రాష్ట్రపతి ఎన్నిక వివాదాలు

TSStudies
0

Presidential Election Controversy

  • రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజకగణంలో కొన్ని ఖాళీలు ఏర్పడితే ఎన్నికలు కొనసాగించాలా, వాయిదా వెయ్యాలా అనే వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ, కొన్ని ఖాళీలు ఉన్నంత మాత్రాన రాష్ట్రపతి ఎన్నికను వాయిదా వెయ్యాల్సిన అవసరం లేదని ప్రకటించింది.
  • ఉదా. 1974లో గుజరాత్‌ విధాన సభ రద్దయ్యింది. కేంద్ర మంత్రి మండలి సలహామీద రాష్ట్రపతి ఈ విషయంపై సుప్రీం కోర్టు సలహాను కోరాడు. రాష్ట్రపతి పదవీ కాలం ముగిసే లోపలే రాష్ట్ర విధాన సభ రద్దయినచో, క్రొత్త రాష్ట్రపతి ఎన్నికను యధాతథంగా జరపవచ్చని సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది.
  • రాష్ట్రపతి ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. నోటిఫికేషన్ల జారీ, ఎన్నికల తేదీ, మొదలగు అన్ని విషయాలను కేంద్ర ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తారు.
  • రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదానికి సంబంధించిన అన్ని విషయాలను ప్రకరణ 71 ప్రకారము సుప్రీం కోర్టులోనే పరిష్కరించుకోవాలి. ఇది సుప్రీం కోర్టు యొక్క ప్రారంభ పరిధిలోకి వస్తుంది.
  • రాష్ట్రపతి ఎన్నికను సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేయాలంటే నియోజకగణంలోని 20 మంది సభ్యులు పిటిషన్‌పై సంతకాలు చెయ్యాలి.
  • ఎన్నిక జరిగిన 30 రోజులలోపే పిటిషన్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది.
  • 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా కొన్ని మార్పులు కూడా చేశారు. అవి

  • ఎ) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నుకునే నియోజక గణంలో ఖాళీలు ఉన్నాయనే ప్రాతిపదికపై ఎన్నికలు వాయిదా వెయ్యమని న్యాయస్థానాలను ఆశ్రయించడానికి వీలులేదు.
  • బి) రాజ్యాంగ పరిమితికి లోబడి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన అంశాలను పార్లమెంటు ఒక చట్టం ద్వారా నిర్ణయించవచ్చు.
  • సి) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటిస్తే, రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి గతంలో తీసుకున్న నిర్ణయాలు, జారీచేసిన ఆదేశాలు చెల్లుబాటు అవుతాయి. రాష్ట్రపతి ఎన్నిక వివాదాన్ని సాధారణ పౌరులు న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీలులేదు. పదవికి పోటీచేసిన అభ్యర్థులకు లేదా నియోజక గణంలోని ఓటర్లకు మాత్రమే ఆ హక్కు ఉంది.
  • డి) సస్పెండ్‌ కాబడిన ఎం.ఎల్‌ఎ, ఎం.పీలు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనవచ్చు.

ప్రత్యేక వివరణ

  • రాష్ట్రపతి ఎన్నికల్లో ఎం.పి.లకు, ఎం.ఎల్‌.ఎ లకు నిర్దేశించిన విధంగా ఫలానా అభ్యర్థికే ఓటు వేయాలని విప్‌ జారీచేసే అధికారం రాజకీయ పార్టీలకు ఉండదు. కారణం, ఈ ఎన్నికలు శాసనసభ బయట జరుగుతాయి. విప్‌ శాసనసభలో జరిగే తీర్మానాలకు, బిల్లులకు మాత్రమే వర్తిస్తుంది.

రాష్ట్రపతి పునర్‌ ఎన్నిక

  • ప్రకరణ 57 ప్రకారం, రాష్ట్రపతి పునర్‌ ఎన్నికకు అర్హుడే, అనగా ఎన్ని పర్యాయాలు అయినా రాష్ట్రపతి పదవికి పోటీ చేయవచ్చు.

