రాష్ట్రపతి తొలగింపు విధానం - మహాభియోగ తీర్మానం

TSStudies
0

Impeachment resolution of the President of India

  • ప్రకరణ 61(1)లో రాష్ట్రపతిని తొలగించే ప్రక్రియను పేర్కొన్నారు. దీనినే మహాభియోగ తీర్మానం అంటారు. ఇది ఒక క్వాజై జ్యుడీషియల్‌ పద్ధతి (Quasi-Judicial) ప్రక్రియ. ఈ పద్ధతిని. అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది.
  • “రాజ్యాంగ అతిక్రమణ” అనే ఏకైక కారణం వల్ల రాష్ట్రపతి తొలగించబడతారు. మహాభియోగ తీర్మాన ప్రక్రియను పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అందుకుగాను ఏ సభలో ప్రవేశపెడుతున్నారో ఆ సభలోని మొత్తం సభ్యులలో 1/4 వంతు సభ్యులు సంతకాలు చేసి, 14 రోజుల ముందస్తు నోటీసును సంబంధిత సభకు, రాష్ట్రపతికి ఇవ్వాలి. ఆ తరువాత తీర్మానం ప్రవేశపెట్టిన సభలో తొలగించే విషయంలో చర్చ జరుగుతుంది. చర్చ తరువాత ఆ సభలోని మొత్తం సభ్యులలో (ఖాళీ స్థానాలతో సహా) 2/3 వంతు సభ్యులు ఆ అభియోగాన్ని ఆమోదిస్తే, మహాభియోగ ప్రక్రియలో మొదటి దశ పూర్తవుతుంది.
  • తరువాత మహాభియోగ తీర్మానం ఇంకో సభకు పంపడం జరుగుతుంది. ఈ దశలో రెండవ సభ స్వయంగాకానీ లేదా కమిటీ ద్వారా గానీ, రాష్ట్రపతి పైన పేర్కొన్న అభియోగాలపై విచారణ జరుపుతుంది. ఈ సమయంలో రాష్ట్రపతి స్వయంగా కానీ, న్యాయవాది ద్వారాగానీ తన వాదన వినిపించవచ్చు. రెండో సభ కూడా మొత్తం సభ్యులలో 2/3 వ వంతు మెజారిటీతో మహాభియోగ తీర్మానాన్ని ఆమోదిస్తే, ఆమోదించిన రోజు నుండి రాష్ట్రపతిని తొలగించినట్లు ప్రకటిస్తారు.

అమెరికా అధ్యక్షునితో పోలిక 

అమెరికా అధ్యక్షుడు కూడా పైవిధంగానే తొలగించబడతాడు. కానీ తీర్మానం మాత్రం దిగువ సభలోనే ప్రవేశపెట్టాలి. ఎగువ సభలో (Senate) తీర్మానం వచ్చినప్పుడు ఆ సభకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు.

గమనిక: మహాభియోగ తీర్మానం ద్వారా ఇంతవరకు ఏ రాష్ట్రపతి కూడా తొలగించబడలేదు. ఐతే 1971లో ఆ నాటి రాష్ట్రపతి వి.వి.గిరిపై మహాభియోగ తీర్మానం నోటీస్‌ ఇచ్చారు. దానిని తర్వాత ఉపసంహరించుకున్నారు.

మహాభియోగ తీర్మానం - కొన్ని లోపాలు

  • రాష్ట్రపతి మీద అభియోగాలు. విచారణ దశలో ఉన్నప్పుడు ఆ సమయంలో రాష్ట్రపతి తన పదవిలో కొనసాగవచ్చు.
  • రాజ్యాంగ అతిక్రమణ అనే వాక్యానికి సరి అయిన అర్జాన్ని రాజ్యాంగంలో పేర్కొనలేదు.
  • రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనని నామినేటెడ్‌ సభ్యులు కూడా తొలగింపు ప్రక్రియలో పాల్గొనవచ్చు.
  • రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే రాష్ట్ర విధాన సభ సభ్యులకు తొలగింపు ప్రక్రియలో పాల్గొనే అవకాశం లేధు.
  • మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించబడిన రాష్ట్రపతి తిరిగి పోటీచేసే విషయంపై స్పష్టత లేదు.

రాష్ట్రపతి పదవి - షరతులు

  • ప్రకరణ 59 ప్రకారం ఈ క్రింది షరతులు వర్తిస్తాయి.
  • పార్లమెంటు లేదా రాష్ట్ర శాసన సభలో సభ్యుడై ఉండరాదు. ఒకవేళ ఉంటే, ఎన్నికైన రోజునుంచి ఆ సభ్యత్వం ఖాళీ అవుతుంది.
  • ఆదాయం వచ్చే లాభదాయక పదవులలో ఉండరాదు.
  • రాష్ట్రపతి జీత భత్యాలు, పెన్షన్ ఇతర సౌకర్యాలకు సంబంధించి పార్లమెంటు ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది.

