కేంద్ర, రాష్ట్ర సంబంధాలు - వివాదాలు - సమీక్షా కమీషన్లు
కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో తలెత్తిన వివాదాలను పరిశీలించి, పరిష్కరించడానికి అనేక కమిటీలను, కమీపన్లను నియమించడం జరిగింది. ఈ కమిటీలు వాటికి నిర్దేశించిన పరిధిలో కొన్ని సిఫారసులు చేశాయి. వాటిని ఈ క్రింది విధంగా వివరించవచ్చు.
పరిపాలనా సంస్కరణల సంఘం (1966)
కేంద్ర ప్రభుత్వం 1966లో ఆరుగురు సభ్యులతో మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన పరిపాలనా సంస్కరణల కమీషన్‌ను నియమించింది. (మొరార్జీ దేశాయ్ రాజీనామా చేయడం వల్లన హనుమంతయ్య ఈ కమీషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించారు)
ఈ కమిటీ కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమగ్రంగా పరిశీలించింది.
కేంద్ర, రాష్ట్ర సంబంధాలకోసం ఎం.సి. సెతల్వాడ్ అధ్యక్షతన ఒక అధ్యయన బృందాన్ని కూడా నియమించారు. పరిపాలనా సంస్కరణ సంఘం తన తుది నివేదికను 1969లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో 22 సిఫారసులు చేశారు.
- ప్రకరణ 263 ప్రకారం, అంతర్‌రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి
- ప్రజా జీవితంలో, అలాగే పరిపాలనలో అనుభవం ఉన్న వ్యక్తినే గవర్నర్‌గా నియమించాలి.
- రాష్ట్రాల కోరిక మేరకే కేంద్ర బలగాలను పంపాలి.
- రాష్ట్రాలకు మరిన్ని ఆర్థిక వనరులను బదిలీ చేయాలి.
అయితే ఈ సిఫారసులపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
రాజమన్నార్ కమిటీ 1969)
1969లో తమిళనాడు ప్రభుత్వం జస్టిస్ పి.వి. రాజమన్నార్ అధ్యక్షతన, ఇద్దరు సభ్యులతో కేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిశీలనకు ఒక కమీషన్ నియమించింది. ఈ కమీషన్ తన నివేదికను 1971లో సమర్పించింది. కమీషన్‌లోని ఇతర సభ్యులు లక్ష్మణస్వామి మొదలియార్, పి.పి. చంద్రారెడ్డి.
ఆనంద్‌పూర్ సాహెబ్ తీర్మానం (1973)
1973లో పంజాబ్‌లో అకాలీదళ్ పార్టీ ఆనందపూర్ సాహెబ్ అనే ప్రాంతంలో ఒక తీర్మానాన్ని చేసింది. రక్షణ, అంతర్జాతీయ సంబంధాలు, కమ్యూనికేషన్లు, కరెన్సీ మొదలగు విషయాలకే కేంద్ర పరిధి పరిమితం కావాలని, దేశంలో నిజమైన సమాఖ్య స్ఫూర్తి తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
గాడ్గిల్ ఫార్ములా
సమాఖ్య విధానంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ సక్రమంగా జరగాల్సిన ఆవశ్యకత ఉంది. 1971లో గాడ్గిల్ ఫార్ములా పేరుతో కేంద్ర ప్రణాళికా సహాయాన్ని ఏ ప్రాతిపదికన రాష్ట్రాలకు పంపాలో అన్న విషయంలో తయారు చేశారు. దీన్ని 1981లో ఒకసారి, తిరిగి 1992లో మరొకసారి సమీక్షించారు. డి.ఆర్. గాడ్గిల్ ప్రణాళిక సంఘం మాజీ డిప్యూటి ఛైర్మన్ ఫార్ములాను అనుసరించి
- జనాభా ఆధారంగా 60 శాతం
- తలసరి ఆదాయం ఆధారంగా 25 శాతం
- ఆదాయ, వ్యయాలని సరిచూసుకుని విత్తలోటు తగ్గించినందుకు గాను 7.5 శాతం
- ఇతర సమస్యల (ఎడారి ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, శిశు మరణాలు, ఆరోగ్యం, మొదలైనవి) ఆధారంగా 7.5 శాతం
కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు తన సహాయాన్ని అందిస్తుంది. అయితే వెనకబడ్డ పేద రాష్ట్రాలకు ఈ ఫార్ములా అంత ఉపయోగకరంగా లేదు. విత్త రంగంలో చూపిన క్రమశిక్షణని ఈ ఫార్ములా ప్రోత్సాహపరుస్తున్నట్లుగా లేదని కొందరి విమర్శ.