ప్రత్యేక వివరణ

  • రాజ్యాంగపరంగా పునర్‌ ఎన్నికకు పరిమితి లేకపోయినప్పటికి, రాజకీయ సాంప్రదాయంగా రెండు పర్యాయాలు మించి ఒకే వ్యక్తి రాష్ట్రపతి పదవిలో కొనసాగకూడదని నియమం పెట్టుకున్నారు. ఈ సాంప్రదాయాన్ని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రతిపాదించారు. ఇంతవరకు డా రాజేంద్ర ప్రసాద్‌ మాత్రమే రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా ఉన్నారు. అమెరికా రాజ్యాగం ప్రకారం అధ్యక్షుడు రెండు పర్యాయాలు మించి కొనసాగడానికి వీలు లేదు.

రాష్ట్రపతి - అర్హతలు

  • ప్రకరణ 58లో రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి అవసరమైన అర్హతలను పేర్కొన్నారు.
  • భారతదేశ పౌరుడై ఉండాలి (సహజ లేదా సహజీకృత పౌరసత్వం)
  • 35 సం॥ నిండి ఉండాలి.
  • ఆదాయం వచ్చే ఏ ప్రభుత్వ పదవిలో ఉండరాదు.
  • శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి.
  • నేరారోపణ బుజువై ఉందరాదు
  • దివాళా తీసి ఉండరాదు.
  • లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావల్సిన ఇతర అర్హతలు ఉండాలి
  • పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి

రాష్ట్రపతి యొక్క అర్హతలకు సంబంధించి చట్టాలను రూపొందించే అధికారము పార్లమెంటుకు ఉంది. రాష్ట్రపతిగా పోటీ చేయడానికి కనీస విద్యార్హత అనేది రాజ్యాంగంలో పేర్కొనలేదు.

ప్రత్యేక వివరణ

  • లాభదాయక పదవుల్లో ఉండరాదు అనే అర్హతకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉదా. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్‌, ముఖ్యమంత్రులు, ఎం.ఎల్‌.ఏ, ఎం.పి.లకు జీతభత్యాలుంటాయి. వారు ఆ పదవులలో కొనసాగుతూనే మరొక పదవికి కూడా పోటీ చేయవచ్చు. పోటీ చేయడానికి ముందే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అయితే, వారు రాష్ట్రపతిగా ఎన్నికైతే వారి సభలో సభ్యత్వాన్ని కోల్పోతారు.
  • ఉదా. ఎం.పి., ఎం.ఎల్‌.ఏ.గా ఉన్న అభ్యర్థి ఆ పదవికి రాజీనామా చేయకుండానే రాష్ట్రపతి పదవికి పోటీచేయవచ్చు. రాష్ట్రపతి పదవికి ఎన్నికయితే ఎం.ఎల్‌.ఏ., ఎం.పి.ల సభ్యత్వం రద్దవుతుంది. ఓడిపోతే సభ్యత్వం కొనసాగుతుంది.కానీ, ప్రభుత్వోద్యోగులు మాత్రం తమ ఉద్యోగానికి, ముందే రాజీనామా చేసి పోటీ చేయాల్సి ఉంటుంది.

షరతులు (Conditions)

  • రాష్ట్రపతిగా పోటీచేసే అభ్యర్థి కొన్ని షరతులను పూర్తి చేయాల్సి ఉంటుంది. 1952లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టాన్ని రూపొందించారు. 1997లో దీనిని సవరించారు. ఈ సవరణ ప్రకారం ఈ క్రింది షరతులు నిర్దేశించారు.
  • అభ్యర్థి నామినేషన్‌ పత్రాన్ని 50 మంది నియాజకగణ సభ్యులు  ప్రతిపాదించాలి మరియు మరొక 50 మంది సభ్యులు బలపరచాలి.
  • అభ్యర్థి నామినేషన్‌ పత్రంతోపాటు రూ. 15,000లు ధరావత్తుగా రిజర్వు బ్యాంకులో డిపాజిట్‌ చేయాలి.

