. ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ద్విసభా విధానం. ఉంది. అవి - ఉత్తర ప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. రాష్ట్రంలో దిగువ సభను విధాన సభ అని ఎగువ సభను విధాన పరిషత్ అని అంటారు. (As on 02.06.2021)
అత్యవసర పరిస్థితి - కేంద్ర ఆధిపత్యం
రాజ్యాంగం 18వ భాగంలోని ప్రకరణలు 352 నుండి 360 వరకు అత్యవసర పరిస్థితి గురించి వివరిస్తాయి. దేశ ఐక్యతకు, సమేగ్రతకు, రక్షణకు, సార్వభౌమత్వానికి, ప్రమాదం ఏర్పడినప్పుడు ఈ ప్రత్యేక అధికారాలను వినియోగించవచ్చు. మూడు రకాలైన అత్యవసర పరిస్థితులను పేర్కొన్నారు. అవి - జాతీయ అత్యవసర పరిస్థితి, రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి.
రాజ్యాంగ ప్రతిపత్తి గల స్థానిక సంస్థలు
ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, భాగస్వామ్య పరిపాలన కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో స్థానిక సంస్థలను ఏర్పాటుచేసి, ప్రజలు నేరుగా పాలన మరియు అభివృద్ధిలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. 1992లో 73వ, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలలో మూడంచెల విధానాన్ని అమలు చేస్తున్నారు.
రాజ్యాంగపర సంస్థలు
పరిపాలన మరియు ఇతర విధుల నిర్వహణ కోసం కొన్ని సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఆర్థిక సంఘం, పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లు, కంట్రోలర్ & ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, జాతీయ ఎస్.సి., ఎస్.టి కమీషన్‌లు, మొ|| ఉదాహరణగా పేర్కొనవచ్చు.