సర్కారియా కమీషన్ సిఫారసులు (1987)
1983 సం.లో కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.ఎస్. సర్కారియా అధ్యక్షతన బి. శివరామన్, యస్.ఆర్. సేన్ సభ్యులుగా మరియు కమీషన్ కార్యదర్శిగా ఆర్.ఎం. సుబ్రహ్మణ్యం, రాజ్యాంగ సలహాదారుడుగా ఎల్ ఎన్ సిన్హాతో ఒక కమీషన్‌ను నియమించింది. ఈ కమీషన్ 1987 అక్టోబర్ 27న తేదిన 247 సిఫారసులతో కూడిన 1600 పేజీల నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. 1988 జనవరిలో ప్రభుత్వం సర్కారియా కమీషన్ నివేదికను విడుదల చేసింది. అందులో 230 సిఫారసులపై కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయాలను తీసుకుంది. మొత్తం సిఫారసులలో 170 సిఫారసులను అమలు చేసింది.
ముఖ్య సిఫారసులు
- గవర్నర్‌ల నియామకంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులను సంప్రదించాలి.
- రాజకీయేతర రంగాలకు చెందిన, వివాదాస్పదం కాని వ్యక్తులను, ప్రముఖులను మాత్రమే గవర్నర్‌లుగా నియమించాలి. రాష్ట్రేతర వ్యక్తినే గవర్నర్‌గా నియమించాలి.
- ముఖ్యమంత్రి నియామాకం, రాష్ట్ర మంత్రి మండలి కొనసాగింపు విషయంలో విధాన సభ మెజారిటీ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవాలి. అరుదైన సందర్భాలలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలి.
- అఖిల భారత సర్వీసులను మరింత బలోపేతం చేసి, మరి కొన్ని క్రొత్త సర్వీసులను ఏర్పాటు చేయాలి.
- ఆదాయ పన్నుపై సర్వీసు ఛార్జీలను ప్రత్యేక సందర్చాలలోనే విధించాలి.
- భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలవారికి ప్రత్యేక కమీషన్‌ను నియమించి క్రియాత్మకంగా చేయాలి.
- రేడియో, టెలివిజన్‌లకు స్వయంప్రతిపత్తి అవసరంలేదు. అయితే వాటి పనితీరును వికేంద్రీకరణ చేయాలి.
- ఆర్థికసంఘం, ప్రణాళికా సంఘం మధ్య ప్రస్తుత విధుల విభజన హేతుబద్దంగానే ఉంది. దీనిని కొనసాగించాలి.
- మంత్రులపైన ఎంక్వయిరీ కమీషన్ వేసే సందర్భంలో పార్లమెంటు అనుమతి తీసుకోవాలి.
- రాష్ట్ర ఎగువసభ రద్దు లేదా ఏర్పాటు విషయంలో పార్లమెంటు నిర్ణీత సమయంలోనే తన అభిప్రాయాన్ని తెలియచేయాలి.
