ప్రధానమంత్రి - మంత్రిమండలి
- భారత రాజ్యాంగం పార్లమెంటరీ లేదా మంత్రివర్గ పాలిత ప్రభుత్వాన్ని నిర్దేశించింది. పార్లమెంటరీ వ్యవస్థ ముఖ్య లక్షణం రెండు రకాలైన అధిపతులు ఉండటం. రాజ్యాంగపరంగా ఉండే రాష్ట్రపతి నామమాత్ర అధికారాన్ని కలిగి ఉంటే, ప్రధాన మంత్రి అధ్యక్షతన ఉన్న మంత్రి మండలి అన్ని అధికారాలను చెలాయిస్తుంది.
- రాజ్యాంగ రీత్యా దేశాధిపతి (Head of State) రాష్ట్రపతి అయితే ప్రధాన మంత్రి అధ్యక్షత ఉన్న మంత్రి మండలి వాస్తవమైన కార్య నిర్వాహక అధికారాలను కలిగి ఉంటుంది. భారతదేశంలో బ్రిటీష్‌తరహా పార్లమెంటరీ వ్యవస్థ ఉంది. దీనినే “వెస్ట్ మినిస్టర్” (West Minister) పద్ధతి అని కూడా అంటారు.
ప్రత్యేక వివరణ
- వెస్ట్ మినిస్టర్ అనేది ఇంగ్లాండ్‌లో ఒక ప్రాంతం. అక్కడే పార్లమెంటు భవనం ఉంది. అందువల్ల దీనికి ఆ పేరు వచ్చింది.
ప్రధానమంత్రి - మంత్రిమండలి రాజ్యాంగ స్థానం
- భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో, ప్రకరణలు 74, 75 మరియు 78లో ప్రధాన మంత్రి మరియు కేంద్ర మంత్రి మండలికి సంబంధించిన వివరాలను పొందుపర్చారు.
ప్రకరణ 74(1)
- రాష్ట్రపతికి తన విధులు నిర్వహణలో సహాయ సలహాలను అందించడానికి ప్రధాన మంత్రి అధ్యక్షతన మంత్రి మండలి ఉంటుంది. వీరి సలహా మేరకే రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించాలి.
ప్రత్యేక వివరణ
- మౌలిక రాజ్యాంగంలో మంత్రి మండలి సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి అని అర్ధం వచ్చేలా ఎలాంటి పదబంధం లేదు. అయితే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రకరణకు “షల్” (Shall) అనే పదం చేర్చడం వలన రాష్ట్రపతి మంత్రి మండలి సలహా మేరకే తన విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది.
- 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రకరణ 74లో మరొక అంశాన్ని చేర్చారు. రాష్ట్రపతి మంత్రి మండలి నిర్ణయాన్ని వారి పునర్ పరీశీలనకు పంపవచ్చు. పునర్ పరిశీలనకు పంపబడిన అంశాలను మంత్రి మండలి మార్పు చేయవచ్చు, చేయకపోవచ్చు. రెండవ పర్యాయం రాష్ట్రపతి ఆమోదానికి పంపితే ఆ అంశాలను రాష్ట్రపతి తప్పకుండా ఆమోదాన్ని తెలపాల్సి ఉంటుంది.
- ప్రకరణ 74(2) ప్రకారం, మంత్రిమండలి రాష్ట్రపతికి ఏ సలహా ఇచ్చారో, ఆ సలహా ఎందుకు ఇచ్చారో న్యాయస్థానాల్లో ప్రశ్నించడానికి వీలులేదు.
ప్రధాన మంత్రి - మంత్రి మండలి నియామకం
- ప్రకరణ 75(1) ప్రకారం, ప్రధాన మంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. అలాగే, ప్రధాని సలహా మేరకు ఇతర మంత్రులు రాష్ట్రపతి చేత నియమించబడతారు.