రాష్ట్రపతి యొక్క జీత భత్యాలు

ప్రకరణ 59 ప్రకారము, రాష్ట్రపతి జీతభత్యాలను పార్లమెంటు నిర్హయిస్తుంది. వీటిని కేంద్ర ప్రభుత్వ సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. వీటిని ఎట్టి పరిస్థితులలోను తగ్గించడానికి వీలులేదు.

(ఎ) ప్రస్తుతము రాష్ట్రపతికి వేతనం నెలకు రూ. 1,50,000, ఇది కాక బి) ఉచిత నివాసము సి) పదవీ విరమణ తర్వాత పెన్షన్‌ సౌకర్యం డి) ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి.

అలాగే రాష్ట్రపతికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కూడా ఉంటాయి.

భారతదేశంలోను, విదేశాలలోను పర్యటించినప్పుడు రాజ్య గౌరవాన్ని పొందుతారు. అలాగే ప్రకరణ 361 ప్రకారం, రాష్ట్రపతి ఏ న్యాయస్టానానికీ జవాబుదారి కాడు. ఇతని పదవీకాలంలోని చర్యలకు ఏ న్యాయస్థానంలోను దావా వేయరాదు. రాష్ట్రపతికి సిమ్లాలో వేసవి విడిది, సికింద్రాబాద్‌లోని బొల్లారంలో శీతాకాల విడిది ఉన్నాయి

ప్రత్యేక సమాచారం

రాష్ట్రపతి అధికార నివాసాన్ని రాష్ట్రపతి భవన్‌. అంటారు. దీని రూప శిల్పులు ఎడ్విన్‌ లుటియన్స్‌ & బేకర్‌. 1912లో నిర్మాణం ప్రారంభమై 1929 పూర్తి అయ్యింది. మొత్తం 320 ఎకరాల స్టలంలో ఉంది. దీనిలో 310 గడులు ఉన్నాయి. గతంలో దీనిని వైస్రాయి రెసిడెన్స్‌ అని పిలిచేవారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మొఘల్‌ గార్డెన్స్‌ ఇందులో ఉన్నాయి. 1950 జనవరి 26 నుంచి రాష్ట్రపతి భవన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని రైజీనా హిల్స్‌ (Raisina Hills) అంటారు.

రాష్ట్రపతి అధికారాలు - విధులు

రాష్ట్రపతి భారత గణతంత్ర రాజ్యాధినేత దేశ మొదటి పౌరుడు. 53వ ప్రకరణ ప్రకారం, కేంద్ర కార్యనిర్వహణాధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అతడు ఈ అధికారాలను రాజ్యాంగం ప్రకారం స్వయంగా కానీ, తన క్రింది అధికారుల ద్వారా కానీ నిర్వహిస్తారు. రాష్ట్రపతి నిర్వహించే సమస్త అధికారాలు కార్యనిర్వాహణా ౦ అనే భావనలోనే ఉంటాయని జె.సి. జోహారి పేర్కొన్నారు. అంటే సాధారణంగా చర్చించే వివిధ అధికారాలైన కార్యనిర్వాహక, శాసన, ఆర్థిక న్యాయాధికారాలు కార్యనిర్వహణాధికారం అనే భావనలోనే ఉంటాయని పేర్కొనవచ్చు.

రాజ్యాంగంలో ఎక్కడా రాష్ట్రపతి అధికారాలను వివిధ రకాలుగా వర్గీకరించడం జరగలేదు. కాని సౌలభ్యం కోసం రాష్ట్రపతి అధికారాలను ఈ క్రింది విధంగా విభజించవచ్చు.

1. సాధారణ అధికారాలు - విధులు 2. అసాధారణ అధికారాలు

సాధారణ అధికారాలు

సాధారణ సమయాల్లో రాష్ట్రపతి నిర్వహించే విధులను సాధారణ అధికారాలని అనవచ్చు. వీటిని ఈ క్రింది విధంగా వివరించవచ్చు.

కార్యనిర్వహణాధికారాలు (Executive Powers)

రాష్ట్రపతి భారత గణతంత్రానికి ప్రధాన కార్యనిర్వహణాధిపతి. ప్రకరణ 74(1) ప్రకారం, ప్రధానమంత్రి అధ్యక్షతనగల కేంద్రమంత్రి మండలి సలహా, సహాయాలతో రాష్ట్రపతి తన విధులను నిర్వహిస్తారు. తన క్రింది అధికారుల ద్వారా రాజ్యాంగం ప్రకారం అధికార నిర్వహణ చేయాలని 53వ ప్రకరణ తెలుపుతుంది.

ప్రకరణ 77 ప్రకారం, కార్యనిర్వహణాధికారాలు రాష్ట్రపతి పేరు మీదే ప్రకటించాలి. రాష్ట్రపతి ఈ కార్య నిర్వహణాధికారం నిర్వహించడానికి అనేక నియామకాలు చేస్తాడు. రాజ్యాంగ సూత్రాల ప్రకారం వారిని తొలగిస్తాడు. కార్యనిర్వహణాధికారాలను క్రింది విధంగా పేర్కొనవచ్చు.