మదన్ మోహన్ పూంచిక్షమీషన్-(2007)
2007 నాటికి ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ఆర్థిక సరళీకరణ, ఉదారవాదం దృష్టా కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో గణనీయమైన మార్పులు సంభవించాయి. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర సంబంధాలను సమగ్రంగా సమీక్షించడానికి 2007 ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మదన్‌మోహన్ పూంచి అధ్యక్షతన, వినోద్ కుమార్ దుగ్గల్ (మాజీ హోం కార్యదర్శి), ధీరేంద్ర సింగ్ (మాజీ హోం కార్యదర్శి), అమరేష్ బాగ్చి(మాజీ డైరెక్టర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్సెస్ అండ్ పాలసీ), డా. ఎన్.ఆర్. మాధవ మీనన్ (మాజీ డైరెక్టర్, నేషనల్ జుడిషియల్ అకాడమి) లు నలుగురు సభ్యులుగా రెండవ కేంద్ర, రాష్ట్ర సంబంధాల సమీక్ష కమీషన్‌ను ఏర్పాటు చేశారు. పూంచి కమీషన్ తన నివేదికను ఏప్రిల్ 2010లో ప్రభుత్వానికి సమర్పించింది.
రెండవ పరిపాలనా సంస్కరణల సంఘం-2005
కేంద్ర ప్రభుత్వంలోని పరిపాలనా సంస్కరణల ప్రజా క్లేశ పరిష్కరణ విభాగము, ప్రభుత్వ పాలనలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి వివిధ కమీషన్‌లను నియమిస్తుంది. ఈ విభాగము 2005లో శ్రీ వీరప్ప మొయిలీ అధ్యక్షతన రెండవ పరిపాలనా సంస్కరణల కమీషన్‌ను నియమించింది. ఇందులో మొత్తం ఐదు మంది సభ్యులున్నారు.
- వీరప్ప మొయిలీ (ఛైర్మన్)
- వి.రామచంద్రన్ (సభ్యులు)
- ఎ.హెచ్. కర (సభ్యులు)
- డా. జయప్రకాళ్ నారాయణ్ (సభ్యులు)
- డా. వినీతా రాయ్ (మెంబర్ సెక్రటరీ)
రెండవ పరిపాలనా సంస్కరణల సంఘం ప్రభుత్వ పాలనా వ్యవస్థను సమగ్రంగా పునర్ వ్యవస్థీకరించడానికి, అలాగే బాధ్యతాయుత వ్యవహరణ, జవాబుదారీతనం మరియు సమర్థవంతమైన పాలనకు సంబంధించి మొత్తం 15 నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినది.
కేంద్ర రాష్ట్ర సంబంధాలు - ప్రతిపక్ష శిఖరాగ్ర సమావేశాలు
కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో రావలసిన మార్పులకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు అనేక శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించాయి. వాటిని ఈ క్రింది విధంగా పరిశీలించవచ్చు.
విజయవాడ సమావేశం
ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు చొరవతో 1983 మే 28వ తేదీన విజయవాడలో తెలుగుదేశం పార్టీ వార్షిక సమావేశము మహానాడు పేరుతో 14 ప్రతిపక్షాల మహాసభ జరిగింది. ఈ సమావేశానికి వాజ్‌పేయి, చంద్రశేఖర్, ఫరూక్ అబ్బుల్లా, మొదలగు ప్రముఖ ప్రతి పక్షనాయకులు హాజరయ్యారు.
శ్రీనగర్ సమావేశం
కేంద్ర రాష్ట సంబంధాలను చర్చించడానికి ప్రతిపక్షాలు రెండవ సమావేశాన్ని 1983 అక్టోబర్‌లో శ్రీనగర్‌లో నిర్వహించారు. ఫరూక్ అబ్బుల్లా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వ అధికారాలు నాలుగు అంశాలకే పరిమితం కావాలని, మిగిలిన అంశాలను రాష్ట్రాలకు ఇవ్వాలని తీర్మానించారు. అలాగే గవర్నర్ పదవిని రద్దు చేయాలని కూడా కోరారు.
