How to Elect Vice President of India
ఉపరాష్ట్రపతి
- భారత రాజ్యాంగ రచనా సంఘం మొదట ఉపరాష్ట్రపతి పదవిని కల్పించలేదు. అయితే రాజ్యాంగ పరిషత్తు ముఖ్య సలహాదారైన బి.ఎన్.రావు చొరవ తీసుకొని, రాష్ట్రపతి మరణించినా లేదా సెలవు తీసుకున్నా లేదా విధులు నిర్వర్తించే పరిస్థితి లేకపోయినా, కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యేంత వరకు సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి మరియు పార్లమెంటులోని సభాధ్యక్షులు ఒక కమీషన్‌గా ఏర్పడి, కేంద్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగించాలని సూచించారు. ఆ తరువాత జరిగిన చర్చలలో హెచ్.పి. కామత్ మొదలగు వారు ఉపరాష్ట్రపతి పదవిని సృష్టించడానికి కృషి చేసారు.
ఉపరాష్ట్రపతి - రాజ్యాంగ స్థానం
- భారత రాజ్యాంగంలో 5వ భాగంలో, ప్రకరణ 68 నుండి 69 వరకు ఉపరాష్ట్రపతికి సంబంధించి సమగ్రమైన వివరణ ఉంది. ఈ పదవిని అమెరికా ఉపాధ్యక్షుని పదవితో పోల్చవచ్చు.
- నిబంధన 63 ప్రకారం భారతదేశానికి ఒక్క ఉపరాష్ట్రపతి ఉంటారు.
ఎన్నిక
- ప్రకరణ 66(1) ప్రకారం పార్లమెంటు ఉభయ సభల సభ్యులు (నామినేటెడ్ సభ్యులతో సహా) నైప్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదలాయింపు పద్ధతిలో (Proportional Representation by Means of Single Transferrable Vote) ఎన్నుకుంటారు. మౌలిక రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఏర్పాటు ఉండేది. 1961లో 11వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రక్రియను మార్చారు. ఉభయ సభలు విడి విడిగా ఓటు చేస్తాయి.
- రాష్ట్రపతి ఎన్లిక వలే ఓటు విలువను. లెక్కించరు. ప్రతి ఓటరు విలువ ఒకటికి సమానం. కనుక మొత్తం ఓట్లు విలువ 790 (లోక్ సభ 545 సభ్యులు + రాజ్యసభ 245 సభ్యులు)
ప్రత్యేక వివరణ
- ఉపరాష్ట్రపతి ఎన్నికలో రాష్ట్ర విధానసభ సభ్యులు పాల్గొనరు. కారణం, ఉపరాష్ట్రపతి అధికార బాధ్యతలు ప్రధానంగా రాజ్యసభకు అధ్యక్షత వహించడం వరకే పరిమితం. చాలా అరుదుగా మాత్రమే రాష్ట్రపతి హోదాలో పదవీ బాధ్యతలు వహిస్తారు. అదికూడా తాత్కాలికంగా మాత్రమే. ఈ విషయాన్ని డా॥ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్ చర్చల్లో పేర్కొన్నారు.
రాష్ట్రపతి - ఉపరాష్ట్రపతి ఎన్నిక పద్ధతిలో పోలికలు
- రాష్ట్రపతి. - ఉపరాష్ట్రపతి ఎన్నిక పద్ధతి ఒకే విధంగా ఉంటుంది. ఎన్నుకునే నియోజక గణంలో మాత్రమే తేడా ఉంటుంది. పార్లమెంటులో ఎన్నికైన సభ్యులు, మరియు రాష్ట్ర విధానసభలకు ఎన్నికైన సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారు. కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులు మాత్రమే పాల్గొంటారు.
ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాలు
- ప్రకరణ 71లో ఈ అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రపతి. మరియు ఉపరాష్ట్రపతికి ఈ నిబంధనలు సమానంగా వర్తిస్తాయి. (ఈ విషయాన్ని రాష్ట్రపతి అధ్యాయంలో వివరించడం జరిగింది)
- ఎన్నికల పిటీషన్ పై నియోజక గనంలోని 10 మంది సభ్యులు సంతకాలు చేయాలి.
ఉపరాష్ట్రపతి - అర్హతలు
ప్రకరణ 66(3)లో ఉపరాష్ట్రపతి అర్హతలు పేర్కొన్నారు.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- 35 సం॥ నిండి ఉండాలి.
- రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావలసిన ఇతర అర్హతలుండాలి.
షరతులు
- ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణంలోని 20 మంది సభ్యులు ప్రతిపాదించాలి. మరొక 20 మంది సభ్యులు బలపరచాలి. అలాగే రూ. 15,000లు ధరావత్తు చెల్లించాలి.
పదవీ కాలం
- ప్రకరణ 67 ప్రకారం, ఉపరాష్ట్రపతి పదవిలోకి ప్రవేశించిన రోజునుండి 5 సం॥లు పదవిలో కొనసాగుతారు. ఎన్ని పర్యాయాలైన పోటీచేయవచ్చు. ఈ విషయాన్ని రాజ్యాంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు.
పదవీ ప్రమాణస్వీకారం
- ప్రకరణ 69 ప్రకారం ఉపరాష్ట్రపతి పదవి చేపట్టేముందు ప్రమాణం చేయాలి. దీనిని రాష్ట్రపతి నిర్వహిస్తారు. ఒకవేళ రాష్ట్రపతి లేకపోతే అతడు సూచించిన వ్యక్తి నిర్వహిస్తారు.
ఉపరాష్ట్రపతి పదవి - ఖాళీ ఏర్పడే పద్ధతి
ఈ క్రింది పద్ధతిలో ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడుతుంది.
- పదవీకాలం పూర్తయినప్పుడు
- రాజీనామా చేసినప్పుడు (ఉపరాష్ట్రపతి రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సంబోధిస్తారు)
- తొలగించినప్పుడు
- సుప్రీంకోర్టు ఉపరాష్ట్రపతి ఎన్నిక తీర్పు చెల్లదని చెప్పినప్పుడు
- మరణించినప్పుడు
తొలగించే పద్ధతి
- ప్రకరణ 67(b)లో పేర్కొన్న పద్ధతి ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగిస్తారు. ఇది మహాభియోగ తీర్మాన ప్రక్రియ కాదు. ఒక సాధారణ పద్ధతి. ఉపరాష్ట్రపతిని తొలగించడానికి ప్రత్యేక కారణాలను రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. కానీ రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణం మీద తొలగించవచ్చు. తొలగించే తీర్మానాన్ని మొదట రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. 14 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలి. ఈ తీర్మానాన్ని రాజ్యసభ మొత్తం సభ్యులలో మెజారిటీ సభ్యులు ఆమోదించి, ఆ తరువాత లోక్‌సభ కూడా ఈ తీర్మానానికి అంగీకారం తెలిపితే ఉపరాష్ట్రపతి తొలగించబడతారు.
- గమనిక : ఇంతవరకు ఏ ఉపరాష్రపతి కూడా తొలగించబడలేదు.
జీతభత్యాలు
- ఉపరాష్ట్రపతికి ప్రత్యేక జీతభత్యాలుండవు. ప్రకరణ 97 ప్రకారం రాజ్యసభ ఛైర్మన్ హోదాలో జీతభత్యాలు పొందుతారు. వీటిని పార్లమెంటు ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది.
- ప్రస్తుతం ఉపరాష్ట్రపతి నెలకు రూ. 4,00,000లు వేతనము మరియు ఇతర సౌకర్యాలు పొందుతున్నారు. అలాగే పెన్షన్ సౌకర్యం కూడా ఉంటుంది.
