భారత సమాఖ్య వ్యవస్థ-అంతర్‌ రాష్ట్ర సంబంధాలు

TSStudies
0

 అంతర్‌ రాష్ట్ర సంబంధాలు

ఒక సమాఖ్య వ్యవస్థ విజయవంతంగా పనిచేయడానికి కేంద్ర, రాష్ట్ర సంబంధాలు ఎంతముఖ్యమో, అంతర్‌ రాష్ట్ర సంబంధాలు కూడా అంతే ముఖ్యం అనే వాస్తవాన్ని గుర్తించిన రాజ్యాంగ నిర్మాతలు, అంతర్‌ రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి మరియు స్నేహపూరిత వాతావరణాన్ని కల్పించడానికి రాజ్యాంగంలో కొన్ని ఏర్పాట్లు చేశారు. అందులో ముఖ్యమైనవి
  • అంతర్‌ రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌లు
  • అంతర్‌ రాష్ట్ర మండళ్ళు
  • పబ్లిక్‌ చట్టాలు, రికార్డులు, న్యాయస్థానాల ఆదేశాలను పరస్పరం గుర్తించే పద్ధతులు
  • అంతర్‌ రాష్ట్ర వాణిజ్య వ్యాపార సంబంధాలు
అంతర్‌రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారం
ప్రకరణ 262 ప్రకారం, అంతర్‌ రాష్ట్ర నదీ జలాల వివాదాలను సత్వరమే పరిష్కరించడానికి పార్లమెంటు ఒక చట్టం ద్వారా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయవచ్చు. అలాంటి వివాదాలను నేరుగా ట్రిబ్యునలే పరిష్కరిస్తుంది. ఇందుకోసం 1956లో అంతర్‌ రాష్ట్ర జలాల వివాదాల చట్టం మరియు రివర్‌ బోర్డు చట్టాన్ని రూపొందించారు. వీటికి పాక్షిక న్యాయాధికారాలు ఉంటాయి. (Quasi-Judicial)
ప్రకరణ 262(2) ప్రకారం, పార్లమెంటు చేసిన చట్టాలపై సుప్రీంకోర్టుకు న్యాయసమీక్ష అధికారం ఉండదు. కానీ కేంద్రం తన శాసన విధులను నిర్వర్తించేలా ఆదేశించవచ్చు.
ఈ ట్రిబ్యునళ్ల ప్రధాన ఉద్దేశం వివాదాలను సత్వరమే పరిష్కరించడం.
సాధారణంగా అంతర్‌ రాష్ట్ర వివాదాలు సుప్రీంకోర్టు ప్రారంభ పరిధిలోకి వస్తాయి. అయితే, నదీ జలాల పంపిణీ వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేక ట్రిబ్యునళ్ళు ఏర్పాటు అయితే, ఆయా రాష్ట్రాలు ట్రిబ్యునళ్ళలోనే వివాదాలను పరిష్కరించుకోవాలి. వీటి తీర్పులపై సుప్రీం కోర్టులో కేవలం సలహా పూర్వకమైన అప్పీలు చేసుకోవచ్చు.
ఇప్పటివరకు దేశంలో ఎనిమిది అంతర్‌ రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేశారు.
  • కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్‌ - 1969 (ఈ ట్రిబ్యునల్‌ పరిధిలోకి వచ్చేరాష్ట్రాలు మహారాష్ట్ర, కర్నాటక. ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ).
  • గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్‌ - 1969 (మహారాష్ట్ర కర్టాటక, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ మరియు తెలంగాణ)
  • నర్మదా నదీ జలాల ట్రిబ్యునల్‌ - 1969 (రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ మరియు మహారాష్ట్ర
  • రావి మరియు బియాస్‌ నదీ జలాల ట్రిబ్యునల్‌ - 1986 (పంజాబ్‌ మరియు హర్యానా)
  • కావేరీ నదీ జలాల ట్రిబ్యునల్‌ - 1990 (కర్నాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి)
  • కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్‌ - 2004 (మహారాష్ట్ర కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ)
  • వంశధార నదీ జలాల ట్రిబ్యునల్‌ - 2010 (ఒడిష, ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ)
  • మహాదాయి నదీ జలాల ట్రిబ్యునల్‌ - 2010 (గోవా, కర్ణాటక, మహారాష్ట్ర)

అంతర్‌ రాష్ట్ర మండలి (Inter State Council)
ప్రకరణ 263 ప్రకారం, అంతర్‌ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేస్తారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య మరియు అంతర్‌ రాష్ట్రాల మధ్య వివిధ అంశాలపైన విచారణ చేసి తగు సూచనలు చేస్తుంది.