- ప్రకరణ 75(1A) ప్రకారం, కేంద్రంలో మంత్రిమండలి సంఖ్య, ప్రధాన మంత్రితో కలిపి లోక్‌సభ సభ్యుల మొత్తం సంఖ్యలో 15% శాతానికి మించరాదు.
- ప్రకరణ 75(1B) ప్రకారం, ఏదైనా గుర్తింపబడిన రాజకీయ పార్టీకి చెందిన సభ్యుడు పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్దుడైతే, అతడిని మంత్రిగా నియమించరాదు. ఈ అనర్హత అతడు మంత్రిగా ఉన్న కాలంలో జరిగితే, అది అతడి సభ్యత్వ కాలం ముగియువరకు కొనసాగుతుంది. ఒకవేళ తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి విజయాన్ని సాధిస్తే, అంతటితో అనర్హత ముగుస్తుంది.
గమనిక: 75(1A), (1B) క్లాజులను 2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
- ప్రకరణ 75(2) ప్రకారం, రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకు ప్రధాన మంత్రి మరియు మంత్రి మండలి తమ తమ పదవులలో కొనసాగుతారు.
- ప్రకరణ 75(3) ప్రకారం, మంత్రులు సంయుక్తంగా లోక్‌సభకు బాధ్యత వహిస్తారు.
- ప్రకరణ 75(4) ప్రకారం, మంత్రులందరు తమ పదవిలోకి ప్రవేశించే ముందు 3వ షెడ్యూల్‌లో పేర్కొన్న నమూనా ప్రకారం రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణం చేయాలి
- ప్రకరణ 75(5) ప్రకారం మంత్రులు ఎవరైనా ఆరు నెలలపాటు పార్లమెంటు సభ్యునిగా లేనిచో తమ మంత్రి పదవిని కోల్పోతారు.
- ప్రకరణ 75(6) ప్రకారం, మంత్రుల జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. వీటి ప్రస్తావన 2వ షెడ్యూల్‌లో ఉంది.
వివరణ - విశ్లేషణ
- ప్రధాని నియామకానికి సంబంధించి రాజ్యాంగంలో ప్రత్యేకమైన ప్రక్రియ పేర్కొనలేదు. పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం, లోక్‌సభ ఎన్నికలలో అత్యధిక స్థానాలు సాధించిన రాజకీయ పార్టీ యొక్క నాయకుడిని రాష్ట్రపతి ఆహ్వానించి, ప్రధాన మంత్రిగా నియమించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కోరతాడు.
- అయితే, లోక్‌సభలో ఏ రాజకీయ పార్టీకి నిర్దిష్టమైన మెజారిటీ సీట్లు లభించనప్పుడు, రాష్ట్రపతి తన విచక్షణాధికారాన్ని వినియోగించి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరచే క్రమంలో అత్యధిక స్థానాలు సాధించిన రాజకీయపార్టీ లేదా పార్టీల కూటమి యొక్క నాయకుడిని ప్రధానిగా నియమించి, మెజారిటీ నిరూపించుకోమని కోరతారు.
- ఉదాహరణకు, 1979లో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, చరణ్‌సింగ్‌ను ప్రధానిగా నియమించడం కొంత వివాదానికి దారితీసింది. ఆనాటి ప్రతిపక్షనాయకుడైన వై.బి.చవాన్‌ను ప్రభుత్వంను ఏర్పాటు చేయమని రాష్ట్రపతి సంజీవరెడ్డి ఆహ్వానించారు. కానీ, చవాన్ తన అశక్తతను వ్యక్తపరిచాడు. ఈ పరిస్థితిలో, జగ్జీవన్‌రామ్‌ను విస్శరించి చరణ్‌సింగ్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించడం వివాదానికి కారణమయింది. అయితే, చరణ్‌సింగ్ లోక్‌సభ సమావేశాలకు హాజరు కాకుండానే ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
- ఈ విధంగా లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ లేకుండా 1989లో వి.పి.సింగ్, 1990లో చంద్రశేఖర్, 1991లో పి.వి.నరసింహారావు, 1996లో ఎ.బి.వాజ్‌పేయి, 1996లో దేవెగౌడ, 1997లో ఐ.కె.గుజ్రాల్, తిరిగి 1998లో ఎ.బి.వాజ్‌పేయి, 2004 మరియు 2009లో మన్మోహన్ సింగ్‌లు ప్రధానమంత్రులుగా నియమించబడ్డారు.