ఉపరాష్ట్రపతి అధికారాలు
ఉపరాష్ట్రపతి రెండు ముఖ్యమైన అధికారాలు నిర్వహిస్తారు.
- రాజ్యసభకు హోదా రీత్యా అధ్యక్షుడిగా వ్యవహరించడం (ప్రకరణ 64 ప్రకారం)
- తాత్మాలిక రాష్ట్రపతిగా వ్యవహరించడం (ప్రకరణ 65)
- ఉపరాష్ట్రపతి పదవీ రీత్యా రాజ్యసభకు (Ex-Officio) అధ్యక్షుడు. ఈ హోదాలోనే రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. సభా సమావేశాలు నిర్వహిస్తాడు. పార్లమెంటు సంస్థలతో రాజ్యసభ జరిపే అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు ఉపరాష్ట్రపతి పేరుతోనే జరుగుతాయి. ఉపరాష్ట్రపతి రాజ్యసభలో సభ్యుడు కానందువల్ల సాధారణ ఓటు హక్కు ఉండదు. కానీ, బిల్లుకు అనుకూల మరియు వ్యతిరేక ఓట్లు సమానంగా వచ్చినప్పుడు, నిర్జాయిక ఓటు హక్కు (Casting Vote) ను వినియోగిస్తాడు.
- ప్రకరణ 65 ప్రకారం, కొన్ని సందర్భాలలో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. రాష్ట్రపతి పదవిలో ఖాళీ ఏర్పడినప్పుడు (మరణం, తొలగింపు, రాజీనామా కారణాల వల్ల) గరిష్టముగా 6 నెలలు మించకుండా, లేదా కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యేంతవరకు రాష్ట్రపతిగా (Acting President) గా వ్యవహరిస్తారు.
- ప్రకరణ 65(2) ప్రకారం, రాష్ట్రపతి అనివార్య కారణాల వల్ల తన విధులను నిర్వర్తించకపోతే ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి విధులను నిర్వర్తిస్తాడు (Discharging Functions). దీనికి నిర్ణీత గడువు ఉండదు. ఉదా. జ్ఞాని జైల్‌సింగ్ అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఉపరాష్ట్రపతిగా ఉన్న హిదయతుల్లా 25 రోజులపాటు రాష్ట్రపతి విధులను నిర్వహించారు.
- ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా వ్యవహరించినప్పుడు లేదా రాష్ట్రపతి విధులను నిర్వహించిన సందర్భాలలో, రాష్ట్రపతికి ఉన్న అన్ని అధికారాలను, సౌకర్యాలను జీతభత్యాలను పొందుతారు. ఈ సమయంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌గా కొనసాగరాదు.
- పైన పేర్కొన్న విధులే కాక, ఉపరాష్ట్రపతి కొన్ని రాజ్యాంగేతర విధులను కూడా నిర్వర్తిస్తారు. భారతరత్న మరియు పద్మ అవార్డుల కమిటీకి అధ్యక్షుడిగా, దేశంలో కొన్ని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా వ్యవహరిస్తారు. రాజ్యాంగపరంగా, రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి ద్వితీయ స్థానం కలిగిఉంటాడు.
- రాజ్యాంగపరంగా ఉపరాష్ట్రపతికి ఎక్కువ అధికారాలు, విధులు సంక్రమించలేదు. అమెరికా ఉపాధ్యక్షునితో పోలిస్తే భారత ఉపరాష్ట్రపతి పదవి చాలా అప్రధానమైనది. అమెరికాలో అధ్యక్ష పదవి అనుకోకుండా ఖాళీ ఏర్పడితే మిగిలిన కాలానికి అమెరికా ఉపాధ్యక్షుడు అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. కానీ, భారతదేశంలో ఉపరాష్ట్రపతి గరిష్టంగా ఆరు నెలలు మాత్రమే రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు.