అంతర్‌ రాష్ట్ర మండలి నిర్మాణం
సర్కారియా కమీషన్‌ నివేదిక (1983-87) మేరకు, జనతాదళ్‌ ప్రభుత్వం (వి.పి.సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు) 1990లో అంతర్‌ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసింది. దీని నిర్మాణం ఈ విధంగా ఉంటుంది.
  • ప్రధానమంత్రి అధ్యక్షుడు
  • అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు - సభ్యులు
  • కేంద్ర పాలిత ప్రాంతాల. ముఖ్యమంత్రులు (శాసన సభలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు) - సభ్యులు
  • కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలకులు - సభ్యులు
  • కేంద్ర ప్రభుత్వ హోం మంత్రి సహా ఆరుగురు కాబినెట్‌ మంత్రులు - సభ్యులు

విధులు
  • కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రయోజన విషయాలను పరిశీలించి, చర్చించి నివేదిక ఇవ్వడం
  • అంతర్‌ రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని సాధించే పద్ధతిని, చర్యలను సూచించడం.
  • కౌన్సిల్‌కు నివేదించబడిన ఇతర సాధారణ విషయాలపైన చర్చించి సూచనలు చేయడం
కౌన్సిల్‌ సంవత్సరానికి మూడు పర్యాయాలు సమావేశం కావాలి, దీని విధులన్నీ సలహా విధులే.
అంతర్‌ రాష్ట్ర మండలి సంవత్సరానికి కనీసం మూడు పర్యాయాలు సమావేశం కావాలి. సమావేశంలో వివిధ అంశాలను ఏకాభిప్రాయ సాధన పద్ధతిలో నిర్ణయిస్తారు.
1996లో నిరంతర సలహాల కోసం ఒక స్థాయి సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీనికి కేంద్ర హోం శాఖా మంత్రి ఛైర్మన్‌గా ఉంటారు మరియు ఐదుగురు కేంద్ర క్యాబినెట్‌ మంత్రులు, తొమ్మిది ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉటారు.
అంతర్‌ రాష్ట్ర మండలికి ప్రత్యేక సచివాలయం ఉంది. దీనికి అధిపతిగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఉంటారు.
ఈ సచివాలయమే జోనల్‌ కౌన్సిళ్ళకు కూడా ఉమ్మడి సచివాలయంగా పనిచేస్తుంది.
ప్రకరణ 263 ప్రకారం, రాష్ట్రపతి ఈ క్రింది కౌన్సిల్స్‌ను కూడా ఏర్పాటు చేసారు.
  • రాష్ట్రపతి సెంట్రల్‌ హెల్త్‌ కౌన్సిల్‌
  • సెంట్రల్‌ లోకల్‌ గవర్నమెంట్‌ కౌన్సిల్‌
  • అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌
  • నాలుగు ప్రాంతీయ అమ్మకపు పన్ను కౌన్సిళ్ళను కూడా ఏర్పాటు చేశారు.
అలాగే 2003లో సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడిసిన్‌ మరియు అలాగే సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హోమియోపతి అనే సంస్థలను కూడా ఏర్పాటు చేశారు.
పబ్లిక్‌ రికార్డ్‌లు - న్యాయ ప్రక్రియలు
రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర అధికార పరిధి రాష్ట్ర భూభాగానికే పరిమితం కనుక, రాష్ట్రాలు జారీ చేసిన చట్టాలను, రికార్డులను, ఇతర సర్టిఫికెట్లను ఇతర రాష్ట్రాలు కూడా గౌరవించే విధంగా ప్రకరణ 261లో కొన్ని ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి పార్లమెంటు చట్టాలను రూపొందిస్తుంది.
అంతర్‌ రాష్ట్ర వ్యాపార వాణిజ్య సంబంధాలు
రాజ్యాంగంలో 13వ భాగంలో, ప్రకరణ 301 నుండి 307 వరకు అంతర్‌ రాష్ట్ర వ్యాపార, వాణిజ్య అంశాలకు సంబంధించి కొన్ని రక్షణలు పేర్కొన్నారు. ప్రకరణ 301 ప్రకారం దేశంలో ఎక్కడైనా వాణిజ్యాన్ని. వ్యాపారాన్ని మరియు వృత్తిని చేసుకోవడానికి స్వేచ్చ ఉంటుంది. అయితే కొన్ని రాష్ట్రాల ప్రత్యేక ప్రయోజనాల కోసం, ఈ స్వేచ్చల పైన పరిమితులు విధించవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)