సుప్రీం కోర్టు తీర్పులు
- మెజారిటీ కోల్పోయిన ప్రధాన మంత్రి రాజీనామా చేసి, తదనంతరం లోక్‌సభ రద్దయితే, ఆ వ్యక్తిని ఆపదర్మ ప్రధానమంత్రిగా (Care taker) కొనసాగించి పరిపాలన చేయవచ్చు. అయితే విధాన నిర్ణయాలు చేయరాదని 1971లో యు.ఎన్.రావు Vs ఇందిరా గాంధీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ప్రధానమంత్రి అర్హతలు
- రాజ్యాంగంలో ప్రధాన మంత్రి పదవికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక అర్హతలు పేర్కొనలేదు. అయితే పార్లమెంటులో సభ్యుడిగా ఉండాలి. నియమించబడే సమయానికి పార్లమెంటులో సభ్యత్వం లేకపోతే, నియమించిన రోజునుండి ఆరు నెలలలోపు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావాలి.
ప్రత్యేక వివరణ
- రాజ్యాంగపరంగా ప్రధాన మంత్రిగా నియమింపబడటానికి పార్లమెంటు సభ్యుడయితే చాలు. సాధారణంగా ప్రధానమంత్రి లోక్‌సభలో సభ్యుడై ఉండాలి. రాజ్యసభలో సభ్యులుగా ఉండి ప్రధాన మంత్రులైనవారు ఇందిరా గాంధీ (1966), దేవెగౌడ (1996), ఇందర్ కుమార్ గుజ్రాల్ (1997), మన్మోహన్ సింగ్ (2004), (2009)
ప్రధాని పదవీ కాలం - పదవీ ప్రమాణ స్వీకారం - జీతభత్యాలు
- ప్రధాన మంత్రి చేత రాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాజ్యాంగపరంగా భారత ఐక్యతను, సమగ్రతను పరిరక్షిస్తామని, నమ్మకంతో, నిర్భయంగా మరియు నిజాయితీగా విధులను నిర్వర్తిస్తామని ప్రధాన మంత్రి ప్రమాణం చెయ్యాలి.
- సాధారణంగా ప్రధాన మంత్రి పదవీ కాలం 5 సంవత్సరాలు. లోక్‌సభ విశ్వాసం మరియు మెజారిటీ పైన వాస్తవ పదవీ కాలం ఆధారపడి ఉంటుంది. ప్రధాన మంత్రి మరియు ఇతర మంత్రుల జీతభత్యాలను పార్లమెంటు ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. పార్లమెంటు సభ్యులకొచ్చే జీత భత్యాలు మరియు ఇతర సౌకర్యాలు కలిగి ఉంటారు.
- ప్రకరణ 78 ప్రకారం, రాష్ట్రపతికి ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని తెలియచేయుట ప్రధాన మంత్రి బాధ్యత.
- ప్రకరణ 78(a) ప్రకారం, కేంద్ర మండలి నిర్ణయాన్ని ప్రధాన మంత్రి రాష్ట్రపతికి తెలియచేస్తారు.
- ప్రకరణ 78(b) ప్రకారం, ప్రభుత్వానికి సంబంధించిన ఇతర సమాచారాన్ని రాష్ట్రపతి ప్రధాన మంత్రి ద్వారా తెలుసుకోవచ్చు.
- ప్రకరణ 78(c) ప్రకారం సమర్పించిన సమాచారం ప్రకారం, ఏదైనా అంశం మంత్రి చేసిన నిర్ణయమా లేదా మంత్రి మండలి చేసిన నిర్ణయమా అనే సంశయం ఉన్నప్పుడు, దానిని మంత్రిమండలి పరిశీలనకు పంపమని రాష్ట్రపతి ప్రధాన మంత్రిని కోరవచ్చు.
