కేంద్ర, రాష్ట్ర సంబంధాలు
భారత రాజ్యాంగము దేశంలో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాజ్యాంగంలో ఎక్కడా సమాఖ్య అనే పదాన్ని ప్రయోగించకపోయినా, భారతదేశము సమాఖ్య రాజ్యమే. ఎందుకంటే, సమాఖ్య మౌలిక లక్షణాలన్నీ భారత సమాఖ్యలో ఉన్నాయి. సమాఖ్యలో అత్యంత ముఖ్యలక్షణం అధికార విభజన. రాజ్యాంగములో కేంద్ర, రాష్ట్రాల మధ్య చాలా విస్పతమైన మరియు స్పష్టమైన అధికార విభజన జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య మూడు రకాలైన సంబంధాలను రాజ్యాంగంలో పొందుపరిచారు.
- కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు - 11వ భాగం, ప్రకరణ 245 నుండి 255 (Legislative Relations)
- కేంద్రరాష్ర్రాల మధ్య పరిపాలనా సంబంధాలు - 11వ భాగం, ప్రకరణ 256 నుండి 263 (Administrative Relations)
- కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు - 12 భాగం, ప్రకరణ 264 నుండి 300 (Financial Relations)
కేంద్ర రాష్తాల మధ్య శాసన సంబంధాలు
భాగము 11లోని 245 నుండి 255 వరకు గల ప్రకరణలలో, కేంద్ర, రాష్ట్రాల మధ్య గల శాసన సంబంధాలను పొందుపరిచారు. శాసన సంబంధాలు అనగా, పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలు ఏయే అంశాలపై చట్టాలు చేయవచ్చో వివరించే ప్రక్రియ.
ప్రకరణ-245 - కేంద్ర పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల చట్టాల భౌగోళిక పరిమితులు
పార్లమెంటు రూపొందించే చట్టాలు దేశంలో అన్ని ప్రాంతాలకు, అన్ని సంస్థలకు వర్తిస్తాయి. అంతేకాకుండా, పార్లమెంటు చేసే చట్టాలు ఇతర దేశాలలో నివసిస్తున్న భారతీయులకు కూడా వర్తిస్తాయి (ప్రకరణ 245(2)). ఈ అధికారాన్నే "Extra Territorial Legislation" అంటారు లేదా “సీమాంతేతర చట్టాలు” అంటారు.
రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలు ఆ రాష్ట్ర భూభాగాలకు మాత్రమే వర్తిస్తాయి. వీటికి సీమాంతేతర చట్టాల పరిధి లేదు.
పార్లమెంటు చట్టాలపై పరిమితులు
పార్లమెంటు చేసిన చట్టాలు కొన్ని ప్రాంతాలకు వర్తించవు. ముఖ్యంగా, కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా, నగర్ హవేలి మరియు డామన్, డయ్యూ ప్రాంతాలు. వీటి పరిపాలనను రాష్ట్రపతే నేరుగా నియంత్రిస్తారు. పరిపాలన ఆదేశాలను రాష్ట్రపతి జారీ చేస్తారు. ఇవి పార్లమెంటు చట్టాలతో సమాన ప్రతిపత్తిని కలిగి ఉంటాయి.
రాష్ట్రాలలో ఉన్న కొన్ని షెడ్యూల్డ్ ప్రాంతాలకు కూడా పార్లమెంటు చట్టాలు వర్తించవు. ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తారు. అస్సాం గవర్నర్‌కు ఆ రాష్ట్రంలో ఉన్న స్వయంప్రతిపత్తిగల జిల్లా మండలికి (Autonomous District Council) సంబంధించి ప్రత్యేక అధికారాలు ఉంటాయి.
మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలలో స్వయంప్రతిపత్తిగల జిల్లాలపై రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలు ఉంటాయి.