  • మంత్రిమండలి నియామకం ప్రకరణ (75)
  • ప్రధానమంత్రి నియామకం ప్రకరణ 75(1)
  • అటార్నీ జనరల్‌ నియామకం ప్రకరణ 76(1)
  • సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల నియామకం ప్రకరణ (124)
  • రాష్ట్ర గవర్నర్ల నియామకం ప్రకరణ (155)
  • కంప్రోలర్‌ మరియు ఆడిటర్‌ జనరల్‌ నియామకం ప్రకరణ (148)
  • రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల నియామకం ప్రకరణ (217)
  • కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్ట్నెంట్‌ గవర్నర్‌లను మరియు పరిపాలకులను నియమిస్తారు ప్రకరణ (239)
  • కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ మరియు పుదుచ్చేరి ముఖ్యమంత్రులను, మంత్రిమండలిని నియమిస్తారు (239AA, 239A)
  • అంతర్‌రాష్ట్ర మండలిని ఏర్పాటు చేస్తారు ప్రకరణ (263)
  • ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు ప్రకరణ (280)
  • యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ అధ్యక్షుడు, సభ్యుల నియామకం ప్రకరణ (316)
  • ప్రధాన ఎన్నికల కమీషనర్‌, ఎలక్షన్‌ కమీషన్‌ సభ్యుల నియామకం ప్రకరణ (329(2))
  • షెడ్యూల్డ్‌ కులాల జాతీయ కమీషన్‌ అధ్యక్షుడు, సభ్యుల నియామకం ప్రకరణ (338)
  • షెడ్యూల్డ్‌ తెగల జాతీయ కమీషన్‌ అధ్యక్షుడు, సభ్యుల నియామకం ప్రకరణ (338A)
  • ప్రకరణ 78 ప్రకారం, కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాల సమాచారాన్ని తెలుసుకునే హక్కు రాష్ట్రపతికి ఉంది.

శాసనాధికారాలు - విధులు (Legislative Powers)

ప్రకరణ 79 ప్రకారం, రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం.
రాష్ట్రపతి పార్లమెంటులో ఏ సభలోను సభ్యుడు కాదు. అయినా అతనికి ఈ క్రింది శాసనాధికారాలున్నాయి.

  • పార్లమెంటు ఉభయసభలను సమావేశపరచటం - ప్రకరణ 85(1)
  • ఏ సభా సమావేశాన్ని అయినా సమాపనం చేయడం - ప్రకరణ 85(2)
  • పార్లమెంటు ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే దీనిని పరిష్కరించడానికి ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయడం - ప్రకరణ 108
  • లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్‌ చేయడం - ప్రకరణ 331
  • రాజ్యసభకు 12 మంది వివిధ రంగాల నిష్టాతులను నామినేట్‌ చేయడం - ప్రకరణ 80(3)
  • పార్లమెంటు సభ్యుల అనర్హత్రలను నిర్ణయించడం - ప్రకరణ 103
  • పార్లమెంటు సభలను విడిగాగాని, సంయుక్త సమావేశంలో ఉన్నప్పుడుగాని ప్రసంగించడం - ప్రకరణ 87
  • పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు ఆర్టినెన్స్‌లు జారీచేయడం - ప్రకరణ 123
  • లోక్‌సభలో ఆర్థిక బిల్లులను రాష్ట్రపతి అనుమతితోనే ప్రవేశపెడతారు - ప్రకరణ 117
  • కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌, యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌, ఆర్థిక సంఘం నివేదికలను పార్లమెంటు పరిశీలనకు పంపడం - ప్రకరణ (151(1)), 323(1), 281)
  • లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు నిర్వహించడానికి సభాధ్యక్షుడు లేనప్పుడు తాత్మాలిక సభాధ్యక్షులను నియమించడం - ప్రకరణ (95(1), 91(1)
  • పార్లమెంటు ఆమోదించిన బిల్లులను చట్టాలుగా కావడానికి ఆమోదం తెలపడం - ప్రకరణ 111
  • రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ (రాష్ట్రాల సరిహద్దులు మార్చడం, కొత్తరాష్ర్రాలను ఏర్పాటు చేయడం, రాష్ట్రాల పేర్లు మార్చడం మొదలైన వాటికి సంబంధించిన పార్లమెంటు బిల్లులకు పూర్వానుమతి ఇవ్వడం - ప్రకరణ 3
  • రాష్ట్ర గవర్నర్‌ తనకు పంపించిన రాష్ట్ర బిల్లులను ఆమోదించడం లేదా తిరస్కరించడం - ప్రకరణ 201
  • రాజ్యాంగ సవరణ బిల్లులకు ఆమోద ముద్రవేయడం - ప్రకరణ 368

Post a Comment

0Comments

Post a Comment (0)