ప్రత్యేక విశ్లేషణ
- మంత్రి మండలి ఏర్పాటు పూర్తిగా ప్రధాన మంత్రి యొక్క విశిష్టాధికారం (Prerogative). ఎవరిని మంత్రిగా తీసుకోవాలి, ఎవరిని తొలగించాలి, ఎలా పునర్‌వ్యవస్థీకరించాలి అనేది ప్రధాన మంత్రి అభీష్టం. అయితే ఇందులో రాజకీయ పరమైన అంశాలు, వివిధ వర్గాలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం, పరిపాలనా సౌలభ్యం, మొదలగు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, అధికార పార్టీ ప్రయోజనాల దృష్టా, ప్రధాన మంత్రికి ఇష్టం లేకపోయినా కొందరు ప్రముఖులను మంత్రి మండలిలోకి తీసుకోవాల్సి వస్తుంది.
- మంత్రిమండలి సంయుక్త బాధ్యతతో పనిచేసేలా చూడవలసిన బాధ్యత కూడా ప్రధాన మంత్రిదే. రాష్ట్రపతికి మరియు మంత్రి మండలికి ప్రధాన మంత్రి అనుసంధానకర్తగా వ్యవహరిస్తారు.
ప్రధాన మంత్రి పదవీకాలం, తొలగింపు
- సాధారణంగా ప్రధాన మంత్రి పదవీకాలం లోక్‌సభతో పాటుగా ఐదు సంవత్సరాలు ఉంటుంది. అయితే ఇది లోక్‌సభలోని మెజారిటీ సభ్యుల విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. తన పదవిలో కొనసాగుటకు ఇష్టపడనిచో రాష్ట్రపతికి రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారు. ప్రధాన మంత్రి రాజీనామా చేస్తే, మంత్రిమండలి స్వతహాగా రద్దు అవుతుంది. పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారం, ప్రధాన మంత్రి ఈ దిగువ పరిస్థితుల్లో పదవి కోల్పోతారు.
- లోక్‌సభలో మంత్రి మండలిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినపుడు
- లోక్‌సభలో విశ్వాసం పొందగోరిన ఆ తీర్మానం మెజారిటీ లభించనపుడు.
- లోక్‌సభ ద్రవ్య బిల్లును తిరస్కరించింప్పుడు.
- బడ్జెట్‌పై కోత తీర్మానం నెగ్గినప్పుడు
- రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానం వీగిపోవడం లేదా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణ తీర్మానం నెగ్గటం.
ప్రధాన మంత్రిని బర్త్‌రఫ్ చేయవచ్చా?
- ప్రకరణ 75(2) ప్రకారం, రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకే మంత్రి మండలి అధికారంలో ఉంటుంది. రాష్ట్రపతికి మంత్రి మండలిపై విశ్వాసం కోల్పోతే వారిని తొలగించగలడా అనే సంశయం ఉంది. ప్రకరణలో వాడిన పదజాలానికి స్థూలంగా అర్థం చెప్పినట్లయితే ప్రధాన మంత్రిని, మంత్రిమండలిని రాష్ట్రపతి తొలగించగలడు. కానీ ఆచరణలో మాత్రం అది లాంఛనప్రాయమైనది అని తెలుస్తోంది. లోక్‌సభలో ప్రధానిపట్ల విశ్వాసం చెక్కుచెదరనంతవరకు అతనిని పదవినుంచి తొలగించడం సాధ్యపడకపోవచ్చు.
ప్రధాన మంత్రి అధికారాలు - విధులు
- ప్రధాన మంత్రి కేంద్ర ప్రభుత్వాధిపతి. కేంద్ర మంత్రి మండలికి అధ్యక్షుడు. ఇతనికి విశేషమైన అధికారాలు, విస్తృతమైన విధులు ఉన్నాయి. అయితే, రాజ్యాంగంలో ఈ అధికారాల గురించి ప్రత్యేకంగా పేర్కొనలేదు.