ప్రకరణ-246 - కేంద్ర. రాష్ట్రాల మధ్య అధికార విభజన
కేంద్ర, రాష్ట్రాల మధ్యగల అధికారాలను మూడు జాబితాలలో విభజించారు. వీటికి సంబంధించిన వివరాలను ఏడవ షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
జాబితాలు
కేంద్ర జాబితా (Union List) ప్రకారణ 246(1)
రాజ్యాంగం అమలులోకి వచ్చిన ప్రారంభంలో 97 అంశాలు ఉన్నాయి. ఈ జాబితాకు 2A, 92A 92B, 92C అంశాలను చేర్చారు. అలాగే 33లో ఉన్న అంశాలను తొలగించారు కనుక, ప్రస్తుతం 100 అంశాలున్నాయి.
జాబితాలోని ముఖ్యంశాలు
దేశరక్షణ, అంతర్జాతీయ వ్యవహారాలు, బ్యాంకింగు, కరెన్సీ, అణుశక్తి, బీమా, ప్రసారాలు, వైమానిక, నౌకా సర్వీసులు మొదలగు జాతీయ ప్రాముఖ్యత గల విషయాలను కేంద్ర జాబితాలో పొందుపరిచారు.
కేంద్ర జాబితాలోని అంశాలపైన పార్లమెంటు చట్టాలను రూపొందించవచ్చు, సవరించవచ్చు, రద్దు చేయవచ్చు.
రాష్ట్ర జాబితా (State List) ప్రకరణ 246(3)
ఇందులో రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 66 అంశాలున్నాయి. ప్రస్తుతము ఇందులో 61 అంశాలు, మాత్రమే ఉన్నాయి. ఈ జాబితాలోని ఎంట్రీ 11, 19, 20, 29, 36 లోని అంశాలను ఉమ్మడి జాబితాలోకి మార్చడం జరిగింది
జాబితాలోని ముఖ్యాంశాలు
శాంతి భద్రతలు, పోలీసు, వ్యవసాయము, నీటిపారుదల, స్థానిక సంస్థలు, ప్రజారోగ్యం, పారిశుద్ద్యము, జైళ్ళు, గ్రంథాలయాలు, మార్కెట్లు, వడ్డీ వ్యాపారము, మొదలగు స్థానిక ప్రాముఖ్యత గల అంశాలను ఈ జాబితాలో పొందుపరిచారు.
ఉమ్మడి జాబితా (Concurrent List) ప్రకరణ 246(2)
రాజ్యాంగ ప్రారంభంలో ఈ జాబితాలో 47 అంశాలు ఉండేవి. ప్రస్తుతము 52 అంశాలున్నాయి. ఈ జాబితాలోని ఎంట్రీ నంబర్స్ 11A న్యాయపాలన, సీజ్ ఆర్జినేట్ కోర్టుల వ్యవస్థీకరణ, 17A అడవులు, 17B వన్యప్రాణుల సంరక్షణ, 20A జనాభా నియంత్రణ మరియు కుటుంబ నియంత్రణ, 25 సాధారణ విద్య, సాంకేతిక విద్య, 33A తూనికలు, కొలతలు.
పై అన్ని అంశాలను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలోకి చేర్చారు. అందువల్ల, ఉమ్మడి జాబితాలోని అంశాలు 47 నుంచి 52 అంశాలకు పెరిగాయి.
కేంద్ర రాష్ట్ర శాసనాల మధ్య వైరుధ్యం
ఉమ్మడి జాబితాలోని అంశాలపైన పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలు చట్టాలు చేయవచ్చు. అయితే, కేంద్ర శాసనానికి రాష్ట్ర శాసనానికి మధ్య వైరుధ్యం ఏర్పడితే, అంతిమంగా కేంద్ర శాసనానికే ఆధిక్యత ఉంటుంది. కొన్ని సందర్భాలలో మినహాయింపు ఉంటుంది.
ప్రకరణ 254 ప్రకారం, ఉమ్మడి జాబితాలోని అంశాలపైన రాష్ట్రపతి పూర్వానుమతిలో రాష్ట్ర శాసనసభ చట్టం చేసి, ఇదే అంశంపై పార్లమెంటు కూడా చట్టం చేసినచో మరియు పార్లమెంటు చేసిన చట్టం రాష్ట్ర శాసనసభ చేసిన చట్టానికి విరుద్ధమయినచో, రాష్ట్ర శాసనసభ చేసిన చట్టమే చెల్లుబాటు అవుతుంది.