పదవీ ప్రమాణ స్వీకారం

ప్రకరణ 60 ప్రకారం, రాష్ట్రపతిగా ఎన్నికైన అభ్యర్థిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత, లేదా ప్రధాన న్యాయమూర్తి అందుబాటులో లేని పక్షంలో సీనియర్‌ న్యాయమూర్తి చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాష్ట్రపతి తన ప్రమాణాన్ని దేవుని పేరుతో గాని, ఆత్మసాక్షిగా గాని చేస్తారు. - రాజ్యాంగ-శాసనాన్ని పరిరక్షించి, సంపూర్ణ సామర్ధ్యం మేరకు భారత ప్రజల సేవకు, వారి సంక్షేమం కోసం అంకితమవుతానని ప్రమాణం. చేస్తారు. 

గమనిక: ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా వ్యవహరించినపుడు కూడా పై విధంగానే పదవీప్రమాణ స్వీకారం చేయవల్సి ఉంటుంది. 

పదవీకాలం

ప్రకరణ 56 ప్రకారం, రాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకారం రోజు నుండి 5 సం. కాలం పదవిలో ఉంటారు. రాష్ట్రపతి పదవిలో ఈ క్రింది సందర్భాలలో ఖాళీ ఏర్పడుతుంది.

  • పదవీకాలం పూర్తి అయినప్పుడు
  • రాజీనామా చేసినప్పుడు రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి సంబోధిస్తారు. ఒకవేళ ఉపరాష్ట్రపతి అందుబాటులో లేకపోతే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి, అతడు అందుబాటులో లేకపోతే, సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయమూర్తికి సంబోధిస్తారు. ఈ విషయాన్ని లోకసభ స్పీకర్‌కు కూడా తెలియపరచాలి. 
  • (ఈ పరిస్థితి 1969లో అప్పటి రాష్ట్రపతి జాకీర్‌ హుస్సేన్‌ మరణించటం వల్ల ఉత్పన్నమయింది. జాకీర్‌ హుస్సేన్‌ మరణంతో అప్పటి ఉపరాష్ట్రపతి వి.వి. గిరి రాష్ట్రపతిగా వ్యవహరించారు. కొన్ని కారణాలవల్ల వి.వి.గిరి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సంబోధించాలి అనే వినూత్న పరిస్థితి ఏర్పడింది. 1969లో భారత రాష్ట్రపతి వారసత్వ చట్టం ద్వారా ఈ ఏర్పాటును చేశారు. దీనికి రాజ్యాంగ బద్ధత లేదు.)
  • మహాభియోగ (Impeachment) తీర్మానం ద్వారా తొలగించినా ఖాళీ ఏర్పడుతుంది.
  • రాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీం కోర్టు తీర్పు చెబితే ఖాళీ ఏర్పడుతుంది.
  • రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించినప్పుడు ఖాళీ ఏర్పడుతుంది.

ప్రత్యేక వివరణ

  • రాష్ట్రపతి పదవిలో ఉండగా రాజీనామా, మరణం లేదా రాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం వలన ఏర్పడిన ఖాళీని స్వల్ప వ్యవధి అనగా ఆరు నెలలలోగా భర్తీ చేయాలి. 
  • పదవీకాలం సాధారణంగా పూర్తి అయి ఖాళీ ఏర్పడితే, పదవీకాలం ముగియక ముందే కొత్త రాష్ట్రపతిని ఎన్నిక చేసుకోవాలి. అనివార్య కారణాల వల్ల కొత్త రాష్ట్రపతి ఎన్నిక వాయిదా పడితే, ఈ సందర్భంలో ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా వ్యవహరించడానికి అవకాశం లేదు. పదవిలో ఉన్న రాష్ట్రపతి తన పదవీకాలం ముగిసినప్పటికీ, కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యేంతవరకు కొనసాగుతారు. మిగతా సందర్భాలలో, అనగా రాజీనామా, తొలగింపు, మరణం లాంటి సందర్భాలలో కొత్త రాష్ట్రపతిని ఆరు నెలలలోపు ఎంపిక చేసుకోవాలి. అంతవరకు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)