ప్రధానమంత్రి - మంత్రి మండలి
- మంత్రి మండలి ఎంపికలో ప్రధానిదే అంతిమ అధికారం. మంత్రి మండలిలో మార్పులు, చేర్పులు ప్రధాన మంత్రి ఇష్టాయిష్టాలపైన ఆధారపడి ఉంటుంది.
- మంత్రులకు శాఖలను కేటాయిస్తాడు.
- మంత్రి మండలికి అధ్యక్షత వహిస్తాడు.
- సక్రమంగా పనిచేయని మంత్రులను రాజీనామా చేయమని కోరతాడు. అలాగే, అలాంటి మంత్రులను తొలగించమని రాష్ట్రపతికి సలహా యిస్తాడు.
లోక్‌సభ నాయకుడు
- ప్రధానిమంత్రి లోక్‌సభలో సభ్యుడైతే, లోక్‌సభకు నాయకుడిగా వ్యవహరిస్తారు.
- లోక్‌సభలో ప్రధాన వక్తగా (Spokes Person) ఉంటారు.
- ప్రధాని సలహా మేరకే రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేస్తాడు.
- పార్లమెంటు సమావేశాలు, దీర్ఘకాలిక వాయిదా మొదలగు అంశాలపై రాష్ట్రపతికి సలహాలిస్తాడు.
రాష్ట్రపతికి, మంత్రి మండలికి అనుసంధాన కర్త
- ప్రకరణ 78 ప్రకారం, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియచేస్తాడు.
- రాష్ట్రపతి కోరిన సమాచారమును, ఇతర అంశాలను రాష్ట్రపతికి తెలియజేస్తాడు.
- దేశంలో అన్ని ముఖ్య నియామకాలు ప్రధాని నిర్ణయం మేరకే జరుగుతాయి.
ఇతర అధికారాలు
- నీతి ఆయోగ్‌కు, జాతీయాభివృద్ధి మండలి, జాతీయ సమగ్రతా మండలి, అంతర్ రాష్ట్ర మండలి, జాతీయ జలాల వనరుల మండలి, జాతీయ భద్రతా మండలి, జాతీయ జలవనరుల మండలి, విపత్తు నిర్వహణ మండలి, జాతీయ నైపుణ్యత అభివృద్ధి మండలి, మొదలగు వాటికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
- క్యాబినెట్ ముఖ్య కమిటీలైన నియామకాల కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీ, అంతర్జాతీయ వ్యవహారాల కమిటీకి ఛైర్మన్‌గా ఉంటారు.
- అంతర్జాతీయ వ్యవహారాలలో ప్రధాన మంత్రిదే కీలక పాత్ర. ప్రధాన మంత్రి కేంద్ర ప్రభుత్వానికి అధికార ప్రతినిధి, జాతికి నాయకుడు మరియు సంక్షోభాల నివారణా నిర్వాహకుడు.
ప్రధాన మంత్రి ప్రాబల్యం పెరగడానికి కారణాలు
రాజ్యాంగపరంగా ప్రధాన మంత్రికి ప్రత్యేక హోదా లేనప్పటీకి, రాజకీయంగా కీలకపాత్ర వహిస్తాడు. ప్రధాన మంత్రి ప్రాబల్యం పెరగడానికి ఈ క్రింది కారణాలను చెప్పవచ్చు.
