ప్రాథమిక విధులు (Fundamental Duties)
విధులు అర్ధ వివరణ
“విధి అనగా ఒక వ్యక్తి ఇతరులకోసం నిర్వర్తించవలసిన పని లేదా బాధ్యత అని అర్ధం. సామాజిక జీవనంలో వ్యక్తుల మధ్య పరస్పర అవగాహన, నమ్మకం, గౌరవం అనేవి ఉదాత్తమైన మానవీయ పరిపక్వతా లక్షణాలుగా పేర్కొంటారు. సమాజం ద్వారానే వ్యక్తి అన్ని లక్షణాలను, స్వభావాలను అలవర్చుకుంటాడు. అలాగే, అనేక ప్రయోజనాలు పొందుతాడు. కనుక ప్రతి వ్యక్తి తన సమాజానికి కనీస సేపలను, సహాయాన్ని తిరిగి అందించాల్సిన బాధ్యత ఉంటుంది.
విధుల ప్రాముఖ్యత
విధులు సమాజ వికాసం, దేశాభివృద్ధికి, సామాజిక స్పృహ కల్పించడానికి దోహదం చేస్తాయి. దేశ ఐక్యతను, సమగ్రతను పెంపొందిస్తాయి. ప్రాథమిక హక్కులనే కాయలు విధులుగా పరిపక్వం చెందినప్పుడే సమాజ జీవనం ఫలప్రదం అవుతుంది.
విధులు - రకాలు
సాధారణంగా విధులను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి.
- నైతిక విధులు
- చట్టబద్ధమైన విధులు
నైతిక విధులు అనగా ప్రజల యొక్కనైతిక విలువలపై, సామాజిక స్పృహపై ఆధారపడి ఉండేవి.
ఉదాహరణకు, పెద్దలను మరియు ఉపాధ్యాయులను గౌరవించడం, అభాగ్యులను, విధివంచితులను ఆదుకోవడం, మొదలగునవి.
చట్టబద్దమైన విధులు అనగా సమాజంచేత ఆమోదించబడి, ప్రభుత్వంచేత గుర్తించబడిన బాధ్యతలు. వీటిని ఉల్లంఘిస్తే శిక్షార్హులు అవుతారు. ఉదాహరణకు, ట్రాఫిక్ నియమాలను పాటించడం, పన్నులను సక్రమంగా చెల్లించడం, మొదలగునవి.
ప్రాథమిక విధులు
- ప్రతి పౌరుడు దేశంపట్ల, తన తోటి పౌరుల పట్ల కొన్ని కనీస బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. వీటికి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం చేత వీటిని ప్రాథమిక విధులు అంటారు.
భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు
- వీటిని రష్యా రాజ్యాంగం నుండి గ్రహించారు. మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధుల ప్రస్తావన లేదు. ఐతే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలోని 4-A భాగం, నిబంధన 51-Aలో పాందుపరిచారు. ప్రారంభంలో పది ప్రాథమిక విధులు ఉండేవి.
- 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మరొక విధిని రాజ్యాంగంలో చేర్చడం ద్వారా వీటి సంఖ్య పదకొండుకు పెరిగింది.
- జనవరి 3, 1977 నుంచి ఇవి అమలులోకి వచ్చాయి. ఈ రోజును ప్రాథమిక విధుల దినోతృవంగా పరిగణిస్తారు.
ప్రాథమిక విధులు - లక్షణాలు
- ప్రాథమిక విధులకు సంబంధించి కొన్ని ప్రత్యేక లక్షణాలను ఈ క్రింది విధంగా సూచించవచ్చు.
- ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదు. ఇవి నేరుగా అమలులోకి రావు.
- వీటి అమలుకోసం పార్లమెంటు ప్రత్యేక చట్టాలు చేయాలి.
- ప్రాథమిక విధులు కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తాయి.
- కొన్ని ప్రాథమిక విధులు నైతికపరమైన బాధ్యతలు, మరికొన్ని పౌర బాధ్యతలు.
- కొన్ని ప్రాథమిక విధులను భారత సనాతన సాంప్రదాయాలు, మత విలువలు, పురాణాల ఆధారంగా తీసుకున్నారు.