భారత సమాఖ్య - చరిత్ర
భారత సమాఖ్య చరిత్ర 1870లో లార్డ్ మేయో వికేంద్రీకరణ విధానంతో ప్రారంభమైందని చెప్పవచ్చు. భారత ప్రభుత్వ చట్టం 1919, దేశానికి నిజమైన సమాఖ్య లక్షణాన్ని ఇచ్చింది. భారత రాజ్యాంగం సమాఖ్య ప్రాతిపదికపైన ఏర్పడాలని సైమన్ కమీషన్ ప్రతిపాదించింది. ఆ తరువాత భారత ప్రభుత్వచట్టం 1935, భావి భారత రాజ్యాంగానికి నిర్మాణాత్మకమైన సమాఖ్య రేఖా పటాన్ని ఇచ్చింది. అయితే, స్వదేశీ సంస్థానాలు వ్యతిరేకించటంతో అమలులోకి రాలేదు. స్వాతంత్ర అనంతరం , రాజ్యాంగ పరిషత్తు భారతదేశానికి సమాఖ్య వ్యవస్థనే ఎంచుకుని, దానికనుగుణంగానే రాజ్యాంగ రచన చేసింది.
సమాఖ్య వ్యవస్థ - ముఖ్య లక్షణాలు
ప్రపంచ సమాఖ్య వ్యవస్థలను పరిశీలిస్తే ఈ క్రింది లక్షణాలుంటాయి.
అధికార విభజన
ఇది సమాఖ్య యొక్క అత్యంత ముఖ్య లక్షణం. రాజ్యాంగపరంగా కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఉంటుంది. ఈ విభజన ఎన్ని జాబితాలలో ఉండాలనే అంశంపై సార్వత్రిక సమ్మతి లేదు. భారత రాజ్యాంగములో అధికారాలను మూడు జాబితాలుగా విభజించడం జరిగింది. అమెరికాలో కేవలం ఒకే జాబితా ఉంది. ఆస్ట్రేలియాలో మూడు జాబితాలున్నాయి.
లిఖిత రాజ్యాంగము
సమాఖ్యకు లిఖిత రాజ్యాంగము ఉండాలి. తద్వారా కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన, పరిధి స్పష్టీకరించబడతాయి. లిఖిత రాజ్యాంగము ద్వారానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి పరిధుల్లోనే పనిచేసేలా నియంత్రణ వీలవుతుంది. భారత రాజ్యాంగము లిఖిత రాజ్యాంగమే.
సర్వోన్నత, స్వతంత్ర ప్రతిపత్తిగల న్యాయవ్యవస్థ
కేంద్రము, రాష్ట్రాల మధ్య వివాదాలు, అనగా సమాఖ్య వివాదాలను పరిష్కరించడానికి దేశంలో ఒక అత్యున్నతమైన న్యాయవ్యవస్థ ఉండాలి. అటువంటి న్యాయవ్యవస్థ రాజ్యాంగ ఆధిక్యతను కాపాడి, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధుల్లోనే పనిచేసేలా చూస్తుంది. న్యాయ శాఖ స్వతంత్ర ప్రతిపత్తి కోసం రాజ్యాంగంలో అనేక పరిరక్షణలు పొందుపరిచారు.
ద్విసభా పద్ధతి
సమాఖ్యలో కేంద్ర శాసనసభ ద్విసభా పద్ధతిని కలిగి ఉంటుంది. ఎగువ సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతుంది. భారతదేశంలో రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకే దీనిని రాష్ట్రాల మండలి (Council of States) అంటారు.
రాజ్యాంగ ఆధిక్యత
సమాఖ్యలో రాజ్యాంగం అత్యున్నతమైన చట్టం. రాజ్యాంగమే అన్ని అధికారాలకు మూలము. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాయి. ఒకవేళ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా చట్టాలు చేస్తే, అవి చెల్లుబాటు కాకుండా న్యాయ సమీక్షాధికారం ద్వారా సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది.