- పార్టీ యంత్రాంగ గతిశీలక విధానాలు
- పార్లమెంటు సభ్యుల ప్రభావం తగ్గడం
- ఆకర్షణీయమైన, సమ్మోహక నాయకత్వం
- జనాకర్షక విధానాలు
- పార్టీలో, ప్రభుత్వంలో అధికార కేంద్రీకరణ. ప్రసార సాధనాల పాత్ర
- విదేశీ విధానాల రూపకల్పనలో పాత్ర
ప్రధాని పాత్రపై ప్రముఖుల వ్యాఖ్యానాలు
- ప్రధాని సమానుల్లో ప్రధముడు (First among equal) - లార్డ్ మార్లే
- క్యాబినెట్ సౌధానికి మూల స్తంభం లాంటివాడు (Key stone of cabinet arch) - లార్డ్ మార్లే
- మొదట్లో ప్రధాన మంత్రి సమానులలో ప్రథముడైనా ప్రస్తుతము మాత్రం చుక్కల్లో చంద్రుడు (Moon among the stars - Inter stellas lunaor minaros) - హెర్బర్ట్ మారిసన్
- రాజ్యమనే నౌకకు ప్రధాన మంత్రి చోదక చక్రం వంటివాడు. - రామ్‌సే మ్యూర్
- ప్రధాన మంత్రి మంత్రి మండలిలో కేంద్రకం, జీవం మరియు మరణకారకం కనుక ఇతడు ప్రభుత్వ యంత్రాంగానికి ఇరుసు వంటివాడు. - హెచ్.జె. లాస్కి
- ప్రభుత్వం దేశానికి యజమాని అయితే ప్రధాన మంత్రి ప్రభుత్వానికి యజమాని. - హెచ్.ఆర్.జి. గ్రీవ్స్
- రాజ్యమనే నౌకకు ప్రధాన మంత్రి కెప్టెన్ - మన్రో
- ప్రధాన మంత్రి సూర్యుడయితే, సూర్యుని చుట్టు తిరిగే గ్రహాలే మంత్రులు - ఐవర్ జన్నింగ్స్
- ప్రధాన మంత్రిగా వ్యవహరించేవారు హుందాతనం, అధికారము, ధృఢత్వం, నేర్పరితనం, సమయస్ఫూర్తి, వాస్తవికత, ప్రశాంతత, ప్రజలకు అందుబాటు, వ్యక్తిగతంగా దయ, దూరదృష్టి వంటి లక్షణాలు ఉండాలని పేర్కొన్నారు. భారత ప్రధాన మంత్రి చుక్కల్లో చంద్రుడు - విలియం హార్‌కోర్ట్
- భారత ప్రధాన మంత్రిని అమెరికా అధ్యక్షునితో పోలిస్తే, ప్రధానమంత్రే సరియైన పోలికవుతుంది కానీ రాష్ట్రపతి కాదు - బి.ఆర్. అంబేద్కర్
ఉప ప్రధాన మంత్రి (Deputy Prime Minister)
- డిప్యూటీ ప్రధాన మంత్రి పదవికి సంబంధించి రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదు కనుక ఈ పదవి రాజ్యాంగేతర పదవి అవుతుంది. రాజకీయ కారణాలు, ప్రాంతీయ రాజకీయాలు ఈ పదవి ఏర్పాటుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఉప ప్రధాన మంత్రి కూడా మంత్రి మండలిలో అంతర్భాగం. ప్రత్యేక అధికారాలు విధులు ఉండవు. ఒక క్యాబినెట్ మంత్రి తనకు కేటాయించిన శాఖలను నిర్వర్తిస్తాడు. ఉపప్రధాని హోదాతో పదవీ ప్రమాణ స్వీకారం చేయవచ్చునని 1989లో కేంద్ర మంత్రివర్గంలో ఉప ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవీలాల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ఇంతవరకు ఉపప్రధానులుగా పనిచేసినవారు
1. సర్టార్ వల్లభ్‌భాయ్ పటేల్ 1947-50
2. మొరార్జీ దేశాయ్ 1967-69
3. చరణ్ సింగ్ 1977-79
4. జగ్జీవన్‌రామ్ 1977-79
5. వై.వి. చవాన్ 1979-80
6. దేవీలాల్ 1989-90, 1990-91
7. లాల్‌కృష్ణ అద్వాని 2002-04