- టి.కె. తోపే అనే రచయిత ఉపరాష్ట్రపతిని వేల్స్ యువరాజుతో పోల్చాడు. రచయిత మాటల్లో “ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతి ఎన్నో సమస్యల పరిష్కార విషయంలో ఉపరాష్రపతిని సంప్రదిస్తారు. ఆయన పరిపక్వత, దూరదృష్టి వారికి లాభకరంగా ఉంటాయి.”
- రాజ్యాంగం రాష్ట్రపతి కిచ్చినంత గొప్ప గౌరవం ఇవ్వకపోయినా ఈ పదవి ఉపయోగకరమైనది మరియు ప్రతిష్టాకరమైనదని ఎం.వి. పైలీ అనే రాజ్యాంగ నిపుణుడు పేర్కొన్నారు.
ఉపరాష్ట్రపతులు
1. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952-1957
2. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1957-1962
3. డా. జాకీర్ హుస్సేన్ 1962-1967
4. డా. వరాహగిరి వెంకటగిరి 1967-1969
5. గోపాల్ స్వరూప్ పాథక్ 1969-1974
6. బి.డి. జెట్టి 1974-1979
7. ఎం. హిదయతుల్లా 1979-1984
8. ఆర్. వెంకటరామన్ 1984-1987
9. డా. శంకర్‌దయాల్ శర్మ 1987-1992
10. కె.ఆర్. నారాయణన్ 1992-1997
11. కృష్ణకాంత్ 1997-2002
12. బి.ఎస్. షెకావత్ 2002-2007
13. మహమ్మద్ హమీద్ అన్సారీ 2007-2012
14. మహమ్మద్ హమీద్ అన్సారీ 2007-2017
15. వెంకయ్య నాయుడు 2017-2022
16. జగదీప్ ధన్‌ఖడ్, రాజస్థాన్ (2022 -
విశ్లేషణ
- ఉపరాష్ట్రపతులుగా పనిచేసి ఆ తరువాత రాష్ట్రపతులు అయినవారు 1. సర్వేపల్లి రాధాకృష్ణన్ 2. జాకీర్ హుస్సేన్ 3.వి.వి.గిరి 4. ఆర్. వెంకట్రామన్ 5. శంకర్ దయాల్ శర్మ 6. కె.ఆర్. నారాయణన్
- ఏకగ్రీవంగా ఎన్నికైన ఉపరాష్ట్రపతులు 1. సర్వేపల్లి రాధాకృష్ణన్ 2. యం.హిదయతుల్లా 3. శంకర్ దయాల్ శర్మ
- అత్యధిక మెజారిటీతో ఎన్నికైన ఉపరాష్ట్రపతి కెఆర్.నారాయణన్ (700 ఓట్లు)
- రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతియైన వారు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు మహ్మద్ హమీద్ అన్సారీ
- అతి తక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా పనిచేసినవారు వి.వి.గిరి
- పదవిలో మరణించిన ఏకైక ఉపరాష్ట్రపతి కె.కృష్ణకాంత్
- తొలి దళిత ఉపరాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్
- ఉపరాష్ట్రపతిగా పనిచేసి ఆ తర్వాత రాష్ట్రపతిగా పోటిచేసి ఓడిపోయిన వ్యక్తి బైరాన్‌సింగ్ షెకావత్
- తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఉపరాష్ట్రపతి వి.వి.గిరి (మే 3 1969 నుండి 20 జులై 1969)
- తాత్మాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన రెండవ ఉపరాష్ట్రపతి బిడి. జెట్టి (ఫిబ్రవరి 11 1977 నుండి 25 జులై 1977)
- తాత్మాలిక రాష్ట్రపతిగా విధులు మాత్రమే నిర్వహించిన ఉపరాష్ట్రపతి (Discharging functions) ఎన్.హిదయతుల్లా (6 అక్టోబర్ 1982 నుండి 31 అక్టోబర్ 1982)