Conflicts between Fundamental rights and Directive Principles
నిర్దేశిక నియమాలకు - ప్రాథమిక హక్కులకు మధ్య ఏర్పడిన వివాదాలు
ప్రాథమిక హక్కులు మరియు నిర్దేశిక నియమాలు పరస్పర సంబంధాన్ని కలిగియున్నాయి. మౌలిక రాజ్యాంగంలో రెండింటి మధ్య సమతూకాన్ని ఏర్పరచారు. అయితే తరువాత చేసిన రాజ్యాంగ సవరణలతో వీటి మధ్య సంబంధాలలో ఒడిదుడుకులు ఏర్పడి, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే సమస్య ఉత్పన్నమై అవి పార్లమెంటు, సుప్రీంకోర్టు మధ్య సంఘర్షణకు దారి తీసింది. ఈ పరిణామాలను ఈ క్రింది విధంగా పరిశీలించవచ్చు.
మొదటి దశ (1950-66) - ప్రాధమిక హక్కుల ప్రాధాన్యతా దశ
ఈ దశలో సుప్రీంకోర్టు నిర్దేశిక నియమాల కంటే, ప్రాథమిక హక్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. చంపకం దొరైరాజన్ Vsయూనియన్ ఆఫ్ ఇండియా, కామేశ్వర్‌సింగ్ Vs బీహార్, బెనర్జీ Vs పశ్చిమ బెంగాల్ మొదలగు కేసులలో సుప్రీంకోర్టు నిర్దేశిక నియమాలకంటే ప్రాథమిక హక్కులకే ప్రాధాన్యత ఇవ్వాలని తీర్పు చెప్పింది.
పై కేసులలో ఉత్పన్నమైన సమస్యలను ఎదుర్కోవడానికి పార్లమెంటు 1951లో 1వ రాజ్యాంగ సవరణ, 1955లో 4వ రాజ్యాంగ సవరణ, 1964లో 17వ రాజ్యాంగ సవరణ చేసి నిర్దేశిక నియమాల అమలుకు ప్రయత్నించింది.
రెండవ దశ (1967-71) - ప్రాధమిక హక్కులు - సవరణకు అతీతం
ఈ దశలో గోలక్‌నాధ్ మరియు పంజాబ్ రాష్ట్రం కేసు విచారణకు వచ్చింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం ప్రాథమిక హక్కులు అత్యంత పవిత్రమైనవని, నిబంధన 13(2) ప్రకారం సవరించడం రాజ్యాంగ విరుద్దమని చారిత్రాత్మక తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో ప్రాథమిక హక్కులకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. 1971 వరకు సుప్రీంకోర్టు ఈ వైఖరిని అనుసరించింది.
మూడవ దశ (1972-76) - ప్రాథమిక హక్కులు సవరించవచ్చు
గోలక్‌నాథ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడానికి 24వ, 25వ రాజ్యాంగ సవరణలు చేయడం జరిగింది. 25వ రాజ్యాంగ సవరణ ప్రకారం, ప్రకరణ 31 కు 'C' అనే ప్రత్యేక క్లాజును చేర్చారు. నిబంధన 31లో ప్రయోగించిన నష్టపరిహారమనే పదానికి బదులు “ధనం” అనే పదాన్ని చేర్చడం జరిగింది. ఈ సవరణ కేశవానంద భారతి కేసు ద్వారా సుప్రీంకోర్టులో ప్రశ్నించడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ, పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉంది కానీ, రాజ్యాంగ మౌలిక సూత్రాలను భంగపరచరాదని, న్యాయ సమీక్ష నుంచి రాజ్యాంగ సవరణలను మినహాయించడం చెల్లదని ప్రకటించింది.
నాల్లవదశ (1977-80) - నిర్దేశిక నియమాల ఆధిక్యత
1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్చును అధిగమించడానికి పార్లమెంటులో 1976లో 42వ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సుప్రీం కోర్టు న్యాయసమీక్షాధికారం పరిమితం చేయబడింది. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవు. ప్రకరణ 31(C)ని విస్తృతం చేసి, నిర్దేశిక నియమాల్లోని ఏ అంశాన్నయినా అమలు చేయడానికి ప్రాథమిక హక్కులపైన పరిమితులు విధిస్తే, ఆ పరిమితులు నిబంధన 13 ప్రకారము ప్రాథమిక హక్కులకు విరుద్ధమంటూ న్యాయస్థానాల్లో ప్రశ్నించరాదు. అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు కాక, సాధారణ పరిస్థితుల్లో కూడా ప్రాథమిక హక్కులను రద్దు చేయడానికి అవకాశం కల్పించారు. అయితే 1977లో జనతా' ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సమగ్రంగా సమీక్షించి, 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితానుండి తొలగించడమే కాకుండా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన చాలా అంశాలను తొలగించారు.
ఐదవ దశ (1980) నుండి నేటివరకు - సమతుల్యత
42వ రాజ్యాంగ సవరణలోని చాలా అంశాలు 1980లో మినర్వా మిల్స్ కేసు ద్వారా సుప్రీం కోర్టులో ప్రశ్నించడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు, ఆదేశిక నియమాలకు మధ్య సమ ప్రాధాన్యత ఉందని, అవి ఉమ్మడిగా సామాజిక విప్లవానికి ప్రతీక అని, ఏదో ఒక దానికి మరొక దానిపై సంపూర్ణ ఆధిపత్యం ఇవ్వడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, నిర్దేశిక నియమాల్లో పొందుపరచిన సామాజిక న్యాయసాధనను, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకుండా సాధించవచ్చని పేర్కొంది.
ప్రస్తుతం ప్రాథమిక హక్కుల ప్రాధాన్యతే కొనసాగుతోంది. అంత మాత్రాన నిర్దేశిక నియమాలకు ప్రాధాన్యత తగ్గినట్టుగా భావించరాదు. రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి భంగం కలగకుండా పార్లమెంటు ప్రాథమిక హక్కులను, నిర్దేశిక నియమాలను సవరించవచ్చు.