కలకత్తా సమావేశం
1984 జనవరి 13వ తేదీన 19 ప్రతిపక్ష పార్టీ నాయకులు కాంగ్రేసేతర ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 11 అంశాలపైన తీర్మానాన్ని ఆమోదించారు. నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు సరఫరా చేయడం, ప్రజా పంపిణీ విధానాన్ని పటిష్టం చేయడం, పనికి ఆహారమనే కార్యక్రమాన్ని పునరుద్ధరించడం, జాతీయ భద్రతా చట్టాన్ని జాతీయ అత్యవనర నిర్వహాణ చట్టాన్ని తొలగించడం వంటి అంశాలు ఆ తీర్మానంలో ఉన్నాయి.
కేంద్ర. రాష్ట సంబంధాలను ప్రభావితం చేసే రాజకీయ పరిణామాలు
రాజ్యాంగపరంగానే కాకుండా ఇతర విషయాల్లో కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలను ప్రభావితం చేసిన అంశాలు అనేకం ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైన పరిణామాలు
- 1950 నుండి 1967 వరకు కేంద్ర, రాష్ట్ర సంబంధాలతో పెద్దగా వివాదాలు ఏర్పడలేదు. కారణం కేంద్రంలోను, రాష్ట్రంలోను ఒకే రాజకీయ పార్టీ అధికారంలో ఉండటం. గవర్నర్‌లు, ముఖ్యమంత్రులు ఒకే రాజకీయ పార్టీకి చెందినవారు కావడంతో కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో ఎలాంటి మార్పు కనిపించలేదు.
- 1967 నుండి 1992 వరకు కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విషయంలో, వనరుల పంపిణీ విషయంలో వివాదాలు తలెత్తాయి. 1967 సాధారణ ఎన్నికలలో అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం, తమిళనాడులో డి.ఎం.కె., పశ్చిమ బెంగాల్ యునైటెడ్ ఫ్రంట్, బీహార్, ఉత్తరప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాలలో సంయుక్త విధాయకదళ్ అనే కూటములు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ పరిణామంతో రాష్ట్రాల స్వయంప్రతిపత్తిలో కేంద్రం జోక్యం ఉండరాదని రాష్ట్రలకు స్వతంత్ర్య ప్రతిపత్తి అవసరమని ప్రతిపక్షాల కూటమి డిమాండు చేస్తూ వచ్చింది. 1972 నుండి 1977 మధ్య కాలంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఎటువంటి వివాదాలు ఏర్పడలేదు. దీనికి ముఖ్య కారణము 1967లో ఓడిపోయిన కాంగ్రెసు పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. 1972 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్‌పార్టీ అత్యధిక మెజారిటీతో కేంద్రంలోను, రాష్ట్రాలలోను తిరిగి అధికారంలోకి వచ్చింది.
- 1977 నుండి 1980 మధ్య కాలంలో భారత రాజకీయాలలో మరొక నూతన రాజకీయ పరిణామం ఏర్పడింది. 1977లో లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఓడిపోయి, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ అధ్యక్షతన విపక్షాల కూటమి అయిన జనతాపార్దీ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత 1978లో రాష్ట్ర శాసనసభలకు జరిగిన ఎన్నికలలో జనత పార్టీ అనేక రాష్ట్రాలలో అధికారంలోకి రావటంతో పాటు, తమిళనాడులో డి.ఎమ్.కె., పంజాబ్‌లో అకాలీదళ్, జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్, పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష సమాఖ్య కూటమి ప్రభుత్వాలను ఏర్పరచడంతో, అధికారాల విషయంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించాయి.
- 1980లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో శ్రీమతి ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చింది. 1983 తరువాత అనేక రాష్ట్రాలలో కాంగ్రేసేతర ప్రభుత్వాలు ఏర్పడటంతో, కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల విషయంలో, గవర్నర్‌ల పాత్ర, రాష్ట్ర ప్రభుత్వాల బర్తరఫ్, మొదలగు విషయాలలో తరచు వివాదాలు ఏర్పడ్డాయి.