ధృఢ రాజ్యాంగము
సమాఖ్య వ్యవస్థకు ధృడ రాజ్యాంగం. ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాల కోసం రాజ్యాంగాన్ని ఆతిసులువుగా సవరించడానికి అవకాశముండదు, అలా ఉంటే రాజ్యాంగం తన ఔన్నత్యం కోల్పోతుంది. రాజ్యాంగాన్ని సవరించడానికి ప్రత్యేక మెజారిటీ కావలసి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని చాలా భా గాలు ప్రత్యేక మెజారిటీ ద్వారానే సవరించాలి. కనుక భారత రాజ్యాంగము మౌలికంగా ధృధమైనది.
భారత సమాఖ్య విశిష్ట లక్షణాలు (ఏక కేంద్ర లక్షణాలు)
భారత రాజ్యాంగములో పైన పేర్కొన్న అన్ని సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. అయితే, అక్కడక్కడా కొన్ని ఏకీకృత లక్షణాలు కూడా కన్పిస్తాయి. దీని ఆధారంగా, భారత సమాఖ్య నిజమైన సమాఖ్య కాదని, అర్ధ సమాఖ్య అని విమర్శకులు వర్ణించారు. అయితే, భారత రాజ్యాంగ నిర్మాతలు సాంప్రదాయ సమాఖ్య వ్యవస్థ స్వభావం విభేదించి, భారతదేశానికి అనువైన సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందువల్ల కొంత కేంద్ర ఆధిపత్యం, కొన్ని ఏక కేంద్ర లక్షణాలు చొప్పించడము జరిగింది. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఒకే రాజ్యాంగం: సమాఖ్యలకు ప్రత్యేక రాజ్యాంగాలుంటాయి. కానీ భారతదేశంలో కేంద్రము మరియు రాష్ట్రాలకు కలిపి ఒకే రాజ్యాంగము ఉంటుంది. అయితే ఇంతకముందు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేక రాజ్యాంగం ఉంది.
ఏక పౌరసత్వం: సాధారణంగా సమాఖ్యలలో ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. ఉదా. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పౌరులకు రెండు పౌరసత్వాలున్నాయి.. కాని భారత సమాఖ్యలో రాజ్యాంగము కేంద్ర, రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఏక పౌరసత్వ విధానాన్ని కల్పించింది. అంతేకాకుండా, పౌరసత్వానికి సంబంధించిన చట్టాలను రూపొందించడం, అమలుపరచడం మొదలగు అంశాలపైన పార్లమెంటుకు మాత్రమే అధికారముంటుంది.
ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ: సమాఖ్య వ్యవస్థలలో కేంద్రానికి, రాష్ట్రాలకు వేరు వేరుగా న్యాయశాఖలుంటాయి. అంటే న్యాయశాఖ విభజన ఉంటుంది. కాని భారత సమాఖ్యలో కేంద్ర, రాష్ట్రాలకు ఒకే న్యాయవ్యవస్థ ఉంది. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంగా వ్యవహరిస్తూ, కేంద్ర మరియు రాష్ట్ర చట్టాలను సమీక్షిస్తుంది. రాష్ట్ర చట్టాలని పరిశీలించడానికి ప్రత్యేక కోర్టులు లేవు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతే నియమిస్తాడు. దేశంలో ఒకే విధమైన నేరశిక్షాసృృతి అమలులో ఉంది.
అఖిల భారత సర్వీసులు: సమాఖ్యలో కేంద్రానికి రాష్ట్రాలకు ప్రత్యేకంగా సివిల్ సర్వీసులు ఉంటాయి. భారత సమాఖ్య వ్యవస్థలో కేంద్రము రాష్ట్రాలకు వేరువేరుగా సర్వీసులు ఉన్నప్పటికీ ఉమ్మడిగా వర్తించే అఖిల భారత సర్వీసులు ఉండటం సమాఖ్య విధానానికి విరుద్ధం. ఈ సర్వీసులకు చెందిన సభ్యులు యు.పి.ఎస్.సి. ద్వారా ఎంపికై రాష్ట్రపతి చేత నియమించబడతారు. కేంద్ర ప్రభుత్వానికే బాధ్యులై ఉంటారు. రాష్ట్ర పరిపాలనలో కీలకపదవుల్లో నియమితులై, కేంద్ర, రాష్ట్ర చట్టాలను అమలు చేస్తారు.
అత్యవసర అధికారాలు
వివిధ అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి అసాధారణ అధికారాలను కల్పించింది. జాతీయ అత్యవసర్త పరిస్థితి (ప్రకరణ 352), రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి (ప్రకరణ 356) మరియు ఆర్టిక అత్యవసర పరిస్టితి (ప్రకరణ 360) - ఈ మూడు రకాలైన అత్యవసర పరీస్ట్థితులలో కేంద్రం అసాధారణ అధికారాలను పొందుతుంది. ఈసమయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న అధికార విభజన రద్దయి, అన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి బదలాయించబడతాయి. రాజ్యాంగ సమాఖ్య స్వరూపం ఎలాంటి రాజ్యాంగ సవరణ లేకుండానే ఏక కేంద్ర వ్యవస్థగా మారిపోతుంది.
రాజ్యసభలో రాష్ట్రాలకు అసమానత్వ సభ్యత్వం
సమాఖ్య ముఖ్య లక్షణాలలో భాగంగా, రాష్ట్రాల పరిమాణము లేదా జనాభాతో సంబంధము లేకుండా పార్లమెంటులో రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించాలి. అమెరికా, స్విట్టర్లాండ్, ఆస్టేలియాలలో ఈ సూత్రము అమలులో ఉంది. కానీ భారత సమాఖ్యలో, కేంద్రంలో ఎగువసభయైన రాజ్యసభలో వివిధ రాష్ట్రాలకు వాటి జనాభా మేరకు ప్రాతినిధ్యాన్ని కల్పించారు. అందువల్ల, ఉత్తరప్రదేశ్‌కు అత్యధికముగా 31 మంది సభ్యులుంటే, సిక్కింకు 1 సభ్యుడు మాత్రమే ఉన్నారు.
పార్లమెంటుకు రాష్ట్రాల భౌగోళిక స్వరూపాన్ని మార్చే అధికారం
రాష్ట్రాల యొక్క భౌగోళిక సమగ్రత కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. భారత పార్లమెంటు రాష్ట్రాల భౌగోళిక విస్తీర్ణాన్ని పెంచగలదు, తగ్గించగలదు మరియు రాష్ట్రాల పేర్లను కూడా మార్చగలదు. అలాగే రాష్ట్రాలను పునర్‌వ్యవస్థీకరించగలదు. ఈ అధికారం ఇతర సమాఖ్యలలో అమలులో ఉన్న పద్ధతికి విరుద్ధం. ఉదా. అమెరికాలో రాష్ట్రాల సమ్మతి లేకుండా వాటి సరిహద్దులను మార్పు చేసే అధికారము అమెరికా కేంద్ర శాసనసభైన కాంగ్రెసుకు లేదు.
గవర్నర్‌ల నియామకం
సమాఖ్య వ్యవస్థలలో, ముఖ్యంగా అమెరికాలో, గవర్నర్‌లు ప్రజలచేత ఎన్నుకోబడతారు. కానీ భారతదేశంలో గవర్నర్లు రాష్ట్రపతి చేత నియమించబడతారు. గవర్నరు కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగపరమైప్రతినిధి ఈ విధంగా గవర్నర్‌ను నియమించే పద్ధతిని సమాఖ్య విరుద్ధ లక్షణంగా. భావిస్తారు.
రాష్ట్ర జాబితాపై శాసనాలు చేసే అధికారం
దేశ ప్రయోజనాల దృష్టా, రాజ్యసభలో 2/3వ వంతు సభ్యుల ఆమోదంతో తీర్మానం చేస్తే, రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా పార్లమెంటు చట్టాలు చేయవచ్చు. ఈ విధంగా సాధారణ పరిస్థితులలో కూడా రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టాలుచేసే అధికారాన్ని కలిగిఉండటం సమాఖ్య విరుద్ధ లక్షణంగా పరిగణించవచ్చు.
అలాగే రాజ్యాంగ సవరణ విషయంలో బిల్లును ప్రతిపాదించే అధికారం రాష్ట్రాలకు ఉండకపోవడం, రాష్ట బిల్లులను గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపడం, ప్రణాళికా సంఘం నిర్మాణం మరియు పనితీరు ప్రకరణ 256, 257 ప్రకారం కేంద్ర రాష్ట్రాలకు పరిపాలన ఆదేశాలు జారీ చేయడం మొదలగు అంశాలను కూడా ఏక కేంద్ర లక్షణమని పేర్కొంటారు.