సామాజిక ఆశయాలు (Social Objectives)
ప్రవేశికలో కొన్ని ఉదాత్తమైన ఆశయాలను పొందుపరిచారు. ఈ రాజ్యాంగం ద్వారా వాటిని సాకారం చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసారు.
న్యాయం (Justice)
న్యాయం అనగా ఒక సర్వోన్నతమైన సమతా భావన. అసమానతలు, వివక్షతలులేని ఆదర్శ సమాజాన్ని నిర్మించడం మూడు రకాలైన న్యాయాలను ప్రస్తావించారు.
రాజకీయ న్యాయం (Political Justice)
అనగా రాజ్య కార్యకలాపాల్లో పౌరులందరు ఎలాంటి వివక్షతలు లేకుండా పాల్గొనవచ్చు. సార్వజనీన ఓటు హక్కు పోటీ చేసే హక్కు ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు విజ్ఞాపన హక్కు మొ॥ రాజకీయ న్యాయ సాధనకు ప్రాతిపదికలుగా పేర్కొనవచ్చు.
సామాజిక న్యాయం (Social Justice)
సమాజంలో పౌరులందరు సమానులే. జాతి, మత, కుల, లింగ, పుట్టుక అనే తేడాలు లేకుండా అందరికీ సమాన హోదాను, గౌరవాన్ని కల్పించడం. అన్ని రకాల సామాజిక వివక్షతలను రద్దు చేయడం. సామాజికంగా వెనుకబడిన వర్గాలు, కులాలు, తెగలు అభ్యున్నతికి కృషి చేయడం.
ఆర్థిక న్యాయం (Economic Justice)
ఆర్థిక అంతరాలను తగ్గించడం, సంపద ఉత్పత్తి, పంపిణీ, వృత్తి. ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు, పేదరిక నిర్మూలన, ఆకలి నుండి విముక్తులను చేయడం. జీవితాన్ని జీవించేందుకు అనువుగా మార్చడం.
ఉన్నత ఆదర్శాలు
స్వేచ్ఛ (Liberty)
నిజమైన ప్రజాస్వామ్య రాజ్య స్థాపనకు, ఉదాత్త నాగరిక సామాజిక జీవనానికి స్వేచ్చాయుత వాతావరణం అనివార్యం. స్వేచ్చ అనగా నిర్హేతుకమైన పరిమితులు, నిర్భంధాలు లేకుండా, పరిపూర్ణ వ్యక్తి వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పించడం. ప్రతి పౌరునికి ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్చ ఉండి తీరాలి. ఉదా॥ మత స్వేచ్చ అనేది లౌకిక రాజ్య స్థాపనకు పునాది.
సమానత్వం (Equality)
ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఆదర్శం సమానత్వం. సమానత్వం అనగా అన్ని రకాల అసమానతలను, వివక్షతలను రద్దు చేసి, ప్రతి వ్యక్తి తనను తాను పూర్తిగా వికాస పరుచుకోవడానికి అవసరమైన అవకాశాలను కల్పించడం.
సౌభ్రాతృత్వం (Fraternity)
సౌభ్రాతృత్వం అనగా సోదర భావం అని అర్ధం. పౌరుల మధ్య సంఘీభావం, పరస్పర గౌరవం ఉండాలి. అసమానతలు, వివక్షతలు లేనప్పుడు పౌరుల మధ్య సోదరభావం వర్ధిల్లుతుంది. సార్వజనీన సోదర భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో డా॥ బి.ఆర్. అంబేద్కర్ సౌభ్రాతృత్వం అనే భావాన్ని ప్రవేశికలో పొందుపరచాలని ప్రతిపాదించారు.
ఐక్యత, సమగ్రత (Unity & Integrity)
ఐక్యతా భావం దేశ ప్రజలు కలిసి ఉండడానికి దోహదపడుతుంది. ఇది ఒక మానసిక ఉద్వేగం (Psychological emotion) మత, కుల ప్రాంత వంటి సంకుచిత ఆలోచనలకు అతీతమైన ఆదర్శం. “సమగ్రత” అనే పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సమగ్రత ప్రజల మధ్య జాతీయ దృక్పథాన్ని పెంపొందిస్తుంది.
సమగ్రతను చేరవలసిన ఆవశ్యకత
1970 తరువాత దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రాంతీయవాదం, వేర్చాటువాదం తలెత్తాయి మరియు దేశ సమగ్రతను దెబ్బ తీసేలా మిలిటెంట్ పోరాటాలు జరిగాయి. ఈ నేపథ్యంలో “సమగ్రత” అనే పదాన్ని చేర్చవలసిన పరిస్థితి అనివార్యమైంది.
ప్రవేశిక సవరణకు అతీతం కాదు
ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంటుకు ప్రకరణ 368 అనుసరించి ఉన్నదని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ప్రవేశిక రాజ్యాంగ మౌలిక నిర్మాణం అనే నిర్వచనం క్రిందికి వస్తుంది కనుక, దాని సారాంశం (Spirit) మార్చకుండా, ప్రాముఖ్యతను ద్విగుణీకృతం చేసేలా నిర్మాణాత్మకంగా సవరణలను చేయవచ్చని స్పష్టం చేసింది. అందుచేత స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు 1976లో 42 రాజ్యాంగ సవరణ ద్వారా “సామ్యవాదం”, “లౌకికవాదం”, “సమగ్రత” అనే పదజాలాన్ని చేర్చారు. ఇది మొట్టమొదటి సవరణ మరియు ప్రవేశిక వరకు చిట్టచివరి సవరణ కూడా! (ప్రస్తుత కాలం వరకు